గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (09:58 IST)

వీజే చిత్రకు రిజిస్టర్ మ్యారేజ్ అయిందా? సూసైడ్ కేసులో ఎన్నో అనుమానాలు?

కోలీవుడ్‌లో సంచలనం రేకెత్తించిన బుల్లితెర నటి వీజే చిత్ర ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనకు చిత్రకు ఇప్పటికే పెళ్లి అయిందని ఆమె ప్రియుడు హేమంత్ చెబుతున్నాడు. అందుకే తాను చిత్రతో కలిసి ఒకే గదిలో ఉంటున్నట్టు చెప్పాడు. మరి భర్త (కాబోయే) పక్కన ఉండగా చిత్ర ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 
 
తమిళ బుల్లితెర నటి వీజే చిత్ర మంగళవారం రాత్రి చెన్నై శివారు ప్రాంతంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో సూసైడ్ చేసుకున్న విషయం తెల్సిందే. ఆత్మహత్యకు ముందువరకు షూటింగ్‌లో పాల్గొనడం, హోటల్‌లోకి వచ్చి కాబోయే భర్తతో ముచ్చటించడం, అనంతరం బాత్‌రూమ్‌లోకి వెళ్లి సూసైడ్‌ చేసుకొని విగతజీవిగా మారడం తమిళ సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... కీలక ఆధారాలను గుర్తించారు. అయితే చిత్ర సూసైడ్‌పై పోలీసుల దర్యాప్తులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. పొద్దుపోయేదాక షూటింగ్‌లో పాల్గొన్న వీజే చిత్ర హోటల్‌రూమ్‌కు వచ్చే క్రమంలో తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో నవ్వుతూ ఉన్న ఫోటోను షేర్ చేసింది. అయితే అప్పటివరకు నవ్వుతూ ఉన్న ఆమె.. హోటల్‌ రూమ్‌లోకి వెళ్లిన రెండుమూడు గంటల్లోనే ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. 
 
మరోవైపు ఆమెతో సీరియల్ సీన్లలో పాల్గొన్న సహ నటులు కూడా ఆమెలో ఎటువంటి టెన్షన్ కనపడలేదని, ఆత్మహత్య చేసుకునేంత పిరికి అమ్మాయి కాదని చెబుతుండటం గమనార్హం. పాపులర్ టీవీ షో ‘పాండ్యన్ స్టోర్స్‌’తో ఫేమస్ అయిన చిత్ర.. వరుస ఆఫర్లతో బిజీగా మారింది. ఆర్థిక ఇబ్బందులు అస్సలు లేవు. 
 
ఇటీవలే కొద్దిరోజుల క్రితం బిజినెస్‌మెన్‌ హేమంత్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి షూటింగ్ ముగించుకొని చెన్నైలోని హోటల్‌లోకి చేరుకోగా అప్పటికే హేమంత్ తన గదిలో ఉన్నాడు. మళ్లీ బుధవారం ఉదయం షూటింగ్‌కు రెడీ అయ్యేందుకు స్నానానికి అని బాత్‌రూమ్‌లోకి వెళ్లిన చిత్ర ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో హేమంత్ హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. 
 
వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది అతి కష్టంమీద డోర్ ఓపెన్ చేయగా అప్పటికే చిత్ర సూసైడ్ చేసుకోవడం అందిరినీ షాక్‌కు గురి చేసింది. అయితే.. కాబోయే భర్త పక్కనే ఉండగా బాత్‌రూమ్‌లోకి వెళ్లిన చిత్ర అసలు ఎందుకు సూసైడ్ చేసుకోందనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. 
 
షూటింగ్ నుంచి హోటల్‌కు వచ్చిన సమయంలో హేమంత్‌తో చిత్రకు గొడవైనా జరిగిందా ? లేకుంటే హేమంత్‌కు తెలియకుండా ఏదైనా ఇతర కారణాలతో చిత్ర ఇబ్బందులు పడి ప్రాణం తీసుకుందా అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.