ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు నిధులు నిలిపివేయాలని తన పరిపాలనా యంత్రాంగానికి సూచించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తెలిపారు. కరోనావైరస్ వ్యాప్తిపై స్పందించే విషయంలో డబ్ల్యూహెచ్ఓ ‘తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో విఫలమైంది’ అని ట్రంప్ అన్నారు.
చైనాలో వైరస్ పుట్టుకువచ్చిన తర్వాత డబ్ల్యూహెచ్ఓ దాని వ్యాప్తిని కప్పిపుచ్చిందని, సరిగ్గా వ్యవహరించలేదని ఆయన ఆరోపించారు. దీనికి ఆ సంస్థ బాధ్యత వహించేలా తప్పకుండా చేయాలని అన్నారు. ఇదివరకు కూడా డబ్ల్యూహెచ్ఓ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
మరోవైపు సొంత దేశంలో కరోనావైరస్‌ను అరికట్టలేకపోయారంటూ ట్రంప్ మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన డబ్ల్యూహెచ్ఓకు అత్యధిక నిధులు అమెరికా నుంచే అందుతున్నాయి. గత ఏడాది 400 మిలియన్ డాలర్లు (మూడు వేల కోట్ల రూపాయలకు పైగా) నిధులను అమెరికా డబ్ల్యూహెచ్‌కు ఇచ్చింది. డబ్ల్యూహెచ్ఓ మొత్తం బడ్జెట్‌లో అది 15 శాతం.
‘‘కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తితో అమెరికా దాతృత్వాన్ని సరిగ్గానే వినియోగించుకుంటున్నారా అని మాకు తీవ్ర ఆందోళన కలుగుతోంది’’ అని ట్రంప్ అన్నారు. కరోనావైరస్ ప్రభావం అమెరికాలోనే అత్యంత తీవ్రంగా ఉంది. ఇప్పటివరకూ ఈ దేశంలో 5.9 లక్షలకు పైగా మంది ఈ వైరస్ బారినపడ్డారు. 25 వేలకు పైగా మంది మరణించారు.
చైనాలోని వూహాన్‌లో మొదటగా కరోనావైరస్ పుట్టుకువచ్చినప్పుడే డబ్ల్యూహెచ్ఓ సరిగ్గా వ్యవహరించలేదని ట్రంప్ అన్నారు. ‘‘డబ్ల్యూహెచ్ఓ తన పని తాను చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. క్షేత్ర స్థాయిలో వాస్తవాన్ని గుర్తించేందుకు వైద్య నిపుణులను చైనాకు పంపి, ఆ దేశం చెప్పిన మాటల నిగ్గు తేల్చాల్సింది. అప్పుడు చాలా తక్కువ మరణాలతో వైరస్ పుట్టిన చోటుకే వైరస్ వ్యాప్తిని పరిమితం చేసే వీలుండేది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
వేల మంది ప్రాణాలు కాపాడగలిగే వాళ్లమని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని నివారించగలిగే వాళ్లమని ట్రంప్ అన్నారు. ‘‘కానీ, చైనా ఏది చెబితే అది, డబ్ల్యూహెచ్ఓ కావాలని గుడ్డిగా నమ్మింది. చైనా ప్రభుత్వ చర్యలను వెనకేసుకొచ్చింది’’ అని ట్రంప్ మండిపడ్డారు.
అయితే, కరోనావైరస్ కట్టడి విషయంలో చైనా చాలా బాగా కృషి చేస్తోందంటూ మొదట్లో ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. ఆ దేశ ప్రధానికి అమెరికన్ల తరఫున కృతజ్ఞతలు కూడా తెలిపారు. మరోవైపు అమెరికాలో లాక్‌డౌన్ ఎత్తివేసి, ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే ప్రణాళికలకు తుదిరూపు ఇస్తున్నామని ట్రంప్ అన్నారు.
‘’50 మంది గవర్నర్లతో త్వరలోనే మాట్లాడతా. ప్రతి గవర్నర్‌కూ తమ తమ రాష్ట్రంలో ఓ ప్రణాళికను అమలు చేసే బాధ్యతను ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం వారిని దగ్గరగా గమనిస్తుంది. అమలు సరిగ్గా జరిగేలా మేం కూడా వాళ్లతో కలిసి పనిచేస్తాం, కానీ, గవర్నర్లే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.
లాక్‌డౌన్ ఎత్తివేసే విషయంలో గవర్నర్లకు కాకుండా తనకు ‘సంపూర్ణ’ అధికారం ఉందంటూ ట్రంప్ ఇంతకుముందు వ్యాఖ్యానించారు. కానీ, చాలా మంది న్యాయ నిపుణులు ఆయన చెప్పింది తప్పని అభిప్రాయపడ్డారు.
ట్రంప్ ప్రకటనపై ఐరాస స్పందన
డబ్ల్యూహెచ్ఓకు నిధులు నిలిపివేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ స్పందించారు. కోవిడ్-19 ఎలా వచ్చింది? ప్రపంచమంతా ఎలా పాకింది? అనే విషయాలపై అవలోకనం చేసుకోవాల్సిన సమయం ఉంటుందని... కానీ, అది ఇప్పుడు మాత్రం కాదని ఆంటోనియో అన్నారు.
డబ్ల్యూహెచ్ఓ కార్యకలాపాలకు వనరులను తగ్గించేందుకు కూడా ఇది సమయం కాదని ఆయన వ్యాఖ్యానించారు. న్యూజీలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కూడా డబ్ల్యూహెచ్ఓ మద్దతుగా మాట్లాడారు. ''ఇలాంటి క్షిష్ట సమయంలో మనకు నమ్మకమైన సలహాలు, సమాచారం కావాలి. డబ్ల్యూహెచ్ఓ అవి అందిస్తుంది. ఆ సంస్థకు మా మద్దతు కొనసాగుతుంది'' అని అన్నారు.
''సంక్షోభం రోజురోజుకీ ముదురుతున్న కొద్దీ ట్రంప్ తన రాజకీయ వ్యూహాలు ఏమిటో బయటపెట్టుకుంటున్నారు. డబ్ల్యూహెచ్ఓను నిందించాలి. చైనాను నిందించాలి. రాజకీయ ప్రత్యర్థులను నిందించాలి. ఇదివరకటి అధ్యక్షులను నిందించాలి'' అని అమెరికా హౌస్ ఫారెన్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ ఎలియట్ ఎంగెల్ విమర్శించారు. ఎలియట్ అమెరికాలోని ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ నాయకుడు.