శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2019 (12:56 IST)

రియాన్స్‌ వరల్డ్: ఎనిమిదేళ్ళ వయసులో రూ.184 కోట్లు సంపాదన.. ఎలా?

ఆట వస్తువుల గురించి రివ్యూలు చెప్పే ఎనిమిదేళ్ల బాలుడు వరుసగా రెండోసారి యూట్యూబ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న వ్యక్తిగా నిలిచాడు.
 
ఈ బాలుడి పేరు రియాన్. 'రియాన్స్‌ వరల్డ్' పేరుతో యూట్యూబ్‌లో చానల్ నడుపుతున్నాడు.
 
ఫోర్బ్స్ వెల్లడించిన వార్షిక టాప్ 10 ర్యాంకుల ప్రకారం, 2019లో ఇతడు 26 మిలియన్ డాలర్లు (రూ.184.72 కోట్లు), 2018లో 22 మిలియన్ డాలర్లు (సుమారు రూ.156.28 కోట్లు) సంపాదించాడు.
 
ఈ రెండేళ్లలో యూట్యూబ్‌ ద్వారా అత్యధికంగా సంపాదించినది ఈ బాలుడే. 2018 జూన్ నుంచి 2019 జూన్ వరకు అంచనాల ఆధారంగా ఫోర్బ్స్ ఈ ర్యాంకులు ఇచ్చింది.
 
డ్యూడ్ పర్ఫెక్ట్, నస్త్య పేర్లతో ఉన్న యూట్యూబ్ చానెళ్లు రూ.142.10 కోట్లు, రూ. 127.88 కోట్ల ఆదాయంతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 2019లో అత్యధికంగా సంపాదించిన మొదటి 10 యూట్యూబర్స్‌కు కలిపి వచ్చిన ఆదాయం 162 మిలియన్ డాలర్లు (రూ.1,151.32 కోట్లు).
 
ప్రకటనలు, స్పాన్సర్డ్ వీడియోలు, మర్చండైస్ సేల్స్, టూర్స్ ద్వారా వారికి వచ్చి ఆదాయాన్ని (ఆదాయ పన్ను చెల్లించక ముందు) ఫోర్బ్స్ అంచనా వేసింది.
 
అమెరికాలోని టెక్సస్ నగరంలో రియాన్ కుటుంబం ఉంటోంది. 2.29 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న ఇతని చానెల్‌‌లో రోజూ ఒక కొత్త వీడియో అప్‌లోడ్ చేస్తుంటారు.
 
చాలా వీడియోలకు కోట్లలో వ్యూస్ ఉంటాయి. రెండు వీడియోలకు అయితే వంద కోట్లకు పైనే వ్యూస్ ఉన్నాయి.
 
ఐదు నిమిషాల 56 సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియోకు అత్యధికంగా 190 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆ బాలుడు పార్కులో పరుగులు పెడుతూ లోపల ఆటవస్తువులు ఉన్న ప్లాస్టిక్ బంతులను తెరిచి చూస్తున్నప్పుడు తీసిన వీడియో అది.
 
2017 నుంచి 2018 వరకు రియాన్ ఆదాయం రెట్టింపు అయ్యింది. అతని చానెల్ పేరు గతంలో 'రియాన్ టాయ్స్‌ రివ్యూ' అని ఉండేది. 2018 ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన తర్వాత చానెల్ పేరును 'రియాన్స్ వరల్డ్'గా మార్చారు.
 
అయితే, యూట్యూబ్‌ ద్వారా రియాన్ మాదిరిగా అందరూ అంత భారీగా సంపాదించలేరని 'యూట్యూబర్స్' అనే పుస్తకం రచయిత క్రిస్ స్టోకెల్- వాకర్ అన్నారు.
 
"యూట్యూబ్‌లో చానెళ్లు ప్రారంభిస్తున్న వారిలో, ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కెరీర్ మొదలు పెట్టేవారిలో అనేక మంది డబ్బు సంపాదించలేకపోతున్నారు. 96.5 శాతం మంది యూట్యూబర్లకు ప్రకటనల ద్వారా కనీసం పేదరికం (అమెరికాలో) నుంచి బయటపడేంత ఆదాయం కూడా రావడంలేదు. యూట్యూబ్‌ వీడియోలు చేసేవారి సంఖ్య పెరిగే కొద్దీ పోటీ మాత్రమే మరింత ఎక్కువ అవుతోంది" అని క్రిస్ స్టోకెల్- వాకర్ బీబీసీతో చెప్పారు.
 
యూట్యూబ్‌లో మిగతా వీడియోలతో పోలిస్తే, చిన్నారులతో చేయించే వీడియోలకు సగటున మూడు రెట్ల అధిక వ్యూస్ వస్తున్నాయని అమెరికాలోని మేధోమధన సంస్థ 'ది ప్యూ రీసెర్చ్ సెంటర్' నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
 
యూదుల పట్ల వ్యతిరేకంగా, జాత్యాహంకారంతో కూడిన వీడియోలు చేస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న స్వీడన్ యూట్యూబర్ ప్యూడీపై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి వచ్చారు. యూట్యూబ్‌ వీడియోలు చేసి బాగా అలసిపోయానని, త్వరలో కాస్త విరామం తీసుకుంటానని ప్యూడీపై ఇటీవల ప్రకటించాడు.