శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 25 నవంబరు 2019 (15:07 IST)

మహారాష్ట్ర: శరద్ పవార్‌ది అంతా అనుకుంటున్నట్లు ‘స్క్రిప్టెడ్ డ్రామా’నా? - అభిప్రాయం

రాజకీయ క్రీడలో శరద్ పవార్‌ను కూడా ఓడించవచ్చనే విషయాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. మొత్తం మీద ఆయన ఒక గ్రాండ్ మాస్టర్. అయితే, వేటాడేవాళ్లు అప్పుడప్పుడు తామే వేటకు బలవుతారనేది మరో విషయం. సీనియర్ రాజకీయవేత్తల్లో ఒకరైన శరద్ పవార్‌ను, ఆయన తరంలోని మిగతా రాజకీయనేతల్లాగే తెలివైన పొలిటీషియన్‌గా భావిస్తారు. అది అహ్మద్ పటేల్ అయినా, ములాయం సింగ్ యాదవ్ లాంటి వారయినా రాజకీయాల్లో పండిపోయారు. ఎన్నో ఎత్తులు పైఎత్తులు వేశారు.

 
శనివారం ఉదయం 8 గంటలకు దేవేంద్ర ఫడణవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారని వార్తలు వచ్చాయి. మొదట అందరికీ ఇది శరద్ పవార్ పనే అనిపించింది. అందరూ ఒకటే అనుకున్నారు. శరద్ పవార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడే ఈ ఒప్పందం అయిపోయిందని భావించారు. రిపోర్టర్లు కూడా శరద్ పవార్ ప్రకటన వీడియోను మళ్లీ మళ్లీ చూడ్డం మొదలెట్టారు. ఆయన ద్వందార్థాల ప్రకటనను చూశారు. మీరు బీజేపీతో కలుస్తారా అని మళ్లీ మళ్లీ అడిగినా, ఆయన స్పష్టంగా దానిని కొట్టిపారేశారు.

 
ఈ వార్తపై వెంటనే స్పందించిన శరద్ పవార్, ఆయన కూతురు సుప్రియా సూలే అజిత్ పవార్ తిరుగుబాటు చేశారని చెప్పారు. సుప్రియ తన వాట్సాప్‌లో ఒక స్టేటస్ అప్‌డేట్ పెడుతూ "పార్టీ, కుటుంబం విడిపోయింది: మీరు జీవితంలో ఎవరిని నమ్ముతారు? జీవితంలో ఎవరి దగ్గరా మోసపోలేదు. తనను వెనకేసుకొచ్చాను, ప్రేమించాను... బదులుగా నాకు ఏం లభించిందో చూడండి" అన్నారు.

 
అందరూ "స్క్రిప్టెడ్ డ్రామా" అనుకున్నారు
ఆమె స్పష్టంగా క్యాంప్ మార్చిన కజిన్ అజిత్ పవార్ గురించే ఈ మాటలు అన్నారు. అజిత్ పవార్, సుప్రియా సూలేకు ఎప్పుడూ పడదనే విషయం అందరికీ తెలిసిందే. వాళ్లిద్దరూ శరద్ పవార్ తర్వాత ఎన్సీపీ పగ్గాలు అందుకోవాలని చూస్తున్నారు. మొదట ట్విటర్‌లో రాజకీయ విశ్లేషకులకు దీనిపై ఎలాంటి నమ్మకం కలగలేదు. వారిలో వంద శాతం మంది ఎప్పటిలాగే ఈసారి కూడా శరద్ పవార్ చాకచక్యంగా రాజకీయం నడిపారని అనుకున్నారు. జనం కూడా ఇదంతా స్క్రిప్టెడ్ డ్రామా అని భావించారు.

 
శరద్ పవార్‌ భారత తర్వాత రాష్ట్రపతి అవుతారని, సుప్రియా సూలేకు మోదీ ప్రభుత్వంలో మంత్రి పదవి లభిస్తుందని ఊహాగానాలు సాగాయి. కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ "వో జో పహలే కహతే థే కీ, హం నహీ హోంగే జుదా.. బేవఫా హో గయే దేఖ్‌తే...దేఖ్‌తే"(మేం విడిపోమని చెబుతూ వచ్చిన వాళ్లు… చూస్తుండగానే నమ్మక ద్రోహం చేశారు) అని ఒక ప్రముఖ గీతం లైన్లు ట్వీట్ చేశారు.

 
అయితే, శరద్ పవార్ ప్రకటన తర్వాత శివసేన వెంటనే కాంగ్రెస్ నేతలతో కలిసి, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుంది. అందులో కొనుగోళ్లు-అమ్మకాలతు తెరలేచిందని అంటుంది. ఎన్సీపీ ఎమ్మెల్యేల క్యాంప్ మార్చడం గురించి రకరకాల సంఖ్యను చెబుతుంది. వీరి సంఖ్యను 10 నుంచి 54 వరకూ చెప్పారు. ఇప్పుడు శరద్ పవార్‌ను రాష్ట్రపతి చేస్తామనే విషయమేదీ బయటకు రాలేదు. ఆవును.. ఆయన ఆటలో ఓడిపోయారు. సొంత అన్న కొడుకే ఆయనను వదిలేశారు. వేటగాడు కూడా వేటకు గురవుతాడని చెబుతారే.. అలాగే.

 
అంత అవసరం ఏమొచ్చింది
అమిత్ షా రాజకీయ వ్యూహం ముందు శరద్ పవార్, ఆయనతోపాటూ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కూడా ఓడిపోయారు. పటేల్‌ సహచరుడు అభిషేక్ మను సింఘ్వీ తన ట్వీట్‌లో "కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన ఒప్పందానికి తుది రూపం ఇచ్చే ప్రయత్నాల్లో చాలా ఆలస్యం జరిగింది" అన్నారు. మహారాష్ట్రలో రెండు వారాల క్రితం, నవంబర్ 12న రాష్ట్రపతి పాలన అమలైంది. మూడు పార్టీలు బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అప్పటికి ఒక ఏకాభిప్రాయానికి వచ్చాయి.

 
మూడు పార్టీల పొత్తుకు తుది రూపం ఇవ్వడానికి, కూటమి పేరు, కామన్ మినిమం ప్రోగ్రాం లాంటి వాటి కోసం.. నవంబర్ 12 నుంచి 23 మధ్య చాలా సమావేశాలు జరిగాయి. అదంతా చూస్తుంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచన వదులుకుంది అని వారు నమ్మకంగా ఉన్నట్టు అనిపించింది. కానీ బీజేపీ మాత్రం దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రి అవుతాడని మళ్లీ మళ్లీ చెబుతూ వచ్చింది.

 
మూడు పార్టీలు కలిసి వండాలనుకున్న వంట పూర్తికాకపోవడంతో.. అది గమనించిన బీజేపీ అజిత్ పవార్‌కు గాలం వేసింది ఆయన ఇంతకు ముందు కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసుంటే, అక్కడ కూడా ఆయనకు మళ్లీ డిప్యూటీ సీఎం పదవి దక్కుండేది. అలాంటప్పుడు తన చిన్నాన్నకే వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సిన అవసరం అజిత్ పవార్‌కు ఏమొచ్చింది.

 
బీజేపీ గాలం వేసింది
60 ఏళ్ల అజిత్ పవార్ దగ్గర బీజేపీ ప్రతిపాదనను ఒప్పుకోడానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది, అత్యంత ముఖ్యమైనది ఏంటంటే, దానివల్ల ఆయన జైలుకెళ్లకుండా బయటపడతారు. ఆయనపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అలాంటప్పుడు ఆయన బీజేపీతో కలిసి గంగలో మునగాల్సిన అవసరం ఉంది. "మీరు పస్తులుంటారా, స్వీట్ తింటారా ఏదో ఒకటి ఎంచుకోండి అంటే.. మీరు ఆకలిగా ఎందుకుండాలని అనుకుంటారు".

 
మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకుకు సంబంధించినదిగా చెబుతున్న ఒక కుంభకోణంలో 25 వేల కోట్ల రూపాయల మనీ ల్యాండరింగ్‌ జరిగింది. ఈడీ సరిగ్గా ఎన్నికలకు ముందు ఇదే ఏడాది ఆగస్టులో ఆ కుంభకోణంలో అజిత్ పవార్‌పై దర్యాప్తు ప్రారంభించింది. ఆయనపై ఉన్న మరో పాత ఆరోపణ నీటి పారుదల కుంభకోణానికి సంబంధించినది. అది అజిత్ పవార్ మొదటిసారి ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు జరిగింది.

 
జైలుకు వెళ్లకుండా తప్పించుకోవడమే కాదు. అజిత్ పవార్ బీజేపీ ప్రతిపాదనను స్వీకరించడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఎన్సీపీని ముక్కలు చేయడంలో విజయవంతం కాగలిగితే, ఆయన శరద్ పవార్ వారసుడు అవుతారు. మహారాష్ట్రలో సుప్రియా సూలేకు వ్యతిరేకంగా ముఖ్య మరాఠా నేత అయ్యేందుకు ప్రయత్నిస్తారు.

 
ఆట అప్పుడే అయిపోలేదు
అజిత్ పవార్‌కు ఇప్పుడు ఒక అవినీతి బాహుబలి లాంటి ఇమేజ్ ఉంది. మహారాష్ట్రలో ఆయన ఉత్తరప్రదేశ్‌లో శివపాల్ యాదవ్‌లా అయ్యారు. ఆయన ఇప్పుడు తన ఇమేజ్ మార్చుకోడానికి ప్రయత్నించవచ్చు. అయితే, ఇది ఇక్కడితో ముగిసిపోదు. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన అసెంబ్లీ బలపరీక్షలో బీజేపీని ఓడించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తాయి. అంతే కాదు, అవి సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టాయి.

 
అయితే ఫడణవీస్ ఇప్పుడప్పుడే రాజీనామా చేసేలా అనిపించడం లేదు. కానీ, మహారాష్ట్రలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే.. ఇక్కడ ఏదైనా జరగచ్చని అనిపిస్తోంది. పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి బయటపడ్డానికి ఎన్సీపీ నుంచి మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరాల్సి ఉంటుంది.

 
ఎన్సీపీకి 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే కనీసం 35 మంది ఎమ్మెల్యేలు అవసరం. శరద్ పవార్ మాత్రం బీజేపీ దగ్గర 10-12 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని చెబుతున్నారు.

 
ఆట అప్పుడే అయిపోలేదు.