శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 31 మార్చి 2021 (12:42 IST)

మేఘాలయ: ఈ తెగలో పెళ్లి తర్వాత మగవాళ్లే అత్తారింటికి వెళ్తారు, పెత్తనమంతా ఆడవాళ్లదే!

భారత్‌లో ఎక్కువగా మగవాళ్ల ఆధిపత్యం కనిపిస్తూ ఉంటుంది. ఇంటి విషయాలైనా, బయటి విషయాలైనా వాళ్ల పెత్తనమే నడుస్తూ ఉంటుంది. కానీ మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. లెవ్డూలో మార్కెట్‌ను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ వ్యాపారాలన్నీ మహిళలే నడిపిస్తుంటారు.

 
చాలామంది మగవాళ్లు మహిళల కింద పనిచేస్తూ కనిపిస్తుంటారు. మహిళల చెప్పిన పనులు చేస్తుంటారు. ఇదివరకు కూడా నేను చాలాసార్లు మేఘాలయ వెళ్లాను. ఈ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆడవాళ్లు ఆధిపత్యం చెలాయించడం నేను చూశాను. ఈ పరిస్థితికి కారణం ఖాసీ అనే ఒక తెగ. మేఘాలయలో మెజార్టీ వర్గం ఇదే. ఈ తెగ ప్రజలు మాతృస్వామ్య విధానం పాటిస్తారు. ఇక్కడ పెళ్లి తర్వాత పురుషులు భార్య ఇంటి పేరు పెట్టుకుంటారు.

 
పిల్లలకు కూడా తల్లి ఇంటి పేరే వస్తుంది. ఆస్తులు కూడా తల్లి నుంచి కూతుర్లకే వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా మాతృస్వామ్య విధానం పాటిస్తూ, ఇంకా ఉనికిలో ఉన్న అత్యంత అరుదైన తెగల్లో ఖాసీలు ఒకరు.

 
అసలు ఎవరు వీళ్లు?
ఖాసీ తెగ మూలాల గురించి చాలా కథలు ఉన్నాయి. బర్మా అడవుల్లోని మోన్-ఖ్మెర్ జాతి నుంచి వచ్చిన పురాతన ఆస్ట్రిక్ జాతిలో ఖాసీల మూలాలు ఉన్నాయని ‘ద హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ద ఖాసీ పీపుల్’ అనే పుస్తకంలో చరిత్రకారుడు హామ్లెట్ బరెహ్ రాశారు. అయితే, ఖాసీలు హిమాలయ పర్వతాలకు పశ్చిమం వైపు నుంచి మేఘాలయకు ఎందుకు వలస వచ్చారన్నదానిపై స్పష్టత లేదు.

 
కానీ, ఖాసీల భాష, మోన్-ఖ్మెర్‌ల భాషల మధ్య సారూప్యతలు కనిపిస్తాయి. మేఘాలయ రాష్ట్రం 1972లో ఏర్పడింది. ఖాసీల్లో చాలావరకూ ఈ రాష్ట్రంలోనే ఉంటారు. పొరుగు రాష్ట్రం అసోంలోనూ వీరి సంఖ్య గణనీయంగానే ఉంది. బంగ్లాదేశ్‌లోనూ ఈ తెగ ప్రజలు ఉన్నారు. ‘‘ఖాసీల చరిత్ర చాలా వరకు లిఖితపూర్వకంగా లేదు. మౌఖికంగా ఒక తరం నుంచి మరొక తరానికి వచ్చిందే. ఆ చరిత్ర ప్రకారం చూస్తే ఖాసీల్లోనూ పితృస్వామ్య మూలాలు కనిపిస్తాయి’’ అని షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీకి చెందిన ఖాసీ చరిత్రకారిణి అమేనా నోరా పాస్సా అన్నారు.

 
‘‘అప్పట్లో భూమి కోసం ఈ తెగ వాళ్లు మిగతా తెగల వాళ్లతో యుద్ధాలు చేయాల్సి వచ్చేది. ఇలాంటి యుద్ధాల కోసం మగవాళ్లు మైదాన ప్రాంతాలకు వెళ్లేవాళ్లు. ఈ యుద్ధాల్లో కొందరు చనిపోయేవారు. కొందరు ఆ మైదాన ప్రాంతాల్లోనే స్థిరపడిపోయేవారు. ఇక్కడే ఉన్న ఖాసీ మహిళలు మళ్లీ తోడు కోసం పెళ్లి చేసుకునేవారు. లేకపోతే వేరే వాళ్లతో సహజీవనం చేసేవారు. పిల్లలకు తండ్రి ఎవరో గుర్తించడం కొన్ని సందర్భాల్లో కష్టమయ్యేది కూడా. దీంతో మహిళలకు, పిల్లలకు అవమానం తప్పించేందుకు అప్పట్లో పూర్వీకులు ఒక నిర్ణయానికి వచ్చారు. పిల్లలకు తల్లి ఇంటి పేరు ఇవ్వడం మొదలుపెట్టారు’’ అని ఆమె వివరించారు.

 
పెళ్లి తర్వాత మగవాళ్లే అత్తారింటికి వెళ్లాలి
ఖాసీలు ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలుగా జీవిస్తారు. కూతుర్ల ద్వారానే వారి వంశం పేరు కొనసాగుతూ ఉంటుంది. పెళ్లి తర్వాత మగవాళ్లే అత్తింటికి మారాల్సి ఉంటుంది. పెళ్లి తర్వాత కూతుర్లు కావాలనుకుంటే వారసత్వంగా వస్తున్న తమ ఇంట్లో ఉండొచ్చు. లేదంటే వేరు కాపురం పెట్టుకోవచ్చు. ఆ స్వేచ్ఛ వారికి ఉంటుంది.

 
కానీ, ఆ ఇంటి బాధ్యత, ఇంటిపై హక్కు అందరి కన్నా చిన్న కూతురికే ఉంటుంది. పెళ్లి చేసుకున్నా, ఆమె మాత్రం ఇంటిని విడిచివెళ్లకూడదు. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఆమెదే. తల్లి మరణం తర్వాత ఆ ఇంటి పెద్ద స్థానం కూడా ఆమెకే వస్తుంది. షిల్లాంగ్‌కు 65 కిలోమీటర్ల దూరంలోని టైర్నా గ్రామంలో ఉండే లారెట్టా సోంఖ్లెట్... తమ కుటుంబంలో అందరి కన్నా చిన్న కూతురు.

 
లారెట్టాకు పెళ్లైంది. ఆమె తన భర్తతోపాటు తన తల్లి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే, లారెట్టా సోదరుడు ఎడిల్బర్ట్ వారి కుటుంబానికి గార్డియన్‌ పాత్ర పోషించాల్సి ఉంటుంది. సోంఖ్లెట్ పిల్లల మేనమామగా ఆయన వారి బాగోగులు చూడాలి. ఆ కుటుంబానికి ఆయన డబ్బు కూడా ఇస్తారు. టైర్నాలో ఒక పాఠశాలకు ఎడిల్బర్ట్ హెడ్మాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య, పిల్లలు మాత్రం షిల్లాంగ్‌లో ఉంటారు.

 
భర్త తన ఆదాయం భార్య, పిల్లలకు ఇవ్వడు
సాధారణంగా ఖాసీ తెగలో భర్త భార్య ఇంటికి వెళ్లాలి. కానీ, భార్యలు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కొందరు భర్తలు ఇలా తమ సొంత ప్రాంతాల్లో ఉంటుంటారు. ‘‘నా భార్య, పిల్లలు షిల్లాంగ్‌లో ఉంటారు. నేను అప్పుడప్పుడూ అక్కడికి వెళ్తుంటా. ఇక్కడ మా సోదరి, తల్లి బాగోగులు నేను చూడాల్సి ఉంటుంది’’ అని ఎడిల్బర్ట్ అన్నారు.

 
సోంఖ్లెట్ ఉంటున్న ఇల్లులో కొంత భాగాన్ని పర్యాటకులకు అద్దెకు ఇచ్చేలా ఏర్పాటు చేసి, వారికి కొంత ఆదాయం సమకూరే ఏర్పాటు చేశారు ఎడిల్బర్ట్. ‘‘ఖాసీ తెగలో పిల్లల మేనమామకు చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఆస్తి పంపకం, నిర్వహణను చూసేది అతడే. అతడి ఆమోదం లేకుండా కుటుంబంలో ఏ నిర్ణయమూ జరగదు’’ అని అమేనా నోరా పాస్సా వివరించారు.

 
‘‘ఖాసీ తెగలో భార్యకు, పిల్లలకు భర్త ఆర్థికంగా తోడ్పాటు అందించడు. అక్కాచెల్లెళ్లు, తల్లిదండ్రులకు వాళ్లు డబ్బు సంపాదించి ఇస్తారు. భర్త రాత్రి ఇంటికి వస్తాడు. తెల్లవారి లేచిన తర్వాత తల్లి ఇంటికి వెళ్లి, వాళ్ల పొలాల్లో పనిచేస్తాడు’’ అని ఆమె వివరించారు. అయితే బ్రిటీష్ వలస పాలన, మిషనరీ విద్య, ప్రస్తుత పరిస్థితుల ఫలితంగా పరిస్థితులు మారుతున్నాయని అమేనా నోరా పాస్సా అంటున్నారు.

 
పరిస్థితులు మారుతున్నాయ్
‘‘ఖాసీ తెగలో కొందరు గ్రామాలు విడిచి, పట్టణాలకు వెళ్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్నాయి. చిన్న కుటుంబాలు పెరుగుతున్నాయి. మేనమామల పాత్ర తగ్గిపోతోంది. కొన్ని గ్రామాల్లో మాతృస్వామ్యం ఇంకా ఉన్నా... క్రైస్తవం తీసుకున్న కుటుంబాల్లో మగవాళ్లు ఇంటిపెద్దలుగా మారుతున్నారు’’ అని పాస్సా వివరించారు.

 
మేఘాలయ కొన్ని పితృస్వామ్య పోకడలు ఉన్నప్పటికీ ఇది మాతృస్వామ్య సమాజమని ఆమె అభిప్రాయపడ్డారు. కానీ మహిళలు సమాజాన్ని, ప్రభుత్వాలను నడిపించే పరిస్థితైతే రాలేదని అన్నారు. అయితే, దేశంలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే మహిళలకు మేఘాలయ కాస్త మెరుగైన ప్రాంతంలా నాకు అనిపించింది. ఇక్కడి వీధుల్లో తిరుగుతున్నప్పుడు మగవారి నుంచి నేను ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. చాలా మంది నాతో గౌరవంగా నడుచుకున్నారు. అవసరమైన చోట సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

 
మిగతా ప్రాంతాల కన్నా మేఘాలయ నాకు చాలా సౌకర్యవంతంగా అనిపించింది. ‘‘నాకు ముంబయి కన్నా మేఘాలయ సురక్షితంగా అనిపిస్తుంది. లింగ వివక్ష ఉండదని నేను అనను. మేఘాలయలో మగవాళ్లు మహిళల మాటలను పట్టించుకోకపోవచ్చు. కానీ, అసలు మాట్లాడకుండా వారి గొంతు మాత్రం నొక్కరు’’ అని అన్నారు ఖాసీ తెగకు చెందిన రచయిత్రి డరిబా లిండెమ్.

 
ఖాసీ తెగలో అమ్మాయిలకు స్వేచ్ఛ ఎక్కువ
‘‘దేశంలోని మిగతా ప్రాంతాల వారితో పోల్చితే, ఖాసీ తెగలో అమ్మాయిలకు స్వేచ్ఛ ఎక్కువ. చదువు కోసం, ఉద్యోగం కోసం ఎక్కడికైనా వెళ్లాలంటే వారిపై ఇక్కడ పెద్దగా ఆంక్షలు ఉండవు’’ అని ద షిల్లాంగ్ టైమ్స్ దినపత్రిక ఎడిటర్ పాట్రిషీయా ముఖిమ్ అన్నారు. కానీ, వలసలు పెరుగుతున్న కొద్దీ ఖాసీ తెగ ఆచారాలు, పద్ధతులు ప్రమాదంలో పడుతున్నాయి.

 
రాష్ట్రంలోని కొందరు పురుషులు మాతృస్వామ్య వ్యవస్థను రద్దు చేయాలంటూ ఉద్యమం కూడా చేస్తున్నారు. సింగ్కోంగ్ ర్యాంపీ తిమ్మాయ్ అనే పురుష హక్కుల సంస్థ ఈ డిమాండ్ చేస్తోంది. ‘‘మేమేమీ ఆడవాళ్ల స్థానాన్ని కిందకు లాగాలని ప్రయత్నించడం లేదు. మమ్మల్ని వారితో సమానంగా పైకి తీసుకువెళ్లండి అని కోరుతున్నాం’’ అని ఆ సంస్థకు చెందిన వ్యక్తి ఒకరు అన్నారు.

 
‘‘ఖాసీ సమాజం మారుతోంది. కొన్ని కుటుంబాలు అబ్బాయిలు, అమ్మాయిలకు ఆస్తిలో సమానమైన వాటా ఇస్తున్నాయి. తల్లిదండ్రుల బాధ్యత చిన్న కూతురిదే కాబట్టి, ఆమెకు కాస్త ఎక్కువ ఇస్తూ ఉండొచ్చు’’ అని అన్నారు అమేనా నోరా పాస్సా. 

 
ఖాసీ తెగలో కొన్ని కుటుంబాల్లో ఇప్పుడు పితృస్వామ్యం కూడా కనిపిస్తోంది. ఖాసీ ఆచారాలు, మాతృస్వామ్య విలువలు తమ నరనరాన జీర్ణించుకుపోయాయని... భవిష్యతులో కూడా వాటిని కాపాడుకుంటామని విశ్వసిస్తున్నవారు కూడా ఆ తెగలో ఇంకా ఉన్నారు.