శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 2 డిశెంబరు 2019 (11:57 IST)

మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎందుకు పరుగులు పెట్టించలేకపోతోంది?

భారత ప్రభుత్వం ఈ వారం జీడీపీకి సంబంధించిన కొత్త గణాంకాలను విడుదల చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నట్లు ఈ గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. ప్రస్తుత త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతానికి చేరింది. గత ఆరేళ్లలో ఇదే అత్యంత కనిష్ఠం. గత త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు 5 శాతంగా నమోదైంది.

 
ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది. కానీ, తాజా గణాంకాలను గమనిస్తుంటే, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పనిచేస్తున్నాయా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇదే అంశంపై ఆర్థిక వ్యవహారాల నిపుణుడు శిశిర్ సిన్హాతో బీబీసీ ప్రతినిధి నవీన్ నేగి మాట్లాడారు. ప్రభుత్వ చర్యలు ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలిగిస్తున్నాయా అని ఆయన్ను అడిగి తెలుసుకున్నారు.

 
శిశిర్ అభిప్రాయం ఇదే..
ఇటీవలి కాలంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం 30 దాకా నిర్ణయాలు ప్రకటించింది. వాటిలో బాగా చర్చ జరిగింది కార్పొరేట్ పన్ను తగ్గింపు గురించి. సెప్టెంబర్ 20న ఈ నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ పన్ను తగ్గింపులో రెండు స్థాయులున్నాయి. అన్ని సంస్థలకూ 22 శాతం పన్ను రేటు వర్తింపజేయడం, కొత్త తయారీ రంగ సంస్థలకు 15 శాతం పన్ను రేటు విధించడం గురించి చర్చ జరిగింది.

 
ఈ తగ్గింపు వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలిగిందా?
ప్రస్తుతమున్న పరిస్థితిని చూస్తే, కార్పొరేట్ పన్ను తగ్గింపు వల్ల భారత్‌లోకి ఇప్పటివరకూ కొత్తగా పెట్టుబడులేవీ రాలేదని అర్థమవుతోంది. దీని వెనుక ఓ పెద్ద కారణం ఉంది. ఇలాంటి నిర్ణయం ఫలితాలు కనిపించేందుకు రెండు, మూడు నెలల వరకూ సమయం పడుతుంది. కొన్నిసార్లు ఆరు నెలలూ పట్టొచ్చు.

 
స్టాక్ మార్కెట్‌ను చూస్తే, బడ్జెట్‌లో సూపర్ రిచ్ సర్‌ఛార్జ్ పెంచుతూ తీసుకున్న నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపింది. తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కితీసుకున్నప్పటికీ, స్టాక్ మార్కెట్‌కు అప్పటికే హాని జరిగింది. ఆ పరిణామం నుంచి త్వరగా కోలుకోలేకపోయింది.

 
ఆ తర్వాత స్టాక్ మార్కెట్‌లో కనిపిస్తున్న పరిస్థితులకు దేశీయ పరిస్థితుల కన్నా అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులే ప్రధాన కారణం. అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధ ప్రభావం మొత్తం ప్రపంచంపై ఉంది. భారత ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపుతున్న అతిపెద్ద అంశాల్లో ఇది కూడా ఒకటి.

 
యూరప్, అమెరికా, ఆఫ్రికా, ఆసియా.. ఇలా ఎక్కడ చూసుకున్నా, దేశాలన్నీ ఆర్థిక మందగమనంలో ఉండటం మరో కారణం. కొన్ని దేశాల్లో మాంద్యం పరిస్థితి కూడా ఉంది. దేశ ఆదాయం పెరగాలంటే ఉత్పత్తైన వస్తువులు అమ్ముడుపోవాలి. మన దేశంలో తయారైన వస్తువులు విదేశాల్లో అమ్ముడుపోయినా ఆదాయం వస్తుంది. భారత్‌ రెండు వైపులా ఇబ్బంది ఎదుర్కొంటోంది. దేశీయ మార్కెట్‌లో అమ్మకాలు పడిపోయాయి. విదేశీ మార్కెట్‌లో పరిస్థితులు బాగోలేక మన ఉత్పత్తులు కొనేవారు దొరకట్లేదు.

 
విధానపరమైన పొరపాట్లు జరిగాయా?
ఇప్పటివరకూ పెట్టుబడులు పెంచేందుకు భారత్ చర్యలు తీసుకుంది. అలాగే, వినియోగం పెంచడానికి కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థికవ్యవస్థ అనే సైకిల్‌కు పెట్టుబడులు, వినియోగం రెండు చక్రాల్లాంటివి. పెట్టుబడులు పెంచే చర్యలు తీసుకుని, వినియోగం పెంచే చర్యలు తీసుకోకపోతే, దాని ప్రభావం ఉంటుంది.

 
అది బడ్జెట్ కావొచ్చు. ఆ తర్వాత కావొచ్చు. కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం పెట్టుబడులు పెంచేందుకు తీసుకున్న నిర్ణయం. వినియోగం పెంచేందుకు ప్రభుత్వం ఆదాయ పన్నును తగ్గించాల్సిన అవసరం ఉంది. ఆదాయ పన్ను తగ్గిస్తే, ప్రజల చేతుల్లోకి ఎక్కువ డబ్బు వస్తుంది. వాళ్ల ఉద్యోగాలు ఎక్కడికీ పోవని, ఆందోళన అవసరం లేదని భరోసా కల్పిస్తే, ప్రజలు ఖర్చు చేయడం మొదలుపెడతారు. వినియోగం పెరుగుతుంది.

 
వినియోగం పెరిగితే పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెరుగుతాయి. ఉత్పత్తిని పెంచేందుకు ఆ రంగానికి మరింత ఉత్సాహం వస్తుంది. మొత్తం ఆర్థిక వ్యవస్థలో ప్రధాన లోపం ఇదే. వినియోగం పెంచేలా ప్రజల చేతుల్లోకి మరింత డబ్బు వెళ్లేందుకు ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదు. ప్రభుత్వం ఆ పనిచేస్తే, ఆర్థిక వ్యవస్థ పరిస్థితి చాలా మెరుగవుతుంది.