మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 24 డిశెంబరు 2020 (12:33 IST)

కోవిడ్‌-19 లాక్‌డౌన్‌: ఫిలిప్పీన్స్‌లో సంతాన విప్లవం - లక్షల సంఖ్యలో అవాంఛిత గర్భాలు

రొవెలీ జబాలా ప్రస్తుతం నిండు గర్భిణి, తన పదో సంతానాన్ని కనేందుకు సిద్ధంగా ఉన్నారు. కుటుంబ నియంత్రణ గురించి తెలుసుకునే నాటికే రొవెలీ ఏడుగురు పిల్లలకు తల్లి. లాక్‌డౌన్‌ సమయంలో ఆమె మరోసారి గర్భవతి అయ్యారు. లాక్‌డౌన్‌ సమయంలో ఫిలిప్పీన్స్‌లో కొన్ని లక్షల మంది మహిళలు గర్భ నిరోధక పద్ధతులకు దూరమయ్యారు. రొవెలీలాంటి ఎంతో మంది మహిళలు అవాంఛిత గర్భం పొందారు.

 
వచ్చే ఏడాదికి దాదాపు 2,14,000 మంది అవాంఛిత శిశువులు జన్మించబోతున్నారని యూనివర్సిటీ ఆఫ్‌ ఫిలిప్పీన్స్‌, యునైటెడ్‌ నేషన్స్‌ జనాభా నిధి సంయుక్తంగా అంచనా వేశాయి. వీరంతా యేటా ఆసుపత్రులలో పుట్టే 17 లక్షల ఫిలిప్పిన్స్‌ జనాభాకు అదనం. ఇందులో చాలా కుటుంబాల వారు కనీస సంపాదన లేని వారే.

 
ఇది ఆరంభమే..
ఈ జన విస్ఫోటనానికి కేవలం కరోనాను ఒక్కదాన్నే బాధ్యురాలిని చేయడం కూడా కుదరదు. ఈ సమస్య ఇక్కడ చాలాకాలంగా ఉంది. ఫిలిప్పీన్స్‌ రాజధాని నగరం జనాభాతో కిక్కిరిసిపోతోంది. ఈ నగరంలో సుమారు కోటీ 30 లక్షల మంది జనాభా ఉన్నారు. చదరపు కిలోమీటరుకు సరాసరిన 70,000 మంది నివసిస్తున్నారు.

 
ట్రాఫిక్‌ కూడళ్ల నుంచి జైళ్ల వరకు అన్నీ కిక్కిరిసిపోతున్నాయి. తమ కెపాసిటీకన్నా 300 శాతం మంది అధిక నేరస్తులను జైళ్లు భరిస్తున్నాయి. రాజధాని నగరంలోని మురికి వాడల్లో నివసించే పేదలు మాంసాన్ని చెత్త కుప్పల నుంచి ఏరుకుని తింటుంటారు. సంతానోత్పత్తి రేటును తగ్గిస్తే దేశాభివృద్ధి జరుగుతుంది. తగ్గిన జనాభా ప్రభావం బడ్జెట్‌లో కనిపిస్తుంది. తద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.

 
వాస్తవానికి సంతాన నిరోధక ప్రణాళికలను ఫిలిప్పీన్స్‌ 1960ల నుంచి అనుసరిస్తూనే ఉంది. సంతానోత్పత్తి రేటును తగ్గించడంలో కొంత వరకు విజయం సాధించగలిగింది. అయితే జనాభా 35 మిలియన్ల నుంచి 110 మిలియన్లకు పెరిగింది. కాకపోతే 1969లో 6.4గా ఉన్న జననాల రేటు 2020 నాటికి 2.75కి పడిపోవడం కొంత వరకు ఉపశమనం.

 
అదే సమయంలో తోటి ఆగ్నేయాసియా దేశమైన థాయిలాండ్‌ కన్నా ఫిలిప్పీన్స్‌ వెనకబడింది. థాయిలాండ్‌ 1969 5.8గా ఉన్న సంతానోత్పత్తి రేటును 2020 నాటికి 1.5కు తగ్గించగలిగింది. అలాగే థాయిలాండ్‌లో పేదరికం 10 శాతం కాగా, ఫిలిప్పీన్స్‌లో అది 17 శాతంగా ఉంది. దీనికంతటికీ ఫిలిప్పీన్స్‌లోని చర్చ్‌ వ్యవస్థను కారణంగా చెబుతారు. అది ఆ దేశంలో సంతాన నిరోధక ప్రణాళికలను వ్యతిరేకించింది. ఎంతమందిని కావాలంటే అంతమందిని కనాలని ఉద్బోధించింది.

 
“అవును సంతాన నిరోధక విధానాలను మేం వ్యతిరేకించాం’’ అని క్యాథలిక్‌ బిషప్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ఫిలిప్పీన్స్‌కు చెందిన ఫాదర్‌ జెరోమ్‌ సెసిల్లానో అంగీకరించారు. “గర్భ నిరోధక మాత్రలు వాడటం అనైతికం అని చెప్పడంలో భాగంగానే మేం దాన్ని వ్యతిరేకించాం. అయితే ప్రజలు మా పిలుపుకు కట్టుబడి ఉండటం, ఉండకపోవడం వారిష్టం’’ అన్నారాయన. అయితే చర్చి పిలుపు ఎలా ఉన్నా 2012లో చేపట్టిన కుటుంబ నియంత్రణ ప్రణాళికలు కఠినంగా అమలు చేయడంతో పేదరికం కొంత వరకు తగ్గింది. లైంగికవిద్య, గర్భ నిరోధక విధానాలను పేద ప్రజలకు విరివిగా అందుబాటులోకి తెచ్చారు.

 
అయితే కోవిడ్-19 ఈ సత్ఫలితాలను తుడిచి పెట్టేసింది. “నాలుగేళ్లుగా మేం చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కాబోతున్నాయి’’ అన్నారు కమీషన్‌ ఫర్‌ పాపులేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్ డైరెక్టర్‌ జువాన్‌ ఆంటోనియో పెరెజ్‌. “దేశంలో ఇప్పుడు పదింటిలో మూడు గర్భాలు అవాంఛితమే. వచ్చే ఏడాదికి సగానికి సగం అవాంఛిత గర్భాలే ఉండే అవకాశం ఉంది’’ అన్నారాయన.

 
బేబీ ఫ్యాక్టరీ
డాక్టర్‌ జోస్‌ ఫాబెల్లా మెమోరియల్‌ ఆసుపత్రిలో సిబ్బంది నిత్యం బిజీగా కనిపిస్తారు. 2012కి పూర్వం ఈ ఆసుపత్రిలో ప్రతిరోజూ 120 మంది పిల్లలు జన్మించేవారు. ఒకప్పుడు దీనికి బేబీ ఫ్యాక్టరీగా పేరుండేది. అయితే ప్రభుత్వం ప్రచారం చేసిన కుటుంబ నియంత్రణ ప్రయత్నాలు సఫలం కావడంతో 2012 తర్వాత ఇక్కడ జననాల రేటు సగానికి పడిపోయింది.

 
ఈ ఆసుపత్రిలోని ఓ వార్డులోకి బీబీసీ ప్రతినిధులు ప్రవేశించినప్పుడు అక్కడ చిన్నారుల ఏడుపులతో గందరగోళంగా ఉంది. ఫుట్‌బాల్ పిచ్‌ సైజులో ఉన్న ఆ వార్డులో బెడ్లన్నీ దగ్గర దగ్గరకు చేర్చి ఉన్నాయి. డెలివరీ గౌన్లు వేసుకున్న తల్లులు, ఫేస్‌మాస్కులు ధరించి బెడ్స్‌ మీద పడుకుని తమ పిల్లలను జోకొడుతున్నారు.

 
“రెండు బెడ్లు జత చేసి ముగ్గురు నలుగురు తల్లులను పడుకోబెట్టాల్సి వస్తోంది’’ అని వివరించారు డాక్టర్‌ డయానా కాజిపె. “మాకు ఇక్కడ స్థలం లేదు. రాబోయే రోజుల్లో మరింతమంది గర్భిణులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆసుపత్రి గరిష్ట పరిమితికి చేరుకుంది. రాబోయే రోజుల్లో రెండు బెడ్ల మీద ఏడెనిమిదిమందిని పడుకోబెట్టాల్సి ఉంటుంది’’ అన్నారామె.

 
ఇటీవల కొందరు సిబ్బంది కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ ఆసుపత్రిని నెలరోజులపాటు మూసేయాల్సి వచ్చింది. లోపలున్న పరిస్థితులకు వైరస్‌ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్త భవనం కోసం ఆసుపత్రి యాజమాన్యం కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. కానీ ఇంత వరకు అది సాధ్యం కాలేదు.

 
భిన్నాభిప్రాయం
ఈ జనాభా విస్ఫోటనాన్ని నిరోధించకపోతే భవిష్యత్‌ తరాలపై అది ఎంతటి ప్రభావం చూపుతుందో అందరికీ తెలుసు. ఇప్పుడు కోవిడ్ సమస్య పరిస్థితిని మరింత జటిలం చేసింది. ఇది ఆ దేశ బడ్జెట్‌పై పెను ప్రభావాన్ని చూపింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సంతాన నియంత్రణ కార్యక్రమానికి ప్రభుత్వం అవసరమైన నిధులలో పావువంతు నిధులను మాత్రమే మంజూరు చేయగలుగుతోందని ఆర్ధికవేత్త పెర్నియా అన్నారు.

 
దేశాధ్యక్షుడు సంతాన నియంత్రణకు అనుకూలమే అయినా, ఆయన ప్రస్తుతం డ్రగ్స్‌ నియంత్రణ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారని పెర్నియా వ్యాఖ్యానించారు. పైగా ఈ సంతాన నిరోధక కార్యక్రమంపై చర్చికి చెందిన అధికారులు న్యాయస్థానాల్లో దావా వేసి పరిస్థితి మరింత ఆలస్యమయ్యేందుకు కారణమవుతున్నారు. ప్రస్తుతం ఆగ్నేయాసియాలో అత్యధిక ప్రెగ్నెన్సీ రేట్ ఉన్న దేశాలలో ఫిలిప్పీన్స్‌ అగ్రభాగంలో ఉంది. ఇప్పుడు కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ రేటు మరో 20శాతం అదనంగా పెరిగింది.

 
అయితే తాము ప్రభుత్వ ప్రణాళికలను అడ్డుకోవడం లేదని చర్చ్‌ చెబుతోంది. వాటిని అమలు చేయాలన్నదే తమ అభిమతమని అంటోంది.“తమ విధులు నిర్వర్తించడంలో విఫలమైనవాళ్లే చర్చ్‌పై ఆరోపణలు చేస్తున్నారు’’ అన్నారు ఫాదర్‌ జెరోమ్‌ సెసిల్లానో.

 
ఆందోళన కలిగించే అంకెలు
రొవెలీకి సంతాన నిరోధకత గురించి తెలుసు. దానిపై చర్చి ప్రభావం కూడా తెలుసు. తాను గర్భవతినయ్యాక అబార్షన్‌ కోసం భర్తను అడిగానని, అయితే ఆ పాపం తాను చేయలేనని ఆయన సమధానమిచ్చారని రొవెలీ తెలిపారు. “మూడు నెలలుగా ఆయన నుంచి విడిపోయి దూరంగా ఉంటున్నాను’’ అన్నారు రొవెలీ.

 
ఎక్కువమంది సంతానం పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తుందని ఆమెకు తెలుసు. పైగా కరోనా వైరస్‌ కారణంగా ఫిలిప్పీన్స్‌ ఆర్ధిక పరిస్థితి మరింత క్షీణించింది. ఈ పరిస్థితుల్లో పిల్లలు ఏమవుతారోనంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. “ఒక్కోసారి మిమ్మల్ని ఏ ధనవంతుడికో దత్తత ఇస్తాను. వాళ్లు మీ చదువు సంధ్యలకు లోటులేకుండ చూస్తారు అంటుంటాను. అంతలోనే ఏదో ఒక విధంగా నడిపించగలనులే అని నాకు నేనే సమాధానం చెప్పుకుంటాను’’ అన్నారు రొవెలీ.