సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 11 డిశెంబరు 2020 (13:13 IST)

భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని సవతి పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న మొదటి భార్య: ప్రెస్‌రివ్యూ

భర్త రెండో పెళ్లి చేసుకున్నాడనే కోపంతో రెండో భార్య ద్వారా అతడికి పుట్టిన పిల్లలను హత్య చేసిన మొదటి భార్య తర్వాత ఆత్మహత్య చేసుకుందని ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది. తనని కాదని రెండో పెళ్లి చేసుకున్నందుకు భర్తపై కక్ష పెంచుకుందా ఇల్లాలు. భర్త తనకు దూరమవుతున్నాడనే బాధను తట్టుకోలేక... కట్టుకున్న వాడు చేసిన నమ్మక ద్రోహాన్ని జీర్ణించుకోలేక కొన్నేళ్లుగా కుమిలిపోయిన ఆమె తన కోపాన్ని మరో రూపంలో తీర్చుకుందని ఈ కథనంలో రాశారు.

 
పెళ్లిరోజు నాడే భర్త రెండో భార్యకు పుట్టిన ఇద్దరు కుమార్తెలను చంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ పట్టణంలో గురువారం ఆ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ పట్టణం జూబ్లిహిల్స్‌ కాలనీకి చెందిన మేకల ప్రదీప్‌, ప్రసన్నరాణి (45) దంపతులు ఐసీడీఎస్‌ శాఖలో ఒప్పంద ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.

 
ప్రస్తుతం ప్రదీప్‌ భువనగిరి జిల్లాలో, ఆయన భార్య మునుగోడులో విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి 1999లో వివాహమైంది. కుమారుడు (20), కుమార్తె (15) ఉన్నారు. ఎనిమిదేళ్ల క్రితం ప్రదీప్‌ నల్గొండ పట్టణానికే చెందిన మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు మేఘన (6), రుచరి (4) కుమార్తెలు.

 
మూడేళ్ల క్రితం భర్త రెండో పెళ్లి విషయం ప్రసన్నరాణి దృష్టికి వచ్చింది. అప్పటి నుంచి తరచూ ఆమె భర్తతో, ఆయన రెండో పెళ్లి చేసుకున్న మహిళతో గొడవపడుతూ వస్తోంది. రెండో భార్యకు భర్త నల్గొండలో ఇల్లు కట్టిస్తున్నట్టు ఇటీవల తెలుసుకుని రగిలిపోయింది. గురువారం పెళ్లిరోజు నాడే అతనిపై కక్ష తీర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చింది.

 
ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయంత్రం పక్క కాలనీలో ఉంటున్న శాంత ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేదు. తన పుట్టినరోజున కేకు కోస్తున్నట్టు చిన్నారులు మేఘన, రుచరిలను నమ్మించి ఇంటికి తీసుకొచ్చింది. పడక గదిలో ఇద్దర్నీ ఉరి బిగించి చంపి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంది’ అని నల్గొండ ఒకటో పట్టణ ఎస్సై వెంకట్‌రెడ్డి వెల్లడించారని ఈనాడు రాసింది.

 
శుభకార్యానికి వెళ్లి రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి తిరిగివచ్చిన భర్త ముగ్గురూ విగతజీవులుగా పడి ఉండటాన్ని గుర్తించి సమాచారమిచ్చారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రసన్నరాణి రాసిన ఆత్మహత్య లేఖను ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారని పత్రిక వివరించింది.