బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 16 జనవరి 2020 (15:35 IST)

అత్యాచారాలపై కేసులు పెట్టిన బాధితులను కొత్త సమస్యలు వేధిస్తున్నాయా?

హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని విషయాలు మీ మనసును కలచివేయవచ్చు
 
అత్యాచారాలపై ఫిర్యాదు చేశాక మహిళలు మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందా? అవును. కొన్ని కేసులు పరిశీలిస్తే అది ఎంత నిజమో అర్థమవుతుంది. కొందరు బాధితులకు న్యాయం జరుగుతుండవచ్చు. కానీ, మిగతా వారు మాత్రం ఆ విషయం గురించి బయట మాట్లాడేందుకే సంకోచిస్తున్నారు. సమాజంలో కొందరు బాధితులనే దోషులుగా చూస్తున్నారు.

 
గడచిన కొన్నేళ్లుగా లైంగిక వేధింపుల పట్ల ప్రజల్లో అవగాహన చాలా పెరిగింది. హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్‌స్టీన్ లాంటి బడా వ్యక్తులపై మహిళలు ధైర్యంగా ఫిర్యాదులు చేశారు. భారత్‌, స్పెయిన్‌ తదితర దేశాల్లోనూ అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి.

 
#MeToo
అనేక దేశాల్లో #MeToo ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఈ ఉద్యమంలో భాగంగా వివిధ రంగాలకు చెందిన అనేక మంది మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వెల్లడించారు. అయితే, అవగాహన ఒక్కటే సరిపోదు. బాధితులకు సరైన న్యాయం కూడా జరగాలి. అత్యాచారాలపై ఫిర్యాదు చేస్తున్న మహిళల సంఖ్య పెరిగినా, దోషులకు శిక్షలు పడటంలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడంలేదని ఉద్యమకారులు చెబుతున్నారు.

 
భారత్‌లో 2012 నుంచి 2016 మధ్య కోర్టు వరకు వెళ్లిన మొత్తం రేప్ కేసుల్లో 25 శాతం కేసులలో మాత్రమే దోషులకు శిక్షలు పడ్డాయి. యూకేలో ఆ సంఖ్య మరీ తక్కువగా ఉంది. ఇంగ్లండ్, వేల్స్‌‌లో పోలీసులు నమోదు చేస్తున్న ప్రతి 100 రేప్ కేసుల్లో సగటున మూడింటిలో మాత్రమే దోషులకు శిక్షలు పడుతున్నాయి.

 
ఫిర్యాదు చేసిన టీనేజీ అమ్మాయికి జైలు శిక్ష
తనపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఫిర్యాదు చేసిన ఒక బ్రిటిష్ టీనేజీ అమ్మాయిని తప్పుడు ఆరోపణలు చేశారంటూ తిరిగి ఆమె మీదే కేసు పెట్టి సైప్రస్ దేశంలోని కోర్టు జైలు శిక్ష విధించడం కొన్ని నెలల క్రితం తీవ్ర వివాదానికి దారితీసింది. "సైప్రస్ దేశ న్యాయవ్యవస్థ, సిగ్గు సిగ్గు" అంటూ మహిళలు కోర్టు వద్ద ఆందోళన చేశారు.

 
తాను ఒక వ్యక్తితో పరస్పర అంగీకారంతో సెక్సులో పాల్గొంటున్నప్పుడు, ఆ వ్యక్తి స్నేహితులు 12 మంది వచ్చి తనపై సామూహిక అత్యాచారం చేశారని 2019 జూలైలో ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు ఇజ్రాయెల్‌కు చెందినవారని ఆమె చెప్పారు. ఆ వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కానీ, నేర నిర్ధరణ కోసం ఎలాంటి విచారణ చేయలేదు.

 
ఆ తర్వాత అమ్మాయిని తీసుకెళ్లి న్యాయవాది లేకుండా పోలీసులు కొన్ని గంటల పాటు విచారించారు. చివరికి ఆమె తన ఆరోపణలను 'ఉపసంహరించుకున్నారు'. దాంతో, ఆ 12 మందిని పోలీసులు విడుదల చేశారు. అమ్మాయి మీద కేసు పెట్టి జైలుకు పంపారు. పోలీసులే బలవంతంగా తమ కుమార్తెతో ఆరోపణలను ఉపసంహరించుకునేలా చేశారని ఆమె తల్లి ఆరోపించారు.

 
'నా బిడ్డను బెదిరించారు'
"తప్పుడు ఆరోపణలు చేశావంటూ అరెస్టు చేస్తామని నా బిడ్డను పోలీసులు బెదిరించారు. తప్పుడు ఆరోపణలు చేశానని ఒప్పుకోకుంటే ఆమె స్నేహితుడి మీద అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని, ఆరోపణలను ఉపసంహరించుకుంటే ఆమెను వదిలేస్తామన్నారు. దాంతో, అక్కడి నుంచి బయటపడటమే మంచిదన్న ఆలోచనతో నా బిడ్డ వాళ్లకు తాను తప్పుడు ఆరోపణలు చేశానని చెప్పింది" అని ఆ అమ్మాయి తల్లి వివరించారు.

 
ఆమెను పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారని ఆమె తరఫు న్యాయవాది లెవిస్ పవర్ క్యూసీ అన్నారు. ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆమె కొన్ని రోజుల క్రితం తన ఇంటికి చేరుకున్నారు. బలవంతంగా తనతో సైప్రస్ పోలీసులు అబద్ధం చెప్పించారని ఆమె ఆరోపించారు. పోలీసులు మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇప్పుడు జైలు నుంచి విడుదలైనా తన బిడ్డ తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతోందని ఆమె తల్లి చెబుతున్నారు. "ఈ కేసు ఇంకా ముగిసిపోలేదు. యూరోపియన్ మానవ హక్కుల కోర్టుకు వెళ్లాలన్న ఆలోచన చేస్తున్నాం" అని బాధితురాలి తరఫు న్యాయవాది చెప్పారు.

 
'పర్యటనకు వెళ్లినప్పుడు అత్యాచారం'
సైప్రస్‌లో జైలు శిక్ష అనుభవించిన బ్రిటన్ టీనేజీ అమ్మాయి తిరిగి ఇంటికి చేరిన తర్వాత, సైప్రస్‌లో తాము కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని, తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉంటాయోనన్న భయంతో అప్పుడు ఫిర్యాదు చేయలేకపోయామని మరికొందరు మహిళలు చెప్పారు. అలా బయటకొచ్చి మాట్లాడిన వారిలో సోఫీ (పేరు మార్చాం) ఒకరు.

 
సైప్రస్‌‌లో సరైన పోలీసు భద్రత లేదని, పురుషులు ఎంత హేయంగా ప్రవర్తించినా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయని ఆమె అంటున్నారు. తాను సైప్రస్ సందర్శనకు వెళ్లినప్పడు బీచ్‌ పార్టీలో ఒక వ్యక్తి తనకు మత్తు కలిపిన పానీయం ఇచ్చి, అత్యాచారం చేశాడని ఆమె చెప్పారు.

 
"ఆ పానీయం తాగాక నేను కింద పడిపోవడం నాకు గుర్తుంది. ఆ తర్వాత స్పృహ కోల్పోయాను. నా మీద లైంగిక దాడి జరిగిందని తర్వాత తెలిసింది. టాయిలెట్‌కు వెళ్లాక నా జననాంగంలో కండోమ్ ఉంది. అత్యాచారానికి గురయ్యాయనని నాకు అప్పుడు అర్థమైంది. ఆ ఘటనతో మానసికంగా చాలా కుంగిపోయాను. పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే ధైర్యం చాలలేదు. అక్కడ నాకు మద్దతుగా నిలిచేవారు కూడా దొరకలేదు" అని ఆమె వివరించారు.

 
'మహిళలను నిరుత్సాహపరుస్తున్నారు'
ప్రపంచంలో ఎక్కడైనా అత్యాచార కేసుల్లో ఫిర్యాదులు చేసిన తర్వాత కూడా మహిళలు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. పోలీసు, న్యాయవ్యవస్థల విచారణలు, జనాల దురభిప్రాయాలు, మీడియా ప్రభావం వల్ల బాధితులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. "బాధితులకు న్యాయం జరగడమన్న విషయాన్ని అటుంచితే, వారిపట్ల సమాజం వ్యవహరించే తీరు మహిళలను, యువతులను నిరుత్సాహపరుస్తోంది" అని రేప్ క్రైసిస్ ఇంగ్లండ్ & వేల్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కేటీ రస్సెల్ అభిప్రాయపడ్డారు.

 
మహిళలపై అఘాయిత్యాలను అరికట్టాలంటే చట్టాలు మాత్రమే పరిష్కారం చూపవని, సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని కేటీ రస్సెల్ అంటున్నారు. చాలా దేశాల్లో ఏది అంగీకారం, ఏది అనంగీకారం అన్న విషయంలోనూ సరైన అవగాహన లేకపోవడం కూడా అనేక పరిణామాలకు దారితీస్తోంది.

 
ధైర్యంగా బయటకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిన అత్యాచార బాధితులనే సమాజంలో కొందరు దోషులుగా చూస్తున్నారని, అందువల్ల బాధితులు మానసికంగా కుంగిపోవాల్సి వస్తోందని కేటీ అంటున్నారు. ఇలాంటి పరిస్థితి ప్రపంచమంతా ఉందన్నారు. విదేశాల్లో వేధింపులు ఎదుర్కొంటే అక్కడి న్యాయ వ్యవస్థ గురించి సరైన అవగాహన లేకపోవడం, భాష తెలియకపోవడం లాంటి అవరోధాలను అధిగమించడం బాధితులకు కష్టంగా మారుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.

 
రివెంజ్ పోర్న్
కొన్నిసార్లు బాధితులను, వారి కుటుంబాలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. హైదరాబాద్‌ శివారులో దిశపై అత్యాచారం జరిగిన తర్వాత సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంకొన్ని కేసుల్లో రివెంజ్ పోర్న్‌తో బాధితులను మరింత క్షోభకు గురిచేస్తున్నారు.

 
సైప్రస్‌లో లైంగిక దాడి కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, పలువురు పురుషులు ఒక బ్రిటిష్ టీనేజీ అమ్మాయితో సెక్స్ చేస్తున్నట్లుగా చూపుతున్న ఒక వీడియో వైరల్ అయ్యింది. స్పెయిన్‌కు చెందిన ఒక మహిళపై అయిదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేస్తూ ఫోన్‌తో చిత్రీకరించిన వీడియో విస్తృతంగా వ్యాప్తి చెందింది. కొన్ని తప్పుడు అత్యాచార కేసులు కూడా నమోదవుతుంటాయి. కానీ, అవి చాలా తక్కువే ఉంటాయి. అలాంటి కేసులు ఒక శాతం కంటే తక్కువే ఉంటాయని అంచనా.