ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో సీబీఐ నమోదు చేసిన కేసుల్లో విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు వీటిని విచారిస్తోంది. ప్రస్తుత, మాజీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులపై ఉన్న పెండింగ్ కేసుల వివరాలను అందించాలని, ఈ కేసులను రోజువారీ ప్రాతిపదికన విచారించి రెండు నెలల్లో పరిష్కరించాలని సుప్రీం కోర్టు దేశంలోని అన్ని హైకోర్టులను ఇటీవల ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా కేసుల త్వరితగతిన విచారణ చేయాలని హైదరాబాద్‌లోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణకు ప్రత్యేక న్యాయమూర్తిని, హైదరాబాద్‌లోని ప్రిన్సిపల్ సీబీఐ జడ్జి, ప్రిన్సిపల్ ఏసీబీ జడ్జిలను తెలంగాణ హైకోర్టు అక్టోబర్ మొదటి వారంలో ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై అవినీతి నిరోధక చట్టం కింద ఉన్న కేసులను రోజువారీ ప్రాతిపదికన చేపట్టాలని హైకోర్టు నిర్దేశించింది. ఈ నేపథ్యంలో జగన్‌పై సీబీఐ నమోదు చేసిన 11 కేసుల్లో హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శంకర్ రావు, దివంగత మాజీ ఎంపీ ఎర్రంనాయుడు 2010లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన పిటిషన్లతో ఈ కేసులు నమోదయ్యాయి. అప్పుడు ఎంపీగా ఉన్న జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో 'క్విడ్ ప్రో కో' పద్ధతిలో కొన్ని సంస్థలకు భూములు, మైనింగ్ లైసెన్సు, ఇతర అవకాశాలూ ఇప్పించి... బదులుగా సొంత సంస్థ జగతిలో పెట్టుబడులు చేయించుకున్నారని ఆరోపణలు నమోదయ్యాయి. ఈ పెట్టుబడులను లంచాలుగా చూపిస్తూ, ఆ డబ్బును హవాలా చేయడంలో జగన్ కీలక పాత్ర పోషించారన్నది అభియోగం. దీనిపై హైకోర్టు 2011 ఆగస్టు 10న సీబీఐ విచారణకు ఆదేశించింది.
2011 ఆగస్టు17న సీబీఐ కేసు నమోదు చేసింది. 2004-2009 మధ్య కాలంలో నేరం జరిగిందన్న అనుమానంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ. నేరపూరిత కుట్ర (క్రిమినల్ కాన్స్పిరసీ), మోసం (చీటింగ్), నేరపూరిత నమ్మక ద్రోహం (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్), లెక్కలు తారుమారు చేయడం (ఫాల్సయిజేషన్ ఆఫ్ అకౌంట్స్), క్రిమినల్ మిస్ కాండక్ట్‌తో పాటు అవినీతి నివారణ చట్టాల కింద కేసు నమోదు చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీకే చెందిన విజయ సాయి రెడ్డి ముఖ్య నిందితులుగా, మొత్తం 71 మంది ఇందులో నిందితులుగా ఉన్నారు.
ఇప్పటికే సీబీఐ 11 చార్జ్‌షీట్‌లు దాఖలు చేసింది. వీటి ఆధారంగా ఈడీ ఐదు చార్జ్‌షీట్‌లు దాఖలు చేసింది. ప్రత్యేక సీబీఐ కోర్టులో ఆరోపణలపై విచారణ కొనసాగుతోందని జగన్ తరఫు న్యాయవాది జి.అశోక్ రెడ్డి బీబీసీతో తెలిపారు. డిశ్చార్జ్ పిటిషన్లపై కూడా విచారణ కొనసాగుతోందని చెప్పారు. దీని తర్వాత ట్రయల్‌కు తేది నిర్ణయింస్తుంది కోర్టు. ఈ కేసులో మొదటి చార్జ్‌షీట్‌ను సీబీఐ 2012 మార్చి 31న దాఖలు చేసింది. ఈ చార్జ్‌షీట్‌లో ఏ1 గా జగన్మోహన్ రెడ్డిని, ఏ2 గా విజయ సాయి రెడ్డిని, వీరితో పాటు ఆరోబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్, ట్రైడెంట్ లైఫ్ సైన్సైస్ సంస్థలు, ఆ సంస్థల ప్రతినిధులతో కలిపి 13 మందిని నిందితులుగా పేర్కొన్నారు.
ఈ చార్జ్‌షీట్‌లో హెటీరో సంస్థలు, ఆరోబిందో ఫార్మా సంస్థలు జగన్మోహన్ రెడ్డి కంపెనీలలో రూ.29.5 కోట్ల పెట్టుబడులు పెట్టాయని ఆరోపించింది సీబీఐ. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చైర్మెన్‌గా ఉన్న జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టిన దానికి బదులుగా అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ సంస్థలకు విశాఖపట్నంలోని నక్కపల్లిలో ఎస్‌సీజెడ్‌లో భూమి కేటాయించిందని ఆరోపణ. 2012 ఏప్రిల్ 23న రెండో చార్జ్‌షీట్, మూడో చార్జ్‌షీట్‌లను దాఖలు చేసింది సీబీఐ.
రెండో చార్జ్‌షీట్‌లో పెట్టుబడిదారులను రూ.34.65 కోట్ల రూపాయల మేర మోసం చేసారని ఆరోపిస్తూ ఏ1గా జగన్మోహన్ రెడ్డి, ఏ2గా విజయసాయి రెడ్డిని నిందితులుగా పేర్కొంది సీబీఐ. మూడో చార్జ్‌షీట్‌లో కూడా ఏ1గా జగన్మోహన్ రెడ్డి, ఏ2గా విజయ సాయి రెడ్డితో పాటు రాంకీ సంస్థల అధినేత అయోధ్య రామిరెడ్డి తో పాటు ఆరుగురిని నిందితులుగా పేర్కొంది సీబీఐ.
133.74 కోట్ల రూపాయల ప్రయోజనాలు పొందినందుకు బదులుగా రాంకీ సంస్థ జగన్ కంపెనీలకు రూ .10 కోట్ల లంచం పెట్టుబడుల రూపంలో ఇచ్చిందని సీబీఐ ఆరోపించింది. రాంకీ సంస్థల పెట్టుబడులకు బదులుగా గచ్చిబౌలీలో భూమి అతి తక్కువ దరకు ఇప్పిచారని, విశాఖపట్నంలో ఎస్‌సీజెడ్‌లో భూమి కేటాయించారని, రంగా రెడ్డి జిల్లా మహేశ్వరంలోని రాంకీ టౌన్ షిప్‌కు రిజిస్ట్రేషన్‌లో మినహాయింపు ఇచ్చారని, ప్రభుత్వ పథకం కింద వ్యర్థ పదార్థాల నిర్వహణ సంస్థ ఏర్పాటుకు అనుమతులు ఇప్పించారని సీబీఐ ఈ చార్జ్‌షీట్‌లో ఆరోపించింది.
అయోధ్య రామి రెడ్డి 2014లో వైఎస్ఆర్‌సీపీలో చేరి నర్సరావుపేట నుంచి లోక్‌సభకు పోటి చేశారు. ఓడిపోయారు. 2020 మేలో వైఎస్ఆర్ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ మూడు చార్జ్‌షీట్‌ల తర్వాత 2012 మేలో జగన్మోహన్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. 16 నెలలు హైదరాబాద్‌లోని చంచల్‌గూడా జైలులో ఉన్న జగన్ 2013 సెప్టెంబర్‌లో బెయిలుపై విడుదల అయ్యారు. జగన్ జైలులో ఉండగా సీబీఐ మరో ఏడు చార్జ్‌షీట్‌లు దాఖలు చేసింది.
నాలుగో చార్జ్‌షీట్ 2012 ఆగస్టు 13న దాఖలు చేసింది సీబీఐ. ఈ చార్జ్‌షీట్‌లో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కంపెనీల్లో పెట్టిన రూ 854 కోట్ల పెట్టుబడులకు సంభందించిన ఆరోపణలను పేర్కొన్నారు. నిమ్మగడ్డ పెట్టుబడులకు బదులుగా వాన్పిక్ ప్రాజెక్టుకు నిబంధనలను ఉల్లంఘిస్తూ 22,000 ఎకరాల భూమిని అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కేటాయించిందని ఆరోపణ. ఈ చార్జ్‌షీట్‌లో మంత్రులు మోపిదేవి వెంకట రమణ, ధర్మాన ప్రసాద్ రావులను నిందితులుగా పేర్కొన్నారు. మోపిదేవి వెంకటరమణను కూడా అరెస్టు చేశారు. మోపిదేవి కొంత కాలం జగన్ క్యాబినెట్ లో మంత్రిగా పని చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్య సభ ఎంపీ.
ఐదో చార్జ్‌షీట్ 2013 ఏప్రిల్ 8న దాఖలైంది. ఇందులో దాల్మియా సిమెంట్స్‌కు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. పునీత్ దాల్మియా రూ.95 కోట్ల పెట్టుబడులు జగన్ కంపెనీల్లో పెట్టినట్లు సీబీఐ ఆరోపించింది. బదులుగా కడప జిల్లాలోని తల్లమంచిపట్నం గ్రామంలో పునీత్ దాల్మియా ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థకు 407 హెక్టార్ల మైనింగ్ లీజును అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిందని ఆరోపించింది. అప్పటి కాంగ్రస్ నేత, మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని ఈ చార్జ్‌షీట్‌లో నిందితురాలిగా పేర్కొంది.
ఆరో చార్జ్‌షీట్, ఏడో చార్జ్‌షీట్ 2013 సెప్టెంబర్ 10న దాఖలయ్యాయి. ఆరో చార్జ్‌షీట్‌లో ఇండియా సిమెంట్స్‌కు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ఎన్.శ్రీనివాసన్ నేతృత్వంలోని ఇండియా సిమెంట్స్ సంస్థ జగన్ కంపెనీల్లో 140 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని సీబీఐ ఆరోపించింది. బదులుగా ఇండియా సిమెంట్స్‌కు కృష్ణ, కాగ్నా నది జలాలనూ, భూమిని లీజుకు కేటాయించారని అభియోగం మోపింది.
ఏడో చార్జ్‌షీట్‌లో పి.ప్రతాప్ రెడ్డి ప్రాతినిధ్యంలోని పెన్నా గ్రూప్ ఆఫ్ కంపెనీలు జగన్ వ్యాపారాల్లో రూ .68 కోట్లకు పెట్టుబడులు పెట్టాయని... బదులుగా అనంతపూర్ జిల్లాలో 231.09 ఎకరాల ప్రభుత్వ భూమి, కర్నూలు జిల్లాలో 304.7 హెక్టార్లలో మైనింగ్ లైసెన్స్ మంజూరు, రంగారెడ్డి జిల్లాలో 821 ఎకరాలకు మైనింగ్ లీజు పునరుద్ధరించడం, హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ వద్ద హోటల్ ప్రాజెక్టుకు నిబంధనలలో సడలింపులు వంటి ప్రయోజనాలను పొందాయిని సీబీఐ ఆరోపించింది.
ఎనిమిదో చార్జ్‌షీట్ 2013 సెప్టెంబర్ 10న దాఖలైంది. ఈ చార్జ్‌షీట్‌లో రఘురామ్ సిమెంటు సంస్థకు నిబంధనలను ఉల్లంఘిస్తూ కడప జిల్లాలో 2037.52 ఎకరాల విస్తీర్ణంలో మైనింగ్ లీజును ప్రభుత్వం కేటాయించిందని ఆరోపించింది సీబీఐ. తొమ్మిదో చార్జ్‌షీట్, పదో చార్జ్‌షీట్ 2013, సెప్టెంబర్ 17న దాఖలయ్యాయి. తొమ్మిదో చార్జ్‌షీట్‌లో జగతి పబ్లికేషన్స్‌లో 50 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినందుకుగానూ లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు అనంతపూర్ జిల్లాలో 8,844 ఎకరాల భూమిని కేటాయించినట్లు ఆరోపించారు.
పదో చార్జ్‌షీట్‌లో కారామెల్ ఆసియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ .15 కోట్ల పెట్టుబడికి బదులుగా ఇందూ టెక్ జోన్ సంస్థకు శంషాబాద్ వద్ద 250 ఎకరాల భూమిని కేటాయించారని ఆరోపించింది సీబీఐ. 11వ చార్జ్‌షీట్ 2014 సెప్టెంబర్ 9న దాఖలైంది. హైదరాబాద్‌లో ఇందూ ప్రాజెక్టులకు భూ కేటాయింపులు క్విడ్ ప్రో కో కింద జరిగినట్లు ఆరోపంచింది సీబీఐ. ఈ చార్జ్‌షీట్‌లో ఏ1గా జగన్మోహన్ రెడ్డి, ఏ2గా విజయసాయి రెడ్డితో పాటు ఇందూ ప్రాజెక్ట్ ప్రమోటర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఇందూ ప్రాజెక్టులు, కృష్ణ ప్రసాద్, చిడ్కో ప్రైవేట్ లిమిటెడ్, వసంత ప్రాజెక్టులు, ఇందూ ఈస్ట్రన్ ప్రావిన్స్, జితేంద్ర విర్వానీ, ఎంబసీ రియల్టర్స్, ఇందూ రాయల్ హోమ్స్ మరియు కార్మెల్ ఆసియా హోల్డింగ్స్‌ను నిందితులుగా పేర్కొన్నారు.
జగన్మోహన్ రెడ్డి యాజమాన్యంలోని సంస్థల్లో రూ.70 కోట్ల పెట్టుబడులకు బదులుగా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇందూ ప్రాజెక్టుల ప్రమోటర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డికి అతి చవక ధరకే భూములు ఇచ్చారని సీబీఐ ఆరోపించింది. ఈ కేసుల్లో నిందితులు ప్రతి శుక్రవారం ప్రత్యేక సీబీఐ కోర్టుకు విచారణకు హాజరు కావాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి దీని నుంచి మినహాయింపు కోరారు. కానీ, అందుకు వీలేందంటు సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. దాంతో కోర్టు మినహాయింపు ఇవ్వలేదు.