'దిశ' కేసులో తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద 40 అడుగుల ఎత్తున ఉన్న సీసీటీవీ ఫుటేజిలో కీలక దృశ్యాలు :ప్రెస్ రివ్యూ

Toll Plaza
బిబిసి| Last Modified మంగళవారం, 28 జనవరి 2020 (16:13 IST)
'దిశ' అత్యాచారం, హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లు ఈనాడు కథనం ప్రచురించింది. ఈ కేసులో పోలీసుల ఎదురుకాల్పుల్లో చనిపోయిన నలుగురు నిందితులకు వ్యతిరేకంగా పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలను పరీక్షించిన రాష్ట్ర ఫోరెన్సిక్ ప్రయోగశాల నివేదికను సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసినట్లు ఈనాడు రాసింది.

ఈ కేసుకు సంబంధించి శంషాబాద్, షాద్‌నగర్ పోలీసులు సుమారు 40 సాక్ష్యాధారాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ప్రయోగశాలకు గత ఏడాది డిసెంబర్ రెండో వారంలో పంపించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు, యంత్రాలు, సూక్ష్మపరికరాలతో వాటిని విశ్లేషించారు.


ఇందులో కీలకమైన సాక్ష్యాలు, దిశ, ఆమె సోదరి స్వరాలు, తొండుపల్లి టోల్‌ప్లాజా దగ్గర దిశను లాక్కెళ్లేటప్పుడు నిక్షిప్తమైన సీసీ కెమెరా ఫుటేజీ, దిశ సెల్‌ఫోనులోని నంబర్లు.. సంక్షిప్త సందేశాలు.. సంభాషణల నివేదికలను ప్రత్యేకంగా రూపొందించారు. వీటిని రెండు రోజుల్లో పోలీసులకు అందజేయనున్నట్లు తెలిసింది.

తొండుపల్లి టోల్‌ప్లాజా కూడలి దగ్గర 40 అడుగుల ఎత్తులో ఉన్న సీసీ కెమెరాలో దిశ హత్యాచార ఘటనకు సంబంధించిన అత్యంత కీలక దృశ్యాలు రికార్డయ్యాయి అని ఈనాడు కథనంలో చెప్పారు. ఆమె ద్విచక్ర వాహనం టైర్ పంక్చర్ చేయడం, బాగు చేయిస్తామంటూ నిందితులు ఆమెతో మాట్లాడడం, అక్కడున్న వారెవరికీ అనుమానం రాకుండా లారీ వద్దకు లాక్కెళ్లడం... ఇలా అన్ని దృశ్యాలూ ఆ ఫుటేజీలో ఉన్నాయి.


అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో నిందితుల ముఖాలు మరింత స్పష్టంగా కనిపించేలా ఫోరెన్సిక్ ప్రయోగశాల అధికారులు అభివృద్ధి చేసినట్లు ఈ కథనంలో వివరించారు.

దీనిపై మరింత చదవండి :