శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2019 (16:40 IST)

పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ప్రతి మహిళ మాతృత్వాన్ని పొందాలని కోరుకుంటుంది. అందునా పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కలలు కంటుంది. అయితే, వారి కలను సాకారం చేసుకునేందుకు గర్భందాల్చక ముందు నుంచే మంచి పోషకాహారం తీసుకోవాలన్న విషయాన్ని మాత్రం మహిళలు పట్టించుకోరు. ఈ కారణంగా బరువు తక్కువ, ఇతర లోపాలతో ఉన్న బిడ్డలకు జన్మనిస్తుంటారు. నిజానికి ఆరోగ్యవంతమైన పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఓసారి పరిశీలిద్ధాం. 
 
సాధారణంగా గర్భందాల్చక ముందు గర్భందాల్చిన తర్వాత మహిళలకు ఐరన్ చాలా ముఖ్యం. గర్భందాల్చిన తర్వాత ఐరన్ రెట్టింపు మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే కణాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించేది ఇధి. బిడ్డ ఎదగడానికి కణ నిర్మాణం చాలా కీలకం. గర్భంతో ఉన్నప్పుడు శారీరకపరమైన ఎన్నో మార్పులకు ఐరన్ సాయపడుతుంది. అలాగే, రక్తపరిమాణాన్నీ పెంచుతుంది. ఐరన్ లోపిస్తే ముందస్తు ప్రసవానికి దారితీయొచ్చు. తక్కువ బరువుతో బిడ్డ పుట్టొచ్చు. అందుకే గర్భం దాల్చిన వారు తప్పకుండా రక్తపరీక్ష ద్వారా ఐరన్ ఎంతున్నది తెలుసుకోవడం అవసరం.  
 
ఇందుకోసం పాలకూర, గుమ్మడికాయ, టమాటాలు, బీట్‌రూట్, పుట్టగొడుగులు, క్యాలీఫ్లవర్, బీన్స్, పప్పు ధాన్యాలు, పుచ్చకాయ, ద్రాక్ష, కమలా, నారింజ, యాపిల్స్, స్ట్రాబెర్రీ, ముడి ధాన్యాలు వంటివి విరివిగా ఆరగిస్తూ ఉండాలి. మాంసాహారమైన చికెన్, మటన్‌లోనూ ఐరన్ లభిస్తుంది. కాకపోతే మాంసాహార పదార్థాల్లో ఉండే ఐరన్‌ను అంత తేలిగ్గా శరీరం గ్రహించలేదు. అందుకోసం విటమిన్ సీ సప్లిమెంట్లను తీసుకోవాలి. దీంతో ఐరన్ ను శరీరం తేలిగ్గా గ్రహించగలదు. 
 
వీటితో పాటు.. పాలలో మాంసకృత్తులు, క్యాల్షియం అధికంగా ఉంటాయి. కనీసం రోజులో 500 ఎంఎల్ పాలు తీసుకోవడం అవసరం. ఒకవేళ పెరుగు కూడా తగినంత తీసుకునేట్టు అయితే పాలను రోజుకు అరలీటర్ తక్కువ కాకుండా చూసుకోవాలి. ఇక, బాదం పాలు, ద్రాక్ష జ్యూస్, యాపిల్, క్యారట్ జ్యూస్, బటర్ మిల్క్, ఖర్జూరాలు, అరటిపండ్ల షేక్‌ను తీసుకోవచ్చు. ఉడకబెట్టిన ఆలూ టిక్క, గోధుమ దోశ, కొబ్బరి చెట్నీతో అప్పాలను స్నాక్స్‌ను ఆహారంగా తీసుకోవచ్చు. ఇలాంటివి తీసుకోవడం వల్ల గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యంగా పూర్తిస్థాయిలో ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.