“నా గుండెల్లో నొప్పిగా ఉంది. వీలైతే వచ్చి నన్ను తీసుకెళ్తావా?” దిల్లీ నుంచి కాలినడకన మధ్యప్రదేశ్ వెళ్తూ ఆగ్రా దగ్గర చనిపోయిన ఒక వ్యక్తి చివరి మాట ఇది. ఆయన పేరు రణ్‌వీర్ సింగ్, దిల్లీలో డెలివరీ మ్యాన్‌గా పనిచేస్తుండేవారు. లాక్‌డౌన్ చేశాక దిల్లీలో తిండికి, ఉండడానికి ఇబ్బందులు ఎదురవడంతో ఆయన మధ్యప్రదేశ్‌లోని తన స్వగ్రామం వెళ్లిపోవాలని అనుకున్నారు. కానీ, రవాణా సౌకర్యాలేవీ లేకపోవడంతో రణ్‌వీర్ సింగ్ తన గ్రామం చేరుకోడానికి కాలినడకనే బయల్దేరారు.
చనిపోవడానికి ముందు రోజు
చనిపోవడానికి ముందు రోజు రాత్రి రణ్‌వీర్ సింగ్ కొంతమంది స్నేహితులతో కలిసి దిల్లీ నుంచి ఇంటికి వెళ్లిపోదామని అనుకున్నారు. కానీ బస్సులు, ఇతర వాహనాలు ఏవీ లేకపోవడంతో అందరూ కాలినడకన బయల్దేరారు. దిల్లీ నుంచి బయల్దేరి ఫరీదాబాద్ దగ్గరకు చేరుకోగానే రాత్రి 9.30కు రణ్‌వీర్ తన చెల్లెలు పింకీతో మాట్లాడారు.
“నేను ఆరోజు అనుకోకుండా అన్నయ్యకు కాల్ చేశాను. లాక్‌డౌన్ వల్ల దిల్లీలో పనులన్నీ ఆగిపోయాయని, కాలినడకన ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పాడు. నాకు అది వినగానే, చాలా వింతగా అనిపించింది” అని పింకీ చెప్పారు. “అన్నయ్యతో మాట్లాడిన తర్వాత, నేను మందులేసుకుని పడుకున్నా. తర్వాత రోజు ఉదయం లేవగానే 5 గంటలప్పుడు మొదట అన్నయ్యకే ఫోన్ చేశాను” అన్నారు.
“నాతో మాట్లాడుతున్నప్పుడు అన్నయ్య ‘గుండెల్లో నొప్పిగా ఉంది’ అన్నారు. నేను తనతో ‘మీరు ఎక్కడైనా కూర్చోండి, నేను ఆలోపు ఎవరికైనా ఫోన్ చేస్తాను” అన్నాను.
నడిచిన రణ్‌వీర్‌కు ఏం జరిగింది?
రణ్‌వీర్ సింగ్ దిల్లీ నుంచి మధుర మీదుగా ఆగ్రా చేరుకున్నారు. అప్పటికే ఆయన చాలా అలసిపోయారు. దారిలో కొన్ని కిలోమీటర్లు ఒక ట్రాక్టర్లో చోటు దొరికినా, ఆయన ఎక్కువ దూరం నడిచే వెళ్లాల్సి వచ్చింది. ఆయన ఆ దారిలో ఒంటరిగా నడవడం లేదు. రణ్‌వీర్‌తో పాటు ఆయన వయసులోనే ఉన్న చాలా మంది యువకులు, కొందరు పెద్దవారు, పిల్లలు కూడా వెళ్తున్నారు.
రణ్‌వీర్ సింగ్ దిల్లీలోని ఒక రెస్టారెంట్‌లో డెలివరీ మ్యాన్‌గా పనిచేస్తున్నారు. బంధువు అరవింద్ కూడా ఆయనతో కలిసి ఉంటున్నారు. రణ్‌వీర్ చివరిసారి కాల్ చేసింది అరవింద్‌కే. ఆయన కూడా ఆ రాత్రంతా రణ్‌వీర్‌తో టచ్‌లోనే ఉన్నారు. అరవింద్‌కు ఒక ట్రక్కులో చోటు దొరకడంతో అందులో వెళ్లిపోయారు. రణ్‌వీర్ మాత్రం కాలినడకనే ముందుకు సాగారు.
“నేను ఆయనతో రాత్రి మాట్లాడాను. కానీ, అప్పటికే తను బాగా అలిసిపోయినట్లు అనిపించింది. కానీ, కరోనా భయంతో ఎవరూ ఆయనకు సాయం చేయలేదు” అని అరవింద్ చెప్పారు. రణ్‌వీర్ అలా నడుస్తూనే ఉన్నారు. ఆగ్రా చేరుకున్న తర్వాత ఆయన పరిస్థితి మరింత సీరియస్ అయ్యింది.
చనిపోయే ముందు..
నేషనల్ హైవే-2 మీద ఉదయం ఆరున్నరకు రణ్‌వీర్ సింగ్ చనిపోయారు. కానీ, చనిపోడానికి ముందు తన బంధువు అరవింద్‌కు ఫోన్ చేసిన ఆయన ‘నాకు సాయం చేస్తావా’ అని అడిగారు. “రణ్‌వీర్ నాకు ఫోన్ చేసి. ‘నా గుండెల్లో నొప్పిగా ఉంది. వీలైతే వచ్చి నన్ను తీసుకెళ్తావా..’ అన్నారు. నేను ‘100కు డయల్ చెయ్.. ఎవరినైనా సాయం అడుగు’ అన్నాను. కానీ తర్వాత ఆయన గొంతు వినిపించలేదు” అని అరవింద్ చెప్పారు.
అరవింద్ “ఆ కాల్ వచ్చిన దాదాపు 8 నిమిషాల తర్వాత నేను ట్రక్ దిగి మళ్లీ ఒకసారి కాల్ చేశాను. వేరే ఎవరో ఆ ఫోన్ తీశారు. తన పరిస్థితి సీరియస్‌గా ఉందని చెప్పారు. ఆ తర్వాత రణ్‌వీర్ చనిపోయారు” అన్నారు.
దిక్కుతోచని స్థితిలో కుటుంబం
రణ్‌వీర్ సింగ్ మృతితో ఆయన ఇంట్లో విషాదం నెలకొంది. మృతుడి భార్య మమత, ముగ్గురు పిల్లలు ఇప్పటికీ షాక్‌లో ఉన్నారు. “మా నాన్న కూడా త్వరగానే చనిపోయారు. ఆ తర్వాత నుంచి ఇంటి బాధ్యతలన్నీ మా అన్నయ్యే చూసుకుంటూ వచ్చారు. ఆయనకు ముగ్గురు పిల్లలు. ఇంట్లో ఇప్పుడు సంపాదించేవారు ఎవరూ లేరు” అని రణ్‌వీర్ చెల్లెలు పింకీ బీబీసీతో అన్నారు.
“మా ఇంటిని చూస్తుంటే ఏం చేయాలో తెలీడం లేదు. మా పరిస్థితి మాకు మాత్రమే తెలుసు. అన్నయ్య ఇల్లు కట్టడానికి తీసుకొచ్చిన లక్షన్నర అప్పు కూడా తీరుస్తూ వచ్చారు. ఇప్పుడు దానికి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు” అని పింకీ చెప్పారు. “మా ఇంటి వెలుగు పోయింది” అని పింకీ భావోద్వేగానికి గురయ్యారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత ఆదివారం తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ముఖ్యంగా పేదలను ఉద్దేశించి మాట్లాడుతూ “లాక్‌డౌన్ వల్ల మీకు ఎదురవుతున్న ఇబ్బందులకు నన్ను క్షమించండి” అని అడిగారు. కానీ, ఇప్పుడు రణ్‌వీర్ కుటుంబం హఠాత్తుగా తమపై వచ్చి పడిన ఈ కష్టానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని క్షమిస్తుందా, లేదా అనేది వారికే తెలియాలి.