వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి 2021 సంవత్సరం సంక్షేమం, అభివృద్ధి నామ సంవత్సరం అని వైసీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. వైయస్సార్ సీపీకి ఇది అద్భుతమైన సంవత్సరం అని, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకు ఏడుపు డ్రామా నామ సంవత్సరం అని చెప్పారు. ఇక దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి చీప్ లిక్కర్ నామ సంవత్సరం అని, పవన్ కల్యాణ్ కు ఎప్పటిలాగానే కొత్త పార్టనర్లు, కొత్త ప్యాకేజీల సంవత్సరం అన్నారు. అలాగే వామపక్ష పార్టీలకు భూస్వామ్య అనుకూల పోరాటాలు చేసి భ్రష్టు పట్టిన నామ సంవత్సరం అన్నారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఈ ఏడాదిలో అన్నీ విజయాలేనని, స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మున్సిపల్, నగర ఎన్నికల వరకు... ఎక్కడ ఎన్నికలు పెట్టినా అద్భుత విజయాలు సాధించిన మహత్తర సంవత్సరం 2021 అన్నారు. 30 మాసాల్లో 1.16 లక్షల కోట్ల రూపాయలు నవరత్నాలు ద్వారా ప్రజలకు డీబీటీ ద్వారా నేరుగా చేరవేసిన సంవత్సరం అని తెలిపారు.
ప్రతిపక్షాలు తెలుగుదేశం, బీజేపీ, సీపీఎం, సీపీఐ, జనసేన, కాంగ్రెస్‌పార్టీలకు కడుపుమంట నామ సంవత్సరం అన్నారు. ఇంతటి గొప్ప సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన చరిత్ర వారికి లేదు. ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. కమ్యునిస్టులు కూడా ఎప్పుడూ ఇంత గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన చరిత్రలేదన్నారు.
చంద్రబాబు పాలనలో మాదిరిగా అప్పులు అవినీతి అయినప్పుడు తప్పు. అప్పులన్నీ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చేస్తుంటే మీరు వెంటపడుతున్నారు. సామాన్యుడికి వినోదం అందుబాటులో ఉండాలని సినిమా టికెట్లు తగ్గిస్తే ఏడుపు ఎందుకు. పేదలు మద్యం తాగకూడదని పెంచితే ఏడుపు, మళ్లీ తగ్గిస్తే ఏడుపే ఏడుపు. దేశాన్ని పాలించే బీజేపీ పార్టీవాళ్లు చెబుతున్నారు... చివరికి చీప్ లిక్కర్ రూ.75కి, రెవెన్యూ బాగుంటే రూ.50కే ఇస్తారట. అది బీజేపీనా? లేక జోకర్ పార్టీనా అర్థం కాని పరిస్థితి. అంతేకాకుండా సోము వీర్రాజుగారు సారాయి గురించి మాట్లాడి... దాని నుంచి దృష్టి మరల్చేందుకు మరో అంశం మీదకు వెళ్లారు. పేరు మార్చకుంటే గుంటూరులోని జిన్నా టవర్‌ను పేల్చేస్తారట....అని వ్యాఖ్యానించారు.
జిన్నా టవర్‌ను పేల్చడానికి మీరు ఏమైనా టెర్రరిస్టులా? అసాంఘిక శక్తులా? భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతున్నాం. ఆప్ఘనిస్తాన్‌లో బుద్దుడి విగ్రహాన్ని తాలిబన్లు పేల్చేశారు. వారికి మీకు తేడా ఏంటి? ఆఫ్గనిస్తాన్ తాలిబన్లతో మీరు సమానులు కారా? ఇవాళ జిన్నా టవర్ గురించి మాట్లాడుతున్నారు.
భారతీయ జనతా పార్టీలో ఎల్‌కే అద్వానీ, వాజ్‌పాయ్ లెజెండ్స్.అలాంటి అద్వానీ జిన్నా సమాధి వద్దకు వెళ్లి పుష్పగుచ్చం ఉంచి, జిన్నా నిజమైన దేశభక్తుడు అని కీర్తించిన సంగతి మర్చిపోయారా? ఆ మాటలు అన్నందుకు ఇప్పుడు అద్వానీ మీద తిరగబడతారా? లేకుంటే ఆయన మీ పార్టీ కాదని చెబుతారా? స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్ళు అయిన సందర్భంగా... ఒకవైపు ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటూ సారా బుడ్డిల గురించి, జిన్నా టవర్ గురించి మాట్లాడుకునేంత నీచానికి దిగజారిపోయారే? ఎందుకు ఓట్లు కోసమా? అని ప్రశ్నించారు.
సమైక్య దేశంలో జిన్నా, మహాత్మాగాంధీ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. కొన్ని సందర్భాల్లో మత సామరస్యం కోసం, కొన్నిచోట్ల గాంధీజీ పేరు, మరికొన్నిచోట్ల జిన్నా పేరు పెట్టారు. గుంటూరులో 1947కు పూర్వం కట్టిన జిన్నా టవర్‌ను కూల్చేస్తామంటూ మీరు మతసామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తోంది? గుడ్డి గుర్రం పళ్లు తోముతుందా?
తెలుగుదేశం పార్టీతో కలిసి బీజేపీ అధికారం పంచుకుని మంత్రులుగా పనిచేశారు కదా? ఆరోజు ఏమైంది, జిన్నా టవర్ అప్పుడు గుర్తుకురాలేదా? ఏమిటి అన్యాయం, దుర్మార్గం, తాలిబన్ లాంటి చర్యలు. దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రరాష్ట్రంలో జోకర్ పార్టీలా వ్యవహరిస్తుందంటే దానికి వారే సమాధానం చెప్పాల్సిన. దీనిపై ఆ పార్టీ దేశ, రాష్ట్ర నాయకులకు బాధ్యత ఉంది. క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా ఉందన్నారు.