ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , గురువారం, 23 సెప్టెంబరు 2021 (14:19 IST)

డ్వాక్రా మహిళలకు శుభ‌వార్త‌... అక్టోబ‌రు 7 నుంచి నేరుగా అకౌంట్‌లోకి డ‌బ్బు!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని డ్వాక్రా మహిళలకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీపి క‌బురు అందిస్తోంది. వైఎస్ ఆస‌రా కింద అక్క చెల్లెళ్ళ‌ల‌కు అక్ష‌రాలా రూ.6,500 కోట్లు అందించే ప‌నిలో ప్ర‌భుత్వం త‌ల‌మున‌క‌లై ఉంది. వైసీపీ ప్ర‌భుత్వం చేపడుతున్న ఈ అతిపెద్ద కార్యక్రమం ఒక్కో మండలం...ఒక్కో యూనిట్‌గా అమ‌లవుతోంది. దీని వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 లక్షల మందికిపైగా అక్క చెల్లెమ్మలు లబ్ధిపొందుతారని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 
 
ఏపీలో డ్వాక్రా మహిళలకు నిజంగా ఇది గుడ్ న్యూస్. అక్టోబర్ 7 నుంచి రెండో విడత ఆసరా సొమ్మును డ్వాక్రా మ‌హిళ‌ల‌కు వారి వారి బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జ‌మ చేసేందుకు జ‌గ‌న్ ప్రభుత్వం క‌స‌ర‌త్తులు చేస్తోంది. రాష్ట్రంలో 80 లక్షల మంది లబ్దిదారుల‌కు ఈ వై.ఎస్. ఆస‌రా ల‌భించ‌నుంది. అక్టోబర్‌ 7 నుంచి వరుసగా 10 రోజుల పాటు విజయ దశమి కానుకగా రెండో విడత ఆసరా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. 
 
స్పందన కార్యక్రమంలో భాగంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ కీలక ప్రకటన చేశారు. అక్టోబర్‌ 7 నుంచి 10 రోజుల పాటు ఆసరా పథకంపై నిర్వహించే అవగాహన, చైతన్య కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొంటారని చెప్పారు. ఆ రోజుల్లో ఆసరా చెక్కుల పంపిణీయే కాకుండా ఆసరా, చేయూత, దిశ ద్వారా రాష్ట్రంలో మహిళా సాధికారతకు ఏ విధంగా అడుగులు వేశామో ప్రజలకు వివరిస్తారన్నారు.
 
ఆసరా, చేయూత ద్వారా జీవితాలను మెరుగు పరుచుకున్న వారి విజయాలను మహిళలకు వివరిస్తారని తెలిపారు. ఈ పథకాల ద్వారా వారి జీవితాలను ఎలా మార్చుకోవచ్చో కూడా వివరిస్తారని, ప్రభుత్వం చేపడుతున్న ఈ అతిపెద్ద కార్యక్రమం మండలం యూనిట్‌గా జరుగుతుందన్నారు. దాదాపు రూ.6,500 కోట్లు వైఎస్సార్‌ ఆసరా కింద ఇస్తున్నామని, దాదాపు 80 లక్షల మందికిపైగా అక్క చెల్లెమ్మలు లబ్ధిపొందుతారని చెప్పారు. 
 
అలాగే రాష్ట్రవ్యాప్తంగా చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. అక్టోబర్‌ 19న జగనన్న తోడు కార్యక్రమం ఉంటుంది. దీని కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు అందజేస్తామన్నారు. అక్టోబర్‌ 26న రైతులకు ‘వైఎస్సార్‌ సున్నావడ్డీ రుణాలు’ కార్యక్రమం ఉంటుందని, దీంతో పాటు ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత అమలు చేస్తామన్నారు. పట్టణాలు, గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించిన క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమం ‘క్లాప్‌’ అక్టోబర్‌ 1న ప్రారంభం అవుతుంద‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. ఇలా రాష్ట్రంలో వ‌చ్చే రెండు మూడు నెల‌లు ప్ర‌భుత్వ ప‌థ‌కాల విత‌ర‌ణ సందడి నెల‌కొంటుంది.