శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 20 జులై 2020 (12:42 IST)

తెలుగు సినీ పరిశ్రమ: కృష్ణానగర్ జూనియర్ ఆర్టిస్టుల కలలు.. కన్నీళ్లు

కరోనావైరస్ లాక్‌డౌన్ సినిమా రంగంలోని చిన్న ఆర్టిస్టులను, టెక్నీషియన్లను సంక్షోభంలో పడేసింది. హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో వీరు ఎక్కువగా నివసిస్తుంటారు. వారితో బీబీసీ మాట్లాడింది. ఎవరిని కదిలించినా గొంతులో విషాదమే ధ్వనించింది.
 
కరోనావైరస్ ప్రభావంతో సినిమాల షూటింగ్స్ నిలిచిపోవడంతో వారు ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో చిక్కుకున్నారు. సినిమా పెద్దల నుంచి లభిస్తున్న ఆర్థిక సహాయం కొంత ఊరట కలిగిస్తున్నప్పటికీ, ఈ సహాయం ఎన్ని రోజులు ఉంటుందన్న ప్రశ్న వారిని ఆందోళనకు గురి చేస్తోంది.
 
"మెట్రో డైలీ కూలీకి వెళ్లే వాళ్ళలాగే ఉంటుంది మా జీవితాలు కూడా అంతే. రోజూ పనికి వెళితేనే సాయంత్రం డబ్బు చేతికి వస్తుంది. కరోనా లాక్‌డౌన్ విధించిన తరువాత మొదటి రెండు నెలలు బాగానే గడిచాయి. కానీ, ఇప్పుడు పని లేదు. బతకడమే కష్టంగా మారింది. నాలాంటి ఆర్టిస్టులు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది" అని మహిళా ఆర్టిస్ట్ వాసవి అన్నారు.
 
షూటింగులు జరుపుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ పెద్ద తారల చిత్రాలే సెట్స్‌లోకి వెళ్లలేని పరిస్థితి కొనసాగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.