మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 8 సెప్టెంబరు 2021 (20:48 IST)

అఫ్గానిస్తాన్: ‘దయచేసి తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించకండి’, ప్రపంచ దేశాలకు ప్రతిఘటన ఫైటర్ల విజ్ఞప్తి

తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించొద్దని అఫ్గానిస్తాన్‌లోని తాలిబాన్ వ్యతిరేక శక్తులు ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశాయి. "ఒక్క మహిళ కూడా లేకుండా, కేవలం తాలిబాన్ నాయకులు, వారి అనుచరులతో ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వం చట్టవ్యతిరేకం" అని వాళ్లు చెప్పారు. తమ బలగాలపై దాడులు చేసిన వారిని ప్రభుత్వంలోకి తీసుకోవడంపై అమెరికా కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

 
అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్‌లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో అమెరికా తన ఆందోళన వ్యక్తం చేసింది. తాలిబాన్ల ప్రభుత్వంలో పూర్తిగా పురుషులే ఉన్నారని.. అమెరికా సేనలపై దాడులకు పాల్పడినవారు ప్రభుత్వంలో ఉన్నారని అమెరికా ఆరోపించింది. తాలిబాన్‌ల ప్రభుత్వాన్ని నడిపించబోయే ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ ఐరాస బ్లాక్‌లిస్ట్‌లో ఉండగా.. మరో నేత సిరాజుద్దీన్ హక్కానీ కోసం ఎఫ్‌బీఐ వెతుకుతోంది.

 
అమెరికా హోం శాఖ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ''అఫ్గానిస్తాన్ కొత్త ప్రభుత్వంలో ఉన్నవారంతా తాలిబాన్ గ్రూప్ సభ్యులు, వారి సన్నిహితులే. ప్రభుత్వంలో ఒక్క మహిళ కూడా లేరు'' అని పేర్కొంది. ''ప్రభుత్వంలో ఉన్నవారి గత చరిత్ర, వారికి గల సంబంధాలపై ఆందోళన చెందుతున్నాం''. ''తాలిబాన్ల చేతల ఆధారంగా వారి విషయంలో నిర్ణయం తీసుకుంటాం, వారు చెబుతున్న మాటల ఆధారంగా కాదు'' అని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

 
విదేశీయులు, సరైన పత్రాలున్న అఫ్గానిస్తాన్ ప్రజలు అక్కడి నుంచి సురక్షితంగా వెళ్లేందుకు వీలు కల్పిస్తామన్న వాగ్దానానికి తాలిబాన్లు కట్టుబడి ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఏ దేశాన్నైనా బెదిరించేందుకు అఫ్గాన్ భూభాగాన్ని ఎవరూ వాడుకోరని తాలిబాన్లు హామీ ఇవ్వాలని కోరుకుంటున్నామని, ప్రపంచం కూడా అన్నీ గమనిస్తోందని అమెరికా పేర్కొంది.

 
అఫ్గానిస్తాన్‌ పేరును 'ఇస్లామిక్ ఎమిరేట్స్'గా మార్చిన తాలిబాన్లు
అఫ్గానిస్తాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తాలిబాన్ ప్రకటించింది. ఈ ప్రభుత్వాన్ని తాలిబాన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ నడిపిస్తారని, ఆయనకు డిప్యూటీగా తాలిబాన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ వ్యవహరిస్తారని తాలిబాన్ అధికార ప్రతినిధి జుబీహుల్లా ముజాహిద్ విలేకరులకు తెలిపారు.

 
ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్‌ ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి బ్లాక్ లిస్టులో ఉన్నారు. ‘‘మా దేశ ప్రజలు కొత్త ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారని మాకు తెలుసు’’ అని జుబీహుల్లా అన్నారు. 20 ఏళ్ల యుద్ధానికి తెరదించుతూ ఆగస్టు 15వ తేదీన తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాలిబాన్ ప్రభుత్వ ఏర్పాటులో ఈ తాత్కాలిక కేబినెట్ ఏర్పాటు కీలకమైనది.

 
ఇందులో ముల్లా యాకూబ్‌ రక్షణ మంత్రిగా, ముల్లా అబ్దుల్ సలామ్ హనాఫీ సెకండ్ డిప్యూటీగా, అమీర్ ఖాన్ ముత్తాకి విదేశాంగ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. మిలిటెంట్ గ్రూప్ అయిన హక్కానీ నెట్‌వర్క్‌ అధిపతి సిరాజుద్దీన్ హక్కానీ దేశ హోం మంత్రిగా నియమితులయ్యారు. ఈయన ఇప్పటికీ అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. రెండు దశాబ్దాల పాటు అమెరికా, దాని మిత్ర సైన్యాలకు - తాలిబాన్లకు మధ్య జరిగిన యుద్ధంలో హక్కానీ పలు ప్రాణాంతక దాడుల సూత్రధారి.

 
తాలిబాన్లకు అనుబంధంగా పనిచేసిన హక్కానీ నెట్‌వర్క్‌ను ఉగ్రవాద సంస్థగా అమెరికా పరిగణిస్తోంది. అయితే, క్యాబినెట్‌లో మహిళలు ఎవరూ లేరని బీబీసీ ప్రతినిధి సికిందర్ కిర్మానీ ప్రస్తావించగా.. తాలిబాన్ అధికారి అహ్మదుల్లా వసీక్ స్పందిస్తూ.. ఇది పూర్తి స్థాయి క్యాబినెట్ కాదని తెలిపారు.

 
‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్‌’
అఫ్గానిస్తాన్‌ ఇకపై అధికారికంగా ‘‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్‌’’ అవుతుందని తాలిబాన్ అధికారి అహ్మదుల్లా వసీక్ బీబీసీ ప్రతినిధి సికిందర్ కిర్మానీతో చెప్పారు.