ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (18:25 IST)

బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి.. డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు.. ఆ తర్వాత...

అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన దంపతుల ఖాతాలోకి అనుకోకుండా 1.20 లక్షల డాలర్లు వచ్చిపడ్డాయి. అవి ఎలా వచ్చాయో వారికి తెలీదు. కానీ వెంటనే అందులో లక్ష డాలర్లు ఖర్చు పెట్టేశారు. వాళ్లు డబ్బులు దొంగిలించారని బ్యాంకు కేసు పెట్టింది. రాబర్ట్, టిఫనీ విలియమ్స్ దంపతుల బీబీ అండ్ టీ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ ఏడాది మే 31వ తేదీ వీరి ఖాతాలోకి బ్యాంకు పొరపాటున 1,20,000 డాలర్లు డిపాజిట్ చేసింది. అంటే దాదాపు 90 లక్షల రూపాయలు.

 
నిజానికి ఆ డబ్బులను ఒక పెట్టుబడి సంస్థకు బదిలీ చేయాల్సి ఉండగా పొరపాటున వీరి ఖాతాలో జమ చేశారని పోలీసులు చెప్పారు. అయితే తమ ఖాతాలోకి డబ్బులు ఎలా వచ్చాయో విలియమ్స్ దంపతులకు తెలీదు. కానీ ఖాతాలో డబ్బులు చూడగానే ఖర్చు చేయటం మొదలుపెట్టారు. ఆ డబ్బులతో ఒక ఎస్‌యూవీతో పాటు ఇతర వస్తువులూ కొనుగోలు చేశారని పోలీసులు చెప్తున్నారు.

 
బ్యాంకు సిబ్బంది జూన్ 20వ తేదీన తమ పొరపాటును గుర్తించారు. వెంటనే విలియమ్స్ ఖాతాలో నుంచి డబ్బును వెనక్కు తీసుకుని సరైన ఖాతాలోకి పంపించారు. అయితే.. అప్పటికే ఆ దంపతులు దాదాపు 1,07,000 డాలర్లు (దాదాపు రూ. 77 లక్షలు) ఖర్చు పెట్టేశారని పోలీసులు చెప్పారు. 

 
బ్యాంకు సిబ్బంది వీరిని సంప్రదించినపుడు.. ''తన దగ్గర ఆ డబ్బులేవీ లేవని వారికి అన్నీ ఖర్చు పెట్టేశామని చెప్పారు'' అని పోలీసులు ఫిర్యాదులో పేర్కన్నట్లు సీబీఎస్ న్యూస్ తెలిపింది. ఖర్చు చేసిన డబ్బులను తిరిగి చెల్లించటానికి ఒక ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేస్తామని విలియమ్స్ చెప్పారు. అయితే.. ఆ తర్వాత ఆ దంపతులు మళ్లీ బ్యాంకు సిబ్బందితో మాట్లాడలేదని పోలీసులు పేర్కొన్నారు.

 
దీంతో బ్యాంకు డబ్బును ఈ దంపతులు చోరీ చేశారంటూ బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ డబ్బుతో ఒక చెవర్లే ట్రావెర్స్ ఎస్‌యూవీతో పాటు రెండు కార్లు, ఒక క్యాంపర్, ఒక రేస్ కారు, ఇతర గృహోపకరణాలు కొనుగోలు చేశారని ఫిర్యాదులో వివరించారు. అంతేకాదు.. స్నేహితులకు 15,000 డాలర్లు సాయం కూడా చేశారని చెప్పారు.

 
దర్యాప్తు అధికారులు జూలైలో ఈ దంపతులతో మాట్లాడినపుడు.. తమ బ్యాంకు ఖాతాలోకి వచ్చిన డబ్బులు తమవి కావని తమకు తెలుసునని రాబర్ట్ (36), టిఫనీ (35) అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ డబ్బులు రాకముందు వీరి ఖాతాలో సగటున 1,000 డాలర్లు బ్యాలెన్స్ ఉండేది. ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం బెయిల్ మీద విడుదల చేశారు.

 
''క్లయింటు గోప్యతా ప్రమాణాల దృష్ట్యా ఈ అంశం వివరాల గురించి మేం వ్యాఖ్యానించలేం. మా క్లయింట్ల మీద ప్రభావం చూపే ప్రతి అంశాన్నీ సత్వరం పరిష్కరించటానికి ప్రయత్నిస్తాం'' అని బీబీ అండ్ టీ బ్యాంక్ సీఎన్ఎన్ వార్తా సంస్థకు పంపిన ఒక ప్రకటనలో చెప్పింది.