శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 1 జులై 2020 (18:14 IST)

చైనా యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది, తరువాత ఏంటి?

చైనా వస్తు బహిష్కరణ గురించి లార్సన్ అండ్ టుబ్రో చేసిన ప్రకటనపై చర్చ ఇంకా నడుస్తుండగానే, పొరుగు దేశం నుంచి వచ్చే వస్తువులను నిషేధించడం వల్ల వస్తువుల ధరలు పెరుగుతాయని ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకీ చెప్పింది. “బయట నుంచి వస్తువులు దిగుమతి చేసుకునే కంపెనీలకు అది తప్పదు. ఎందుకంటే ఆ క్వాలిటీ వస్తువులు, అంత తక్కువ ధరల్లో భారత్‌లో అందుబాటులో లేవు” అని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ్ చెప్పారు.

 
ఎంతోకాలం నుంచీ దిగుమతులపై ఆధారపడ్డ పరిశ్రమలకు ఇది లాభదాయకం కాదని పీటీఐతో మాట్లాడిన భార్గవ అన్నారు. “ఎందుకంటే రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో వరుసగా పతనం అవుతూ వస్తోంది. దానివల్ల కంపెనీల వ్యయం ఇంతకు ముందుకంటే చాలా పెరిగింది. కానీ, పరిశ్రమలకు వాటిని దిగుమతి చేసుకోవడం తప్ప వేరే దారి లేదు” అన్నారు.

 
ఎల్ అండ్ టీ తర్వాత భారత్‌లో రెండో అతిపెద్ద కంపెనీ మారుతీ సుజుకీ. చైనా వస్తువులను బహిష్కరించాలని దేశంలో రోజు రోజుకూ పెరుగుతున్న డిమాండ్లను అమలు చేయడం సాధ్యమేనా అనేదానిపై భార్గవ మాట్లాడారు. ఇక, ఇంజనీరింగ్, నిర్మాణ రంగంలో పెద్ద కంపెనీ అయిన ఎల్ అండ్ టీ సీఈఓ ఎస్ఎన్ సుబ్రమణ్యం కూడా చైనా వస్తువుల బహిష్కరణ ఆచరణ సాధ్యం కాదన్నారు.

 
“అలాంటి దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని దేశంలో అనిపిస్తుంటే, దానికోసం మొదట ఒక పాలసీ రూపొందించాలి. తర్వాత ఆ వస్తువులు భారత్‌లో తయారు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అదంతా పూర్తి కావాలంటే కనీసం నాలుగైదేళ్లు పడుతుంది” అని ఎస్ఎన్ సుబ్రమణ్యం అన్నారు.

 
ఏటా 90 బిలియన్ డాలర్ల వాణిజ్యం
భారత ప్రభుత్వం 59 చైనా యాప్స్ నిషేధించింది. సోమవారం సాయంత్రం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత మరికొన్ని చైనా వస్తువులపై కూడా నిషేధం విధించవచ్చు అనే చర్చ మొదలైంది. యాప్స్ తర్వాత ఈ నిషేధం ఇంకా ఎంత దూరం వెళ్లవచ్చు అనేదానిపై వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో చర్చ జోరందుకుంది.

 
దేశంలో భారీ యంత్రాల విడి భాగాల నుంచి, హోలీ రంగులు, ఔషధాలు తయారు చేసే ముడి సరుకుల వరకూ, అన్నీ చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. అలాంటప్పుడు వాటిని హఠాత్తుగా నిలిపివేయడం ఎలా సాధ్యం అవుతుంది.

 
భారత్, చైనా మధ్య వార్షిక వాణిజ్యం విలువ సుమారు 90 కోట్ల బిలియన్ డాలర్లు. ఇందులో ఎక్కువ భాగం చెల్లింపులు చైనాకే వెళ్తాయి. చైనా నుంచి భారత్ దాదాపు 70 బిలియన్ డాలర్ల సరుకులను దిగుమతి చేసుకుంటోంది. మరోవైపు దిగుమతులు నిషేధించడానికి వీలుగా భారత ప్రభుత్వం ఎయిర్ కండిషనర్, టీవీల్లో ఉపయోగించే విడి భాగాలతోపాటూ కనీసం 10-12 రకాల ఉత్పత్తులపై లైసెన్సింగ్ సిస్టం అమలు చేయబోతోందని కూడా వార్తలు వస్తున్నాయి. చైనాను దృష్టిలో పెట్టుకునే భారత్ ఈ చర్యలు చేపట్టబోతున్నట్లు చెబుతున్నారు.

 
గల్వాన్ ఘర్షణ తర్వాత ఉద్రిక్తతలు
జూన్‌ మొదట్లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత చైనా-భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. దేశమంతటా చైనా వ్యతిరేక వాతావరణం కనిపిస్తోంది. ఈ ఘటనతో నరేంద్ర మోదీ ప్రభుత్వం చైనా దేశంలో పెడుతున్న పెట్టుబడుల నిబంధనల్లో మార్పులు చేసింది. అంతేకాదు, ఆన్‌లైన్లో ఏదైనా ఉత్పత్తిని విక్రయిస్తున్నప్పుడు, వినియోగదారులకు అది ఎక్కడ తయారైందనే వివరాలను స్పష్టంగా చెప్పాలని సదరు కంపెనీలకు సూచించింది.

 
భవిష్యత్తులో చైనా వస్తువులు ఏవీ ఉపయోగించవద్దని ప్రభుత్వ టెలీకాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌కు కూడా సూచించినట్లు తెలుస్తోంది. కానీ “వ్యూహాత్మక అంశాలను, కార్పొరేట్ రంగానికి చెందిన నిర్ణయాలతో కలపకుండా ఉంటే బాగుంటుంది” అని టెలీకాం కంపెనీల సంస్థ ‘సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’(సీఓఎఐ) ఒక ప్రకటన జారీ చేసింది. ఎయిర్ టెల్, వొడాఫోన్ లాంటి కంపెనీలు సీఓఏఐ సభ్యులుగా ఉన్నాయి.

 
అయితే, ప్రభుత్వం వ్యాపార, పారిశ్రామిక రంగం అభిప్రాయాలను తెలుసుకోడానికి ప్రయత్నించడం లేదని కూడా అనకూడదు. వాణిజ్య మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి ఇప్పటికే పారిశ్రామిక సంఘాలను సంప్రదించింది కూడా. అక్కడ కూడా దీని గురించి ప్రస్తుతం వాడివేడి చర్చ నడుస్తోంది.