గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 26 మార్చి 2022 (14:43 IST)

అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ ప్రభుత్వాన్ని బెంబేలెత్తించిన మన్యం వీరుడు, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?

తెలుగు నేల మీద స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అనేక మంది ఉద్యమకారుల్లో అల్లూరి సీతారామరాజు ఒకరు. ఆయన మన్యం ప్రాంతంలో గిరిజనులను సమీకరించి బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. కొన్నేళ్ల పాటు సమరశీల ఉద్యమాలకు నాయకత్వం వహించారు.

 
చివరకు బ్రిటిష్ పోలీసుల చేతిలో మరణించారు. ఆయన పోరాటాన్ని కొనియాడుతూ మహాత్మాగాంధీ ఆనాడే తన యంగ్ ఇండియా పత్రికలో ఉటంకించారు. వందేళ్ల క్రితం నాటి అల్లూరి ఉద్యమ ఆనవాళ్లు నేటికీ కనిపిస్తాయి. ప్రజలు వాటిని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తూర్పు కనుమల వరకు అనేక చోట్లా అల్లూరి సీతారామరాజు ఉద్యమ ఆనవాళ్లు దర్శనీయ క్షేత్రాలుగా ఉన్నాయి.

 
అల్లూరి నేపథ్యం...
విశాఖ జిల్లా పాండ్రంగిలో 1897 జూలై 4న అల్లూరి జన్మించారు. ఆయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు. తండ్రి వెంకటరామరాజు. ఆయన ఫోటోగ్రాఫర్. తల్లి సూర్యనారాయణమ్మ. వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం. తండ్రి వృత్తిరీత్యా వివిధ ప్రాంతాలలో తిరిగేవారు. దానికి అనుగుణంగా అల్లూరి కుటుంబంతో పాటుగా వివిధ ప్రాంతాలకు తిరిగారు. గోదావరి జిల్లాల పరిధిలో ఉన్న నరసాపురం, రాజమహేంద్రవరం, రామచంద్రాపురం, తుని, కాకినాడ సహా పలు చోట్ల ఆయన విద్యాభ్యాసం సాగింది.

 
అల్లూరి ఆరో తరోగతి చదువుతున్నప్పుడు గోదావరి పుష్కరాల సమయంలో వ్యాపించిన కలరా వ్యాధితో ఆయన తండ్రి 1908వ సంవత్సరంలో మరణించారు. ఆ తర్వాత ఆయన చదువులు పూర్తిగా ముందుకు సాగలేదు. ధ్యానంలో దిగిపోవాలనే లక్ష్యంతో 1916లో అల్లూరి ఉత్తరాది పర్యటనకు వెళ్లారు. వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శించారు. తీర్థయాత్రలు చేసి తిరిగి 1918లో సొంత గడ్డకు వచ్చారు. 1919 నుంచి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించారు. వారికి న్యాయం కోసం పోరాటంలో దిగారు. గిరిజనుల అటవీ ఉత్పత్తులను కొల్లగొట్టడం, వారు చేస్తున్న పనులకు కూడా తగిన కూలీ ఇవ్వకపోవడం వంటి అంశాల్లో అల్లూరి ప్రభుత్వాన్ని నిలదీశారు. గిరిజనులను సమీకరించి పోరాటం చేశారు.

 
ఏజెన్సీలో మూడేళ్ల సాయుధ సమరం
ఇరవై ఏళ్ళు కూడా నిండని వయసులోనే అల్లూరి అడవి బాట పట్టారు. తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల పరిధిలో గిరిజనుల కోసం ఆయన పనిచేశారు. అక్కడ గిరిజనులపై సాగుతున్నబ్రిటిష్ అధికారుల దౌర్జన్యాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ముఖ్యంగా మన్యంలో ముఠాదారులుగా పిలిచే స్థానిక పెద్దలతో కలిసి బ్రిటిష్ వారు చేస్తున్న దోపిడి అల్లూరికి ఆగ్రహం కలిగించింది. సామాన్య గిరిజనులను చిత్రహింసలు పెడుతున్న కాంట్రాక్టర్లు, వడ్డీ వ్యాపారుల ధోరణితో విసిగిపోయిన అల్లూరి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

 
సామాన్య గిరిజనులను సమీకరించి పోరాటానికి పూనుకున్నారు. తిరుగుబాటు చేసి బ్రిటిష్ వారి దోపిడీని తరిమికొట్టాలని నిర్ణయించుకున్నారు. అది కొంతకాలానికి సాయుధ పోరాటంగా మారింది. ఆయుధాల కోసం అల్లూరి సీతారామరాజు నాయకత్వంలోని మన్యం పోరాట వీరులంతా కలిసి బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. రాజవొమ్మంగి, అడ్డతీగల, దేవీపట్నం, చింతపల్లి, కేడీ పేట వంటి పోలీస్ స్టేషన్లపై అల్లూరి బృందం దాడులకు పాల్పడింది. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతాలకు ఒక్క రోజు వ్యవధిలోనే వెళ్లి ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రజల్లో అల్లూరికి ఆదరణ పెరిగింది. ఆయన దగ్గర మహిమలున్నాయని కొందరు భావించారు.

 
రంగంలోకి స్పెషల్ పోలీసులు
అల్లూరికి ఆదరణ పెరుగుతుండటం, ఉద్యమం తీవ్రతరం అవుతుండటం అప్పటి ప్రభుత్వాన్ని కలవరపరిచింది. అదనపు పోలీసు బలగాలను కూడా పంపించి ఆ ఉద్యమాన్ని కట్టడి చేసే ప్రయత్నం జరిగింది. ఆ క్రమంలో అల్లూరి సేనల చేతిలో కొందరు పోలీసు సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. వారి సమాధులు నేటికీ విశాఖ జిల్లా నర్సీపట్నంలో కనిపిస్తాయి. మన్యం పితూరీగా నాటి ప్రభుత్వం ఈ తిరుగుబాటుని పరిగణించింది. వరుసగా మూడేళ్ల పాటు సాయుధ పోరాటం సాగింది. అల్లూరి తిరుగుబాటుని ఎదుర్కొనేందుకు తొలుత మలబారు సైన్యాన్ని రంగంలో దింపారు. అయినా అదుపు చేయలేకపోవడంతో ఆ తర్వాత అస్సాం రైఫిల్స్ అధికారులు కూడా వచ్చారు.

 
అస్సాం రైఫిల్స్ దళాలకు అల్లూరి పట్టుబడ్డారు. తీవ్రంగా సాగిన పోరాటంలో గాయపడి, కొయ్యూరు సమీపంలోని మంప వద్ద వాగులో దిగి గాయాలను శుభ్రం చేసుకుంటుండగా ఆయన పట్టుబడినట్టు రికార్డుల్లో ఉంది. కానీ పట్టుబడిన అల్లూరిని సజీవంగా తీసుకురావాల్సి ఉండగా, మార్గం మధ్యలోనే ఆయనను చెట్టుకు కట్టేసి కాల్చి చంపినట్టు చరిత్రకారులు చెబుతారు. 1924 మే 7వ తేదీన ఆయన తప్పించుకుని పారిపోయే ప్రమాదం ఉండటంతో కాల్చి చంపినట్టు మేజర్ గుడాల్ అనే అధికారి తన నివేదికలో ప్రకటించారు. అల్లూరి మృతదేహాన్ని కృష్ణదేవిపేటకు తరలించారు. అక్కడే దహన సంస్కారాలు నిర్వహించారు.

 
ఆ ప్రాంతాన్ని ఇప్పుడు అల్లూరి స్మృతివనంగా తీర్చిదిద్దారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి పోరాడి 27 ఏళ్ల వయస్సులోనే కన్నుమూసిన అల్లూరిని మన్యం వీరుడిగా కొనియాడుతారు. నిత్యం వందల మంది కృష్ణదేవిపేటలో ఉన్న అల్లూరి స్మృతివనానికి వస్తూ ఉంటారు. అల్లూరిని గుర్తు చేసుకుంటారు. ఈ పోరాటంలో అల్లూరి వెంట నడిచిన 17 మంది ముఖ్య అనుచరుల్లో కొందరిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అండమాన్ సహా వివిధ జైళ్లలో బంధించింది. మరికొందరు పోరాటంలోనే ప్రాణాలు విడిచారు. దాంతో ఈ ఉద్యమం ముగిసింది. కానీ ఆ స్ఫూర్తి మాత్రం కొనసాగుతుందనే చెప్పాలి.

 
అల్లూరి విగ్రహం పార్లమెంట్‌లో పెట్టాలి
అల్లూరి స్మారక స్మృతివనంతో పాటుగా ఇతర చారిత్రాక ఆనవాళ్ల విషయంలో తగిన శ్రద్ధ చూపడం లేదనే అభిప్రాయం ఉంది. ''అల్లూరి స్మారక కేంద్రాలను తగిన రీతిలో అభివృద్ధి చేయలేదు. వాటిని పరిరక్షించాలి. పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహం పెడతామని చెప్పారు. దానికోసం అయ్యే మొత్తం ఖర్చు మేం భరిస్తామని చెప్పాం. అయినా స్మారక కేంద్రాల పరిరక్షణ, పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహ ఏర్పాటు వంటివి నేటికీ నెరవేరలేదు'' అని బీబీసీతో అల్లూరి సీతారామరాజు యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడాల వీరభద్రరావు అన్నారు.

 
''స్థానిక సంస్థల అభివృద్ధి, మద్య నిషేధం, అందరికీ విద్య వంటి లక్ష్యాలతో అల్లూరి ఉద్యమం సాగింది. మూడేళ్ల పాటు పోరాడి ఏజెన్సీలో బ్రిటిష్ వారి దోపిడీ నుంచి వారికి విముక్తి కల్పించారు. ఆ ప్రాంతంలో స్థానిక గిరిజనులతో కమిటీలు వేసి పాలన చేశారు. కల్లు, సారాయి లేకుండా వారిలో చైతన్యం నింపారు. వారికి విద్య అవసరాన్ని అల్లూరి గుర్తించారు. అందుకే ఆయన పోరాటం ప్రత్యేకమైనది'' అని బీబీసీతో భీమవరంలోని అల్లూరి సేవా సమితి కార్యదర్శి కలిదిండి గోపాలకృష్ణంరాజు అన్నారు.

 
అల్లూరి సీతారామరాజు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్రమంతా నిర్వహిస్తూ ఉంటారు. ఏపీ ప్రభుత్వం అధికారికంగా వాటిని జరుపుతుంది. అల్లూరి జీవిత చరిత్ర చాలాకాలంగా వివిధ రూపాల్లో నేటి తరానికి అందిస్తూ ఉంటారు. గ్రామాల్లో నాటకాల రూపంలో వాటిని ప్రదర్శిస్తారు. నాలుగు దశాబ్దాల క్రితమే అల్లూరి జీవిత కథను సినిమాగానూ రూపొందించారు. డెల్టా ప్రాంతం నుంచి వెళ్లి ఏజెన్సీలో గిరిజనుల పక్షాన పోరాడిన మన్యం వీరుడి విగ్రహాలు ఏపీలో అనేక చోట్ల దర్శనమిస్తాయి.