శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: బుధవారం, 24 ఏప్రియల్ 2019 (20:39 IST)

ఆస్ట్రేలియా, బ్రిటన్‌లలో చదువుకున్న శ్రీలంక సూసైడ్ బాంబర్

శ్రీలంకలో గత ఆదివారం జరిగిన బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 359కి పెరిగింది. మృతదేహాలకు బాధిత కుటుంబాలు అంత్యక్రియలు కూడా పూర్తి చేశాయి. కాగా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డవారిలో ఒకరు ఆస్ట్రేలియా, బ్రిటన్‌లలో చదువుకున్నాడని లంక రక్షణ శాఖ సహాయ మంత్రి తెలిపారు. పేలుళ్ల వెనుక ఐఎస్ హస్తం ఉండొచ్చని ప్రధాని రణిల్ విక్రమసింఘె అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు ఐఎస్ కూడా ఈ దాడులకు పాల్పడింది తామేనని ప్రకటించుకున్నప్పటికీ ఇంతవరకు ఆధారాలు లేవు.
 
నేను అతడితో మాట్లాడాను
ఈ విషాద సమయంలో స్టాన్లీ అనే ఒక చర్చి ఫాదర్ పేలుళ్లు జరిగే ముందు దాడి చేశారని భావిస్తున్న ఆత్మాహుతి దళ సభ్యుడితో తన సంభాషణను బీబీసీతో పంచుకున్నారు. ఆత్మాహుతి దాడి చేసినట్టు భావిస్తున్న వ్యక్తి శ్రీలంకలోని మట్టకాలప్పు ప్రాంతంలో ఉన్న సియోన్ చర్చి దగ్గర ఫాదర్ స్టాన్లీకి ఎదురుపడ్డారు. ఆ చర్చిలో జరిగిన బాంబు దాడిలో 26 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలే.
 
"మా పాస్టర్ విదేశాల్లో ఉన్నారు. అసిస్టెంట్ పాస్టర్ కూడా అందుబాటులో లేరు. ఆయన నాకు చాలా మంది కొత్తవారిని పరిచయం చేశారు. బహుశా దాడి చేసిన వ్యక్తి వాళ్లలో ఒకరేమో అనుకున్నాను" అని ఫాదర్ స్టాన్లీ చెప్పారు. "నేను అతడితో మాట్లాడాను. చర్చిలోపలికి రమ్మని పిలిచాను. కానీ అక్కడే ఉండిపోయిన అతడు ఎవరి ఫోన్ కోసమో ఎదురుచూస్తున్నానని చెప్పాడు. లోపలికి రానన్నాడు. అంటే కాల్ రాగానే తను ఫోన్ తీయాల్సుంటుందని చెప్పాడు".
 
సర్వీస్ మొదలయ్యే ముందు టైమ్ అడిగాడు
అప్పుడేం జరిగిందో చెప్పిన ఫాదర్ స్టాన్లీ "మా ఆఫీస్ చర్చికి ఎదురుగా ఉంటుంది. తను అక్కడే నిలబడ్డాడు. సర్వీస్ ఎప్పుడు మొదలవుతుందని నన్ను అడిగాడు. నేను చెప్పాను. మళ్లీ చర్చిలోకి రమ్మని పిలిచాను. అంటే మేం ఎవరొచ్చినా చర్చిలోకి స్వాగతం పలుకుతాం" అన్నారు. "అతడు భుజాలకు ఒక బ్యాగ్ తగిలించుకుని ఉన్నాడు. ముందు వైపు కెమెరా బ్యాగ్ లాంటిది ఉంది. నాకు ఆ టైంలో అతడి లక్ష్యం గురించి తెలీలేదు. అతడే బాంబు పేల్చాడని చాలా మంది పిల్లలు చెబుతున్నారు" అన్నారు స్టాన్లీ.
 
"సర్వీస్ మొదలవగానే నేను చర్చిలోకి వెళ్లిపోయా. తర్వాత రెండు మూడు నిమిషాలకు అతడు బయట బాంబు పేల్చాడు. బాంబు చర్చిలోపల పేలలేదు. చాలా మంది పిల్లలు సండే క్లాసుల తర్వాత బయట నీళ్లు తాగుతారు. తర్వాత చర్చిలోపలికి వస్తారు. ఆ పిల్లలు, ఇంకా చాలా మంది చర్చిలోపలికి చొచ్చుకొస్తున్నప్పుడే ఆ పేలుడు జరిగింది" అని స్టాన్లీ చెప్పారు.
 
పేలుడు తర్వాత ఏం జరిగింది?
చర్చి బయట పేలుడు జరిగిన తర్వాత అక్కడ అలజడి రేగింది. పేలుడు తర్వాత కార్లు, జనరేటర్లకు మంటలు అంటుకున్నాయి. మంటల వల్ల మేం గాయపడిన చాలా మందిని కాపాడలేకపోయాం. కొంతమంది పిల్లలను మాత్రమే పేలుడు దూరంగా తీసుకెళ్లగలిగాం.
 
తర్వాత మరో పేలుడు జరిగింది
మొదటి పేలుడు తర్వాత చర్చిలో మరో పేలుడు జరిగింది. "మేం అందరినీ కాపాడ్డానికి ప్రయత్నిస్తున్నాం. ఆ తర్వాత మాకు పేలుడు శబ్దం వినిపించింది. అంతా మంటలు అంటుకున్నాయి. ఎవరు బతికారు, ఎవరు చనిపోయారో కూడా చూడకుండా మేం అటూఇటూ పరిగెత్తాం. ఆ గందరగోళంలో నా భార్య, కొడుకు కూడా తప్పిపోయారు. తర్వాత నాకు వాళ్లు ఒక ఆస్పత్రిలో ఉన్నట్టు తెలిసింది. ఈ దాడిలో చాలా మంది అమాయకులు, పిల్లలు చనిపోయారు. మాకంతే తెలుసు’’ అని ఫాదర్ స్టాన్లీ తెలిపారు.
 
పేలుళ్లకు పాల్పడింది ఎవరు? ఇప్పుడేం జరుగుతోంది?
ఇస్లామిక్ స్టేట్‌కు సంబంధించినదిగా చెబుతున్న 'అమాక్' అనే మీడియా పోర్టల్ ఈ దాడులకు బాధ్యులు తామేనని చెప్పుకుంది. కానీ దానిని ధ్రువీకరించలేం. ఎందుకంటే ఇస్లామిక్ స్టేట్ సాధారణంగా దాడుల తర్వాత ఆ దాడి చేసినవారి ఫొటోలు పోస్ట్ చేసి, దాడులు తామే చేశామని వెంటనే ప్రకటిస్తుంది. శ్రీలంకలో దాడులు జరిగిన మూడు రోజుల తర్వాత వచ్చిన ఈ ప్రకటన నిజం అనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు.
 
శ్రీలంక ప్రభుత్వం 'నేషనల్ తౌహీద్ జమాత్' అనే ఒక స్థానిక జీహాదీ గ్రూప్ ఈ దాడులకు కారణమని చెబుతోంది. ఈ బాంబు పేలుళ్లు ఒక అంతర్జాతీయ నెట్‌వర్క్ సాయంతో చేశారని అధికారులు చెప్పారు. బాంబు పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకూ 38 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 26 మందిని సీఐడీ, ముగ్గురిని యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్, 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన వారిలో 9 మందిని మాత్రమే కోర్టులో ప్రవేశపెట్టారు. వీరందరూ వెల్లంపట్టిలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు.