మానవులకు విజ్ఞాన్ని ప్రసాదించే చదువుల తల్లి సరస్వతి కొలువైన దివ్య క్షేత్రం బాసర. ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి ఒడ్డున కొలువైన ఈ క్షేత్రం ప్రస్తుతం అభివృద్ధి చెందుతూ భక్తులను ఆకర్షిస్తోంది. తమ పిల్లలకు భవిష్యత్‌లో అపారమైన విజ్ఞానం సొంతం కావాలని కోరుతూ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టే తల్లితండ్రులతో ఈ బాసర క్షేత్రం నిత్యం కళకళలాడుతుంటుంది.
బాసర క్షేత్రం విశేషాలు
బాసరలో వెలసిన ఈ క్షేత్రం పురాతనమైన ప్రాముఖ్యాన్ని కల్గిఉంది. బాసర క్షేత్రంలో కొలువైన సరస్వతీదేవిని వ్యాసుడు ప్రతిష్టించాడని ప్రతీతి. అలనాడు వ్యాసుడు తల్లి ఆశీసులతో తపస్సు ప్రారంభించాడు. అయితే ఎన్ని ప్రాంతాల్లో తపస్సు చేసినా ఆయనకు తపో నిష్ట కల్గలేదంట.
దీంతో ఆయన గోదావరి నది ఒడ్డున ఉన్న సరస్వతీ క్షేత్రాన్ని చేరుకుని తపస్సు ప్రారంభించాడట. ఆయన తపస్సు ఫలించి సరస్వతీ దేవి ప్రత్యక్షమై తనను అదే క్షేత్రంలో ప్రతిష్టించమని కోరిందట. దీంతో వ్యాసుడు ఆ తీర్థానికి కొద్ది దూరంలో సరస్వతీదేవిని ప్రతిష్టించాడట. వ్యాసుడు ప్రతిష్టించిన కారణంగా ఈ క్షేత్రాన్ని వ్యాసపురగా పిలిచేవారట.
కాలగమనంలో వ్యాసపురనే బాసరగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే పురాణకాలంలో నిర్మించబడిన ఆలయం దండయాత్రల కాలంలో ధ్వసం కావడంతో శృంగేరీ పీఠాధిపతి ఆలయాన్ని పునర్నించి అమ్మవారిని పునఃప్రతిష్టించారట. ప్రస్తుతం బాసరలో ఉన్నది ఆ ఆలయమే.
దేవాలయం విశేషాలు బాసరలోని సరస్వతీ దేవి ఆలయం విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడి ఉంది. బాసర గ్రామం చిన్నదైనా ఆలయం మాత్రం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆలయానికి కొంత దూరంలో గోదావరి నది ప్రవహిస్తోంది. ఈ నదిలో స్నానం చేసి నదికీ సమీపాన ఉన్న శివుని భక్తులు దర్శించుకోవడం ఆనవాయితీ.
గోదావరీ పుష్కరాల కారణంగా బాసర క్షేత్రం ఇటీవల ప్రముఖ క్షేత్రంగా అభివృద్ధి చెందుతోంది. ఆలయ ప్రాగణంలో ఇంద్రేశ్వరం, సూర్యేశ్వరం, వాల్మీకేశ్వరం, తరణేశ్వరం, కుమారేశ్వరం, వ్యాసేశ్వరం తదితర ప్రదేశాలు ఉన్నాయి. ఎంతో ప్రశాంతమైన ఈ ఆలయప్రాంగణంలో ఓ రోజంతా గడపగల్గితే అద్వితీయమైన అనుభూతి మన సొంతమౌతుంది.
రవాణా, వసతి సౌకర్యాలు బాసర క్షేత్రం రాష్ట్ర రాజధాని నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు, రైలు మార్గాల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. బాసరలో వసతి సౌకర్యాలు సైతం చెప్పుకోదగ్గ రీతిలోనే ఉన్నాయి. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వసతి గృహాలతోపాటు రాష్ట్ర టూరిజం శాఖకు చెందిన వసతి గృహాలు కూడా ఉన్నాయి.
వీటిలో అద్దె కూడా సామాన్యులకు అందుబాటులోనే ఉంటుంది. భోజనం తదితర అవసరాలకు అనువుగా హోటళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.