సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 17 జులై 2024 (16:20 IST)

జగన్‌‌పై రఘురామ కృష్ణ రాజు హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టారు? మూడేళ్ల కిందట ఏం జరిగింది?

raghurama krishnamraju
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు కొందరు అధికారుల మీద ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మూడేళ్ల కిందట నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణ రాజును 2021 మే 14న ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. మతాలు, కులాల పేర్లతో వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు చేశారని అప్పట్లో పోలీసులు ఆరోపించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సాఆర్‌సీపీ నుంచి నర్సాపురం ఎంపీగా రఘురామ కృష్ణ రాజు గెలిచారు. ఆ తరువాత కొంతకాలానికి విబేధాలు రావడంతో ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అంతేకాకుండా వైఎస్ జగన్‌, ఆయన ప్రభుత్వం, వైఎస్సాఆర్‌సీపీ పార్టీపై రఘురామ కృష్ణ రాజు విమర్శలు చేస్తుండేవారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు జరిగింది.
 
‘నన్ను కొట్టారు’
హైదరాబాద్‌లో ఉన్న రఘురామ కృష్ణ రాజును 2021లో ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత ఆయనను గుంటూరుకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తూ రాజద్రోహానికి పాల్పడ్డారని, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా కులాల మధ్య వైషమ్యాలు ప్రేరేపించే ప్రయత్నం చేశారంటూ కేసులు పెట్టారు. 2021 మే 14 రాత్రి 11.30 గంటల సమయంలో గుంటూరు సీబీసీఐడీ ఆఫీసులో తనను కొట్టి చిత్రహింసలు పెట్టారని రఘురామ కృష్ణ రాజు ఆరోపించారు. తనను ‘కొట్టారంటూ’ ఒక ఎంపీ ఆరోపించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆయన కాలి మీద కమిలిన గాయాలతో ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.
 
‘‘రబ్బరు బెల్టు, లాఠీలతో కొట్టడంతోపాటు గుండె ఆపరేషన్ అయిన నా ఛాతీపై కూర్చుని చంపేందుకు యత్నించారు’’ అని రఘురామ కృష్ణ రాజు ఆరోపించారు. ఆ తరువాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఉండి నియోజకర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రఘురామ కృష్ణ రాజు గెలిచారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తరువాత ఇటీవల ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2021లో తనను అరెస్టు చేసినప్పుడు, ‘‘హింసించి, హత్యాయత్నం చేశారు’’ అంటూ రఘురామ కృష్ణ రాజు ఆరోపించారు. జులై 11న ఎఫ్ఐఆర్ (నెం.187/2024) నమోదు చేశారు.
 
నాటి సీబీసీఐడీ డీజీ పీవీ సునీల్ కుమార్(ఏ1), ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు(ఏ2), ముఖ్యమంత్రి వైఎస్ జగన్(ఏ3), సీబీసీఐడీ అడిషనల్ ఎస్పీ ఆర్ విజయ్ పాల్(ఏ4), గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చెందిన డాక్టర్ ప్రభావతి (ఏ5)లను నిందితులుగా చేర్చారు. ‘‘గుండె ఆపరేషన్ అయిన నాకు మందులు వేసుకునే అవకాశం లేకుండా చేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రోద్బలంతో పీవీ సునీల్ కుమార్, సీతారామాంజనేయులు సహా కొందరు నన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. నా గాయాల విషయంలో గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు డాక్టర్ ప్రభావతి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు’’ అని రఘురామ కృష్ణ రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
వైఎస్ జగన్‌తోపాటు ఇతర అధికారుల మీద ఐపీసీ 307 ప్రకారం కూడా కేసు నమోదు చేశారు. ఐపీసీ 307 సెక్షన్ అంటే హత్య చేయడానికి ప్రయత్నించడం. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే 10ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. బాధితులు గాయపడితే గరిష్ఠంగా జీవితకాల కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంది. కాగా రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు తరువాత పీవీ సునీల్ కుమార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సుప్రీంకోర్ట్ తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. సుప్రీంకోర్టులో మూడేళ్లు కేసు నడిచిన తరువాత కేసు తిరస్కరించారని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
 
రఘురామ కృష్ణ రాజు కేసులో ఎప్పుడెప్పుడు ఏం జరిగిందంటే?
మే 15: బెయిల్ కోసం ఆయన కుటుంబ సభ్యులు ఆంధప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు బెయిల్‌ను తిరస్కరించి, సెషన్స్ కోర్టుకి వెళ్లాలని ఆదేశించింది.
 
అదే సమయంలో పోలీసులు కొట్టారంటూ రఘురామ కృష్ణ రాజు తరఫున లాయర్లు రాసిన లేఖ మీద నివేదిక కోరుతూ ముగ్గురు వైద్యులతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసింది.
 
మే 17: రఘురామ కృష్ణ రాజు సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఆయనకు హైదరాబాద్‌లోని సైనిక ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అదే రోజు ఆయనను గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు.
 
మే 18: సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రి నివేదికను సుప్రీంకోర్టుకు పంపించారు.
 
మే 20: రఘురామ కృష్ణ రాజు తనయుడు సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. కస్టడీలో ఉన్న తన తండ్రిపై జరిగిన దాడి గురించి సీబీఐ దర్యాప్తు జరపాలని కోరారు.
 
మే 21: రఘురామ కృష్ణ రాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
 
ఈ కేసులో రఘురామ కృష్ణ రాజు కుమారుడు భరత్ వేసిన పిటిషన్‌ను 2022 డిసెంబర్ 14న ఉపసంహరించుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.
 
2023 జనవరి 24: రఘురామ కృష్ణ రాజు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన కేసులో సీబీఐ దర్యాప్తు గానీ సిట్‌తో విచారణ గానీ జరపాలని ఆయన కోరారు.
 
ఫిబ్రవరి 8: సీబీఐతో పాటు కేంద్ర హోం శాఖకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తనను గాయపరిచిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ రఘురామ కృష్ణ రాజు వేసిన పిటిషన్‌పై స్పందించాలని ఆదేశించింది.
 
మే 12: మంత్రి అంబటి రాంబాబు, గుంటూరుకు చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు పోలీస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, సునీల్ నాయక్, విజయ్ పాల్ వంటి వారి కాల్ డేటా (2021 మే 14 -16) భద్రపరచాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 
మే 23: రఘురామ కృష్ణ రాజు మెడికల్ రిపోర్టులను భద్రపరచాలంటూ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శితో పాటు, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.
 
2024 జులై 11: వైఎస్ జగన్‌తో సహా ఇతర అధికారుల మీద రఘురామ కృష్ణ రాజు ఫిర్యాదు, వారిపై కేసు నమోదు.
 
రాజకీయ వివాదం
వైఎస్ జగన్ మీద, మరికొందరు అధికారుల మీద కేసు నమోదు కావడం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఇది ‘కక్ష సాధింపు చర్య’ అంటూ వైఎస్సాఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. "రఘురామ కృష్ణ రాజును తొలుత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు, గుర్తు తెలియని వ్యక్తులు తనను కొట్టినట్లు వాంగ్మూలంలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం, మే 16న మెడికల్ బోర్డు వద్ద నిర్వహించిన పరీక్షల సమయంలోనూ తనను గుర్తు తెలియని వ్యక్తులు గాయపరిచారని చెప్పారు. ఇప్పుడు ఎలా ముఖ్యమంత్రి, ఇతర అధికారుల పేర్లు చెప్పారు?’’ అని వైఎస్సాఆర్‌సీపీ నేత, మాజీ అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు.
 
ఇలాంటి ‘తప్పుడు’ కేసులతో సాధించేదేమీ ఉండదని ఆయన బీబీసీతో అన్నారు. "కొట్టిన వాళ్లు గుర్తు తెలియని వ్యక్తులే అంటున్నా. కుట్ర చేసిన వాళ్ల మీదనే నా ఫిర్యాదు" అని రఘురామ కృష్ణ రాజు చెబుతున్నారు.