మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (12:19 IST)

భారత్-పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం భారత్‌కు అవసరమా, అనవసరమా?

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో అక్కడ రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కొన్నిమిత్రపక్షాలు కూడా ఇమ్రాన్‌ఖాన్‌కు దూరమవుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మార్చి 27న అధికార పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ చరిత్రాత్మక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన గంభీరంగా కనిపించేందుకు ప్రయత్నించారు. ''విదేశీ నిధుల సాయంతో పాకిస్తాన్‌లో ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం జరుగుతోంది'' అని ఈ ర్యాలీలో ఆయన ఆరోపించారు. అయితే, ఇమ్రాన్‌ఖాన్‌ ప్రకటనను ప్రతిపక్షాలు పూర్తిగా తోసిపుచ్చాయి.

 
ఇప్పుడు అందరి దృష్టి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎజెండాగా ఉన్న పాకిస్తాన్ దిగువ సభ నేషనల్ అసెంబ్లీపైకి మళ్లింది. ఇదిలా ఉండగా, ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎలాంటి ఫలితాన్నిచ్చినా, పాకిస్తాన్‌తో భారత్ సంబంధాలు ఉద్రిక్తంగానే ఉంటాయని భారత నిపుణులు భావిస్తున్నారు.

 
పాకిస్తాన్‌లో వేగంగా మారుతున్న పరిణామాలు
పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సెషన్ మార్చి 28న ప్రారంభమైంది. ఆపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ అభ్యర్థించారు. దీనికి అనుకూలంగా దిగువ సభకు చెందిన 161 మంది ఎంపీలు ఓట్లు వచ్చాయి. అనంతరం ఈ తీర్మానంపై చర్చను మార్చి 31న ప్రారంభిస్తామని సభ డిప్యూటీ స్పీకర్ ఖాసీం ఖాన్ సూరి ప్రకటించారు.

 
పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం, ఒకసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లయితే, దానిని 14 రోజులలోపు జాతీయ అసెంబ్లీలో సమర్పించాలి. అయితే, జాతీయ అసెంబ్లీ స్పీకర్ ఈ తీర్మానాన్ని నిర్ణీత గడువులోపు ప్రవేశపెట్టడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత విమర్శలు వచ్చినప్పటికీ సభను మార్చి 31కి వాయిదా వేయాలని నిర్ణయించారు. పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం, ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టిన తర్వాత, ప్రభుత్వం పై ఓటింగ్ కోసం 'గరిష్టంగా' అంటే ఏడు రోజులు పడుతుంది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అధికారంలో కొనసాగాలంటే కనీసం 172 మంది ఎంపీల మద్దతు అవసరం. అదే సమయంలో అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే ప్రతిపక్షానికి 172 మంది ఎంపీలు కూడా కావాలి.

 
భారతదేశానికి మార్పు కంటే కొనసాగింపు అవసరం
పాకిస్తాన్‌లో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ, పాక్ సైన్యం జోక్యం చేసుకున్నంత కాలం, దిల్లీతో ఇస్లామాబాద్‌కు సంబంధాలు సరిగా ఉండవని చాలామంది భారతీయ నిపుణులు భావిస్తున్నారు. భారతదేశానికి చెందిన ప్రసిద్ధ థింక్-ట్యాంక్ 'ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్' (ఐడీఎస్ఏ) సీనియర్ ఫెలో డాక్టర్ అశోక్ బెహూరియా పాకిస్తాన్ రాజకీయ దృశ్యాన్ని 'మ్యూజికల్ చైర్ ఆట'గా అభివర్ణించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి మార్పు ఉండకూడదని భారతదేశం కోరుకుంటుందని ఆయన అన్నారు.

 
విపక్ష పీఎంఎల్‌-ఎన్‌, పీపీపీలు అధికారంలోకి వస్తే 'సైన్యాన్ని సంతోషపెట్టేందుకు' బలవంతంగా భారత్‌ పట్ల మరింత కఠిన వైఖరి అవలంభించాల్సి ఉంటుందని, అందువల్ల దిల్లీ పైన పాకిస్తాన్ వైఖరి మారే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్నంత కాలం, భారతదేశం, పాకిస్తాన్ మధ్య చర్చలు జరిగే అవకాశం లేదని పాకిస్తాన్ రాజకీయ నిపుణుడు సుశాంత్ సరిన్ అభిప్రాయపడ్డారు. ఇమ్రాన్‌ఖాన్‌ను అధికారం నుంచి తప్పిస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయని అంటున్నారు.

 
"ఇమ్రాన్ ఖాన్‌ను తొలగిస్తే, రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా బాగు పడతాయి.'ట్రాక్ టూ స్థాయిలో చర్చలకు కొంత కార్యాచరణ ప్రారంభమవుతుంది. అయితే, రెండింటి మధ్య సంబంధాలలో ఎటువంటి ప్రాథమిక మార్పుకు అవకాశం లేదు'' అని అన్నారు. పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి వారి సైన్యం ఆ దేశానికి 'వెన్నెముక'గా నిలిచిందని సైనిక వ్యవహారాల నిపుణుడు ఎయిర్ మార్షల్ (రిటైర్డ్) వీకే వర్మ అన్నారు. పాకిస్తాన్‌లో ప్రభుత్వం మారితే దాని ప్రజల కోసం కానీ, భారత్‌ కోసం కానీ మారదని ఆయన అన్నారు.

 
అదే సమయంలో భారత్‌కు సంబంధించిన విషయాల్లో సైన్యమే తుది నిర్ణయం తీసుకుంటుందని పాకిస్తాన్‌కు చెందిన పార్టీలు, సైన్యం మధ్య 'నిశ్శబ్ధ ఒప్పందం' కుదిరిందని పరిశోధకుడు ప్రతీక్ జోషి అన్నారు. అందువల్ల, కశ్మీర్ లేదా వాణిజ్యానికి సంబంధించిన సమస్యలపై మాట్లాడటం తప్ప పార్టీల నుండి పెద్దగా ఆశించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. యుక్రెయిన్ సంక్షోభాన్ని అడ్డం పెట్టుకుని రష్యా, అమెరికాలతో మంచి ఒప్పందాలు కుదుర్చుకోవాలని పాకిస్తాన్ కోరుకుంటోందని, ఇద్దరూ తమ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారని ఆయన అన్నారు.

 
ఇమ్రాన్ ఖాన్ భారత్‌ను ఎందుకు పొగిడారు?
ఇస్లామాబాద్‌లో కొనసాగుతున్న రాజకీయ గందరగోళం మధ్య, ఇమ్రాన్ ఖాన్ ఇటీవల యుక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి భారతదేశం ‘స్వేచ్ఛాయుత విదేశీ విధానం‘ను ప్రశంసించారు. ''ప్రపంచవ్యాప్త ఆంక్షలు ఉన్నప్పటికీ భారతదేశం రష్యా నుండి చమురును కొనుగోలు చేస్తోంది, ఎందుకంటే వారి విధానం ప్రజాప్రయోజనాల కోసం పని చేస్తుంది" అని మార్చి 20న ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. అయితే, భారత్‌ను ప్రశంసించినందుకు పాకిస్తాన్‌లో ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. పాకిస్తాన్ జర్నలిస్ట్ కమ్రాన్ షాహిద్ మార్చి 21న ట్విట్టర్‌లో ఇమ్రాన్ ఖాన్‌ను 'భారత మీడియాకు డార్లింగ్' అని రాశారు.

 
కశ్మీర్ సమస్యపై ప్రధానంగా దృష్టి సారించిన, ఆయన ప్రస్తుత విదేశాంగ విధానానికి భిన్నంగా భారతదేశం గురించి ఆయన చేసిన ప్రకటన భిన్నంగా ఉంది. కశ్మీర్ విషయంలో భారత్‌తో ఎలాంటి చర్చలు జరపకూడదని ఆయన ప్రభుత్వం నిర్ణయించింది. ''భారత్ అనేక అంశాలపై మాట్లాడాలనుకుంటోంది. కానీ పాక్ దృష్టి కేవలం కశ్మీర్ పైనే ఉంది. ఈ విషయంలో పాకిస్తాన్ 'గేమ్ స్పాయిలర్' పాత్రను పోషిస్తోంది'' అని విశ్లేషకుడు డాక్టర్ అశోక్ బెహూరియా అన్నారు.

 
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తరచుగా ట్విట్టర్‌లో భారత ప్రధానిని, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు చేస్తుంటారు. ఇమ్రాన్ ఖాన్ ఈ ఏడాది జనవరి 10న ఒక ట్వీట్‌లో ''బీజేపీ, మోదీ ప్రభుత్వాల అతివాద భావజాలం కారణంగా భారతదేశంలోని మతపరమైన మైనారిటీలను హిందూత్వ సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయి. మోదీ ప్రభుత్వం తీవ్రవాద ఎజెండా మా ప్రాంతంలో శాంతిని లేకుండా చేస్తోంది. ఇక్కడ ప్రమాదం పొంచి ఉంది'' అని వ్యాఖ్యానించారు.

 
భారతదేశంలోని కొన్ని మీడియా సంస్థలు కూడా ఇమ్రాన్ ఖాన్ భారతదేశాన్ని అకస్మాత్తుగా ప్రశంసించారని, ఎందుకంటే పాకిస్తానీ సైన్యం ఆయన్ను అధికారం నుండి తొలగిస్తోందని వ్యాఖ్యానించాయి. "ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సంక్షోభ సమయంలో అది ఆయన్ను వదిలేసే మూడ్‌లో ఉంది'' అని టైమ్స్ నౌ చానెల్ మార్చి 25న తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.