శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: శుక్రవారం, 26 జులై 2019 (20:37 IST)

కార్గిల్ స్పెషల్: 'వాళ్లను వదలద్దు...' ప్రాణాలు వదిలేస్తూ పరమవీర్ చక్ర కెప్టెన్ మనోజ్ చివరి మాట

ముఖాముఖి పోరాటం చేస్తున్నప్పుడు అత్యంత ముఖ్యమైన ఆయుధం 'ఖుఖ్రీ' అని గూర్ఖా రెజిమెంట్ సెంటర్లో వారి ట్రైనీలకు చెబుతారు. జవాన్లకు దానితో మనిషి గొంతు కోయడంలో కూడా ట్రైనింగ్ ఇస్తారు.


1997లో లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే 1/11 గూర్ఖా రైఫిల్‌లో భాగమైనప్పుడు దసరా పూజ సమయంలో నీ మనసులో కోరిక నెరవేరాలంటే ఒక మేకను బలివ్వమని ఆయనకు చెప్పారు. పరమవీర చక్ర విజేతలపై 'ద బ్రేవ్' అనే పుస్తకం రాసిన రచనా బిష్ట్ రావత్ అప్పుడు ఏం జరిగిందో చెప్పారు.

 
"మనోజ్ ఒక్క క్షణం తటపటాయించాడు. కానీ తర్వాత వెంటనే మేక తలను వేరు చేశాడు. అతడి ముఖమంతా మేక రక్తం చిందింది. తర్వాత తన గదిలో ఒంటరిగా ఉండిపోయిన మనోజ్ చాలాసార్లు ముఖం కడుక్కున్నాడు. బహుశా స్వార్థం కోసం ఆ హత్య చేశాననే అపరాధ భావాన్ని దూరం చేసుకోవాలని అలా ప్రయత్నించారేమో. మనోజ్ కుమార్ పాండే నిత్యం శాకాహారిగా ఉన్నాడు. అతడు ఎప్పుడూ మద్యం కూడా ముట్టలేదు" అన్నారు.

 
దాడి చేయడంలో తిరుగులేదు
ఏడాదిన్నరలోనే మనోజ్ లోలోపల ప్రాణం తీయడానికి వెనకాడే అపరాధ భావం దాదాపు లేకుండా పోయింది. అప్పటికి అతడు వ్యూహాలు రచించి, దాడులు చేసి, శత్రువుల ప్రాణాలు తీసే కళలో నిష్ణాతుడైపోయాడు. ఎముకలు కొరికే చలిలో మంచు కప్పేసిన కొండలపై నాలుగున్నర కిలోల బరువున్న 'బ్యాక్‌పాక్‌' వేసుకుని నడవడంలో మనోజ్ నైపుణ్యం సాధించాడు. ఆ బ్యాకపాక్‌లో అతడి స్లీపింగ్ బ్యాగ్, అదనంగా ఒక ఉన్ని సాక్సుల జత, షేవింగ్ కిట్, ఇంటి నుంచి వచ్చిన ఉత్తరాలు ఉంటాయి.

 
సియాచిన్ నుంచి తిరిగివెళ్తుండగా కార్గిల్ పిలుపు
11 గూర్ఖా రైఫిల్ మొదటి బెటాయిలన్ సియాచిన్‌లో మూడు నెలలు తమ విధులు పూర్తి చేసింది. అధికారులు, సైనికులు పుణెలో 'పీస్ పోస్టింగ్' కోసం ఎదురుచూస్తున్నారు. బెటాలియన్‌లో ఒక 'అడ్వాన్స్ పార్టీ' వారికంటే ముందే పుణె చేరుకుంది. సైనికులందరూ తమ యూనిఫాంలు, ఆయుధాలు తిరిగి అప్పగించేశారు. చాలా మంది సైనికులను సెలవులపై పంపేశారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం అయిన సియాచిన్‌లో వారు చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 
వారికి శత్రు సైనికుల కంటే అక్కడి వాతావరణం ఎక్కువ ప్రమాదకరంగా ఉంటుంది. మూడు నెలలు ఉండడంతో సైనికులందరూ బాగా అలిసిపోయారు. దాదాపు ప్రతి జవానూ ఐదు కిలోల బరువు తగ్గాడు. అప్పుడు, హఠాత్తుగా బెటాలియన్‌లో ఉన్న మిగతా సైనికులు పుణె వెళ్లకుండా బటాలిక్ వైపు రావాలని ఆదేశాలు అందాయి. మనోజ్ ఎప్పుడూ ముందుండి తన సైనికులకు నాయకత్వం వహించేవాడు. రెండు నెలల వరకూ నడిచిన ఆపరేషన్ కుకర్‌థాంగ్, జుబర్‌టాప్‌లలో ఎన్నో శిఖరాలను శత్రువుల నుంచి తిరిగి స్వాధీనంలో అతడిదే కీలకపాత్ర.
ఇప్పుడు అతడికి ఖాలోబార్ శిఖరాన్ని స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యాన్ని ఇచ్చారు. ఈ మొత్తం మిషన్‌ నేతృత్వం కల్నల్ లలిత్‌ రాయ్‌కు అప్పగించారు.

 
కఠిన లక్ష్యం ఖాలోబార్
అప్పటి మిషన్‌ను గుర్తు చేసుకున్న కల్నల్ లలిత్ రాయ్ "అప్పుడు మమ్మల్ని అన్ని వైపుల నుంచీ చుట్టుముట్టేశారు. పాకిస్తాన్ జవాన్లు మా పైన ఎత్తులో ఉన్నారు. మేం దిగువన ఉన్నాం. అప్పుడు మన సైనికుల మనోబలం పెంచడానికి ఒక విజయం చాలా చాలా అవసరం" అన్నారు. "ఖాలోబార్ టాప్ వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్రాంతం. అది ఒక విధంగా శత్రువులకు కమ్యూనికేషన్ హబ్ కూడా. దాన్ని స్వాధీనం చేసుకుంటే, పాకిస్తానీల మిగతా స్థావరాలు కూడా చిక్కుల్లో పడతాయని మాకు అనిపించింది. వాళ్లకు సరుకులు వెళ్లడానికి, వాళ్లు తిరిగి పారిపోడానికి ఉన్న ఒకే ఒక దారి క్లోజ్ అవుతుంది. అంటే దాన్ని ఆక్రమిస్తే మొత్తం యుద్ధం స్వరూపమే మారిపోతుంది" అన్నారు రాయ్.

 
దూసుకొచ్చిన మెషిన్ గన్ బుల్లెట్లు
ఆ అటాక్ కోసం గూర్ఖా రైఫిల్స్ రెండు కంపెనీలను ఎంచుకుంది. కల్నల్ లలిత్ రాయ్ కూడా జవాన్లతో నడుస్తున్నారు. వాళ్లు కొంతదూరం ఎక్కారో లేదో, పాకిస్తాన్ జవాన్లు వారిపై కాల్పులు ప్రారంభించారు. దాంతో సైనికులందరూ చెల్లాచెదురైపోయారు. ఆ క్షణం గురించి చెప్పిన కల్నల్ రాయ్ "పైనున్న సుమారు 60-70 మెషిన్ గన్లు మాపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాయి. ఫిరంగి గుళ్లు కూడా పడుతున్నాయి. వాళ్లు రాకెట్ లాంచర్లు, గ్రెనేడ్ లాంచర్లు అన్నీ ఉపయోగిస్తున్నారు" అన్నారు.

 
"మెషిన్ గన్ బుల్లెట్లు సెకనుకు 2900 అడుగుల వేగంతో దూసుకెళ్తాయి. అవి మన పక్కనుంచి వెళ్తుంటే మనల్ని ఎవరో గట్టిగా తోసినట్లుంటుంది. ఎందుకంటే ఆ బుల్లెట్‌తోపాటు 'ఎయిర్ పాకెట్' కూడా వస్తుంది" అని ఆయన చెప్పారు.

 
మేం ఖాలోబార్ టాప్‌కు దాదాపు 600 గజాలు కిందున్నప్పుడు రెండు ప్రాంతాల నుంచి మాపై చాలా భీకర కాల్పులు జరుగుతున్నాయి. కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్న నేను డైలమాలో పడిపోయా. మేం ముందుకెళ్లి చార్జ్ చేయచ్చు. కానీ మాలో ఒక్కరు కూడా మిగలరు. అప్పుడు, కమాండింగ్ ఆఫీసర్ అందరి ప్రాణాలూ తీశాడని చరిత్రలో చెప్పుకుంటారు. చార్జ్ చేయలేదంటే ఆయన తన లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించలేదు అని జనం అనుకుంటారు" అన్నారు కల్నల్ రాయ్.

 
"పొద్దుపొడవక ముందే పైకి చేరాలంటే, మేం రెండు గ్రూపులుగా విడిపోవాలని నాకు అనిపించింది. లేదంటే పగటి వెలుతురులో మేమంతా ప్రాణాలతో ఉండడం కష్టమవుతుంది. ఆ పరిస్థితుల్లో నాకు అత్యంత దగ్గరగా ఉన్న అధికారి కెప్టెన్ మనోజ్ పాండే". నేను మనోజ్‌తో "నువ్వు నీ ప్లటూన్ తీసుకుని వెళ్లు. నాకు పైన నాలుగు బంకర్లు కనిపిస్తున్నాయి. నువ్వు వాటిపై అటాక్ చెయ్, వాళ్లను ఫినిష్ చెయ్" అన్నాను.

 
ఆ యువ అధికారి ఒక్క సెకన్ కూడా తటపటాయించలేదు. రాత్రి చీకట్లో ఎముకలు కొరికే చలిలో భయంకరంగా బాంబింగ్ జరుగుతున్నప్పుడు పైకి ఎక్కడం మొదలెట్టాడు. ఆ సమయంలో మనోజ్, అతడి సహచరుల సాహసం గురించి బిష్ణ్ రావత్ చెప్పారు."మనోజ్ చలికి గడ్డకట్టుకుపోయి కాల్పులు జరిపేటప్పుడు జామ్ కాకుండా ఉండడానికి రైఫిల్ 'బ్రీచ్‌బ్లాక్‌'ను తన సాక్సు లోపల పెట్టుకున్నాడు. అయితే, అప్పుడు ఉష్ణోగ్రత సున్నా కంటే దిగువకు పడిపోతోంది. కానీ, నిట్టనిలువుగా ఎక్కడం వల్ల భారత జవాన్ల బట్టలు మాత్రం చమటతో తడిచిపోయాయి".

 
ప్రతి సైనికుడి దగ్గరా 1 లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది. కానీ ఎక్కేటపుడు వాళ్ల దగ్గర ఉన్న నీళ్లన్నీ సగం దూరానికే అయిపోయాయి. అయితే, చుట్టూ మంచు పడుంది. కానీ బాంబులు పేలి అదంతా కలుషితం కావడంతో ఆ మంచు తిని దాహం తీర్చుకోలేని విధంగా ఉంది. మనోజ్ ఎండిన తన పెదాలను నాలుకతో తడుపుకున్నాడు. కానీ అతడు తన వాటర్ బాటిల్‌ తాకలేదు. అందులో ఒక్క సారి గొంతు తడుపుకునేలా కొన్ని నీళ్లే ఉన్నాయి. సైకలాజికల్ కారణాలతో అతడు ఆ ఒక్క గుటక నీళ్లను మిషన్ చివరి వరకూ మిగిల్చాలనుకున్నాడు.

 
ఒక్కడే మూడు బంకర్లు ధ్వంసం చేశాడు
మనోజ్ పాండే పైకి వెళ్లాక ఏం జరిగిందో కల్నల్ రాయ్ వివరించారు. "మేం అక్కడ నాలుగు బంకర్లున్నాయని అనుకున్నాం. కానీ మనోజ్ పైకి వెళ్లాక అక్కడ ఆరు బంకర్లు ఉన్నాయని రిపోర్ట్ చేశాడు. ప్రతి బంకర్లో రెండేసి మెషిన్ గన్లు మాపైన ఫైర్ చేస్తున్నాయి. మనోజ్ కాస్త దూరంగా ఉన్న రెండు బంకర్లను ధ్వంసం చేయడానికి హవల్దార్ దీవాన్‌ను పంపించాడు. దీవాన్ కూడా ఫ్రంటల్ చార్జ్ తీసుకుని ఆ బంకర్లను స్వాధీనం చేసుకున్నాడు. కానీ బుల్లెట్ తగలడంతో అతడు వీరమరణం పొందాడు".

 
"మిగతా బంకర్లు ధ్వంసం చేయడానికి మనోజ్, అతడి సహచరులు నేలపై పాకుతూ వాటికి బాగా దగ్గరికి చేరుకున్నారు. బంకర్లను ధ్వంసం చేయడానికి ఒకే పద్ధతి ఉంటుంది. దాని లూప్ హోల్‌లో గ్రెనేడ్ వేసి దాన్లో ఉన్న వారిని చంపడం. మనోజ్ ఒక్కొక్కటిగా మూడు బంకర్లు ధ్వంసం చేశాడు. కానీ నాలుగో బంకర్లోకి గ్రెనేడ్ విసిరే ప్రయత్నంలో అతడి శరీరానికి ఎడమవైపు కొన్ని బుల్లెట్లు దూసుకెళ్లాయి. కాసేపట్లోనే మనోజ్ రక్తపు ముద్దగా మారాడు".

 
హెల్మెట్ చీల్చుకుని తల్లోంచి దూసుకెళ్లిన బుల్లెట్లు
జవాన్లు మనోజ్‌తో "సర్ ఇక ఒక బంకరే మిగిలింది. మీరిక్కడ కూచుని చూస్తుండండి. మేం వాటిని ధ్వంసం చేసి తిరిగొస్తాం" అన్నారు. అప్పుడు మనోజ్ పాండే వాళ్లతో "చూడండి, కమాండింగ్ ఆఫీసర్ నాకీ పని అప్పగించారు. అటాక్‌ను లీడ్ చేసి, కమాండింగ్ ఆఫీసర్‌కు నా విక్టరీ సైన్ పంపించడం నా బాధ్యత" అన్నాడు. తను అలా పాకుతూనే నాలుగో బంకర్ దగ్గరగా వెళ్లాడు. అప్పటికే చాలా రక్తం పోయింది. తను నిలబడి గ్రెనేడ్ విసిరే ప్రయత్నం చేశాడు. అప్పుడే పాకిస్తాన్ జవాన్లు అతడిని చూసేశారు. మెషిన్ గన్‌తో మనోజ్‌పై కాల్పులు జరిపారు.

 
ఆ బుల్లెట్లు అతడి హెల్మెట్ చీల్చుకుని తల్లోంచి వెళ్లాయి. పాకిస్తాన్ ఎడి మెషిన్ గన్ ఉపయోగిస్తుంది. దానికి 14.7 ఎంఎం బుల్లెట్లు ఉంటాయి. అవి మనోజ్ తలను ఛిద్రం చేశాయి. దాంతో అతడు కుప్పకూలిపోయాడు. కానీ, అప్పటికీ అతడిలో జోష్ అలాగే ఉంది. కొన ఊపిరితో ఉన్నా "నా ఛోడ్‌నూ", అంటే "వాళ్లను వదలద్దు" అని తన సైనికులకు చెప్పాడు. ఆ సమయానికి అతడి వయసు 24 ఏళ్ల 7 రోజులు.

 
పాకిస్తాన్ బంకర్లో అతడు అప్పటికే విసిరిన గ్రెనేడ్ పేలింది. కొంతమంది పాక్ సైనికులు చనిపోయారు. మిగతావారు పారిపోడానికి ప్రయత్నించారు. మన జవాన్లు తమ ఖుఖ్రీలు తీశారు. వాళ్లను అంతం చేశారు. మిగిలిన నాలుగు బంకర్లను కూడా ధ్వంసం చేశారు.

 
8 మంది భారత జవాన్లే మిగిలారు
ఈ అపూర్వ సాహసానికి మనోజ్‌ కుమార్ పాండేను మరణానంతరం ఇచ్చే భారత అత్యుత్తమ శౌర్య పురస్కారం 'పరమవీర్ చక్ర'తో గౌరవించారు. ఈ మిషన్‌లో కల్నల్ లలిత్ రాయ్ కాలికి కూడా బుల్లెట్ తగిలింది. ఆయనకు కూడా 'వీర్ చక్ర్' ఇచ్చారు. ఈ విజయం కోసం భారత సైన్యం భారీ మూల్యం చెల్లించింది.

 
రాయ్ తనతోపాటు రెండు కంపెనీల సైనికులను పైకి తీసుకెళ్లానని చెప్పారు. ఖాలోబార్‌పై భారత జెండా ఎగరేసినప్పుడు ఆయన దగ్గర 8 మంది జవాన్లు మాత్రమే మిగిలారు. మిగతా వారు ప్రాణాలు కోల్పోవడమో, తీవ్రంగా గాయపడడమో జరిగింది. అదే శిఖరంపై తన సైనికులతో తిండి, నీళ్లు లేకుండా మూడు రోజులు గడపాల్సి వచ్చిందని కల్నల్ రాయ్ చెప్పారు.

 
"మేం అదే దారి నుంచి కిందికి దిగినప్పుడు చుట్టూ మన సైనికుల మృతదేహాలు కనిపించాయి. వాటిలో కొన్ని మంచులో గడ్డకట్టుకుపోయాయి. పోరాటం చేస్తున్నప్పుడు ఎలా ఉన్నారో అవి అదే పొజిషన్లో ఉన్నాయి. అంటే, వారి వేళ్లు పాకిస్తాన్ బంకర్లవైపు గురిపెట్టిన రైఫిళ్ల ట్రిగ్గర్ మీదే ఉన్నాయి. ఆ తుపాకీల్లో మ్యాగజైన్ చెక్ చేస్తే వాటిలో ఒక్క బుల్లెట్ కూడా లేదు. వాళ్లు గడ్డకట్టుకుపోయి ఒక విధంగా మంచు ముద్దల్లా కనిపించారు".

 
"ఇదంతా ఎందుకు చెప్పానంటే.. ఆరోజు, మన జవాన్లు తుదిశ్వాస వరకూ, ఆఖరి బుల్లెట్ వరకూ పోరాడారు" అన్నారు రాయ్. "చెప్పాలంటే, కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే 5 అడుగులా 6 అంగుళాల ఎత్తే ఉంటారు. ఎప్పుడూ చాలా సరదాగా ఉండేవారు. తను మా ఆఫీసర్లలో అందరికంటే చురుకుగా ఉండేవారు. ఏ పని చెప్పినా, దాన్ని పూర్తి చేసేవరకూ వెనకడుగు వేసేవాడు కాదు. ఎత్తు తక్కువే అయినా సాహసం, తెగింపు, నిజాయితీ, కార్యశీలతలో ఆయన మన సైన్యంలో అందరికంటే ఎత్తున నిలుస్తారు. నేను ఆ సాహసికుడికి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేయాలనుకుంటున్నా" అని చెప్పారు కల్నల్ లలిత్ రాయ్.

 
వేణువు వాయించడం ఇష్టం
కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే చిన్నప్పట్నుంచీ సైన్యంలో చేరాలని కలలు కనేవారు. ఆయన లక్నోలోని ఒక సైనిక స్కూల్లో చదివిన తర్వాత ఎన్‌డీఏ పరీక్ష పాసయ్యారు. మనోజ్‌కు వాళ్ల అమ్మంటే చాలా ఇష్టం. ఆయన బాల్యంలో ఒకసారి తల్లితోపాటు సంతకు వెళ్లినపుడు అక్కడ ఒక పిల్లనగ్రోవి ఆయనకు నచ్చింది. ఎంతో మారాం చేశాక ఆమె మనోజ్‌కు అది కొనిచ్చారు. కొన్నిరోజులు వాడి పడేస్తాడులే అనుకున్నారు. కానీ ఆ వేణువును మనోజ్ మరో 22 ఏళ్లపాటు తన దగ్గరే జాగ్రత్తగా ఉంచుకున్నాడు. రోజూ కాసేపు వాయించాక దాన్ని తిరిగి తన బట్టల్లో పెట్టుకునేవాడు.

 
దాని గురించి చెప్పిన బిష్ట్ "మనోజ్ సైనిక స్కూలుకు వెళ్లినా, తర్వాత ఖడక్‌వాస్లా, డెహ్రాడూన్ వెళ్లినా అది ఎప్పుడూ అతడితోపాటే ఉండేది. తను కార్గిల్ యుద్ధానికి వెళ్లే ముందు సెలవులకు ఇంటికి వచ్చినపుడు దాన్ని నా దగ్గరే ఉంచి వెళ్లాడని మనోజ్ వాళ్ల అమ్మ చెప్పారు" అన్నారు.

 
స్కాలర్‌షిప్ డబ్బుతో తండ్రికి సైకిల్
మనోజ్ పాండే మొదటి నుంచీ తుదిశ్వాస వదిలే వరకూ చాలా సాదాసీదా జీవితం గడిపాడు. తమది సంపన్న కుటుంబం కాకపోవడంతో రోజూ స్కూలుకు నడిచే వెళ్లేవాడు. "వాళ్ల అమ్మ అతడికి మంచి మంచి కథలు చెప్పేవారు. మనోజ్ అఖిల భారతీయ స్కాలర్‌షిప్ టెస్ట్ పాసై సైనిక స్కూల్‌కు క్వాలిఫై అయ్యాడు. హాస్టల్లో ఉండేవాడు. ఒకసారి మనోజ్‌కు కొన్ని డబ్బులు అవసరమైతే, నీకిచ్చే స్కాలర్‌షిప్ డబ్బులు వాడుకోమని వాళ్ల అమ్మ అతడికి చెప్పారు".

 
కానీ, మనోజ్ వాళ్లమ్మతో నాన్న సైకిల్ పాతదైపోయింది, ఆ డబ్బుతో నేను ఆయన కోసం కొత్త సైకిల్ కొనాలనుకుంటున్నాఅని చెప్పాడు. ఒకరోజు అతడు నిజంగానే తన స్కాలర్‌షిప్‌ డబ్బుతో వాళ్ల నాన్న కోసం కొత్త సైకిల్ కొని తీసుకొచ్చాడు.

 
ఎన్‌డిఏ ఇంటర్వ్యూలో సమాధానం
మనోజ్ పాండే ఉత్తరప్రదేశ్‌లో ఎన్సీసీ అత్యుత్తమ క్యాడెట్‌ గౌరవం పొందాడు. ఎన్డీయే ఇంటర్వ్యూలో అతడిని "మీరు సైన్యంలోకి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు" అని అడిగితే.. "పరమవీర్ చక్ర్ విజేత" కావడానికి అని మనోజ్ సమాధానం చెప్పాడు. ఇంటర్వ్యూ చేస్తున్న సైనికాధికారులు ఒకర్నొకరు చూసి నవ్వుకున్నారు. అప్పుడప్పుడు అలా చెప్పిన మాటలు నిజం కూడా అవుతాయి. మనోజ్ కుమార్ పాండే తర్వాత ఎన్డీయేకు ఎంపిక కావడమే కాదు, దేశ అత్యున్నత శౌర్య పురస్కారం 'పరమవీర చక్ర' కూడా గెలుచుకున్నాడు.

 
కానీ ఆ పతకం అందుకోడానికి ఆయనే లేకుండా పోయారు. 2000 జనవరి 26న అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ చేతుల నుంచి మనోజ్ తండ్రి గోపీచంద్ పాండే ఆ పురస్కారాన్ని అందుకున్నారు.