శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వాసుదేవన్
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (18:33 IST)

మరో మల్టీ లెవల్ మార్కెటింగ్ - ఈ బిజ్ భారీ మోసం

హైటెక్ సిటీ హైదరాబాద్‌లో మరో భారీ మోసం బయటపడింది. అయితే దీనికి కూడా బలయ్యేది ఈజీ మనీ కోసం వెంపర్లాడే మామూలు ప్రజానీకమే. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌లో ఈ-బిజ్‌ సంస్థ పేరిట మరో భారీ మోసం బయటపడింది. వెయ్యి కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడిన నేరస్థుడిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి, నేరస్థుడి ఖాతాల్లోని సుమారు రూ.70 లక్షలు మొత్తాన్ని స్తంభింపజేసినట్టు సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు. 
 
ఈ మోసానికి సంబంధించి పలు కీలక అంశాలను ఆయన మీడియాకు వివరించారు. ‘‘ఈ-బిజ్‌ సంస్థ 2001వ సంవత్సరంలో నోయిడా కేంద్రంగా స్థాపించబడింది. పవన్‌ మలాన్‌, ఆయన కుటుంబ సభ్యులు నిర్వాహకులుగా కొనసాగుతున్న ఈ సంస్థలో గొలుసుకట్టు మాదిరిగా సభ్యులను చేర్పిస్తే కమీషన్‌ ఇస్తామని చెప్తారు.  తక్కువ డబ్బుతో ఎక్కువ సంపాదించవచ్చునని చెప్తూ మోసాలకు పాల్పడ్డారు. ఈ సంస్థలో దాదాపు 7లక్షల మంది సభ్యులు ఉన్నట్టు తెలిసింది. నిర్వాహకులు సుమారు రూ.1000 కోట్లు వసూలు చేసారు. 
 
ఈ సంస్థ తన కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరింపజేసి, సంస్థలో రూ.16వేలు కట్టి సభ్యులుగా చేరితే 10వేల పాయింట్లు ఇస్తామనీ, సభ్యులుగా చేరిన ప్రతి వ్యక్తికీ కమీషను రావాలంటే మరో ఇద్దరిని చేర్పించాలంటూ నిబంధనలు పెట్టారు. ఇంకా యువతను ఆకట్టుకొనేందుకు ఈ లెర్నింగ్‌ కోర్సు అని చెబుతారు. సభ్యులకు కంప్యూటర్‌ కోర్సు, 58 రకాల ఇతర కోర్సులు నేర్పిస్తామని చెబుతారు. 
 
రెండు నెలల తర్వాత క్విజ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పి కోర్సు పూర్తయ్యాక 50శాతం మార్కులు వస్తే ధృవపత్రం ఇస్తారు. ఈ లెర్నింగ్‌ కోర్సుకు ప్రభుత్వం నుండి ఎలాంటి ఆమోదం లేదు. రూ.30వేలతో మరో ముగ్గురిని చేర్పిస్తే హాలిడే ప్యాకేజీ ఇస్తామంటారు. ఆదిలాబాద్‌, వరంగల్‌లలో ఈ మోసంపై పలు కేసులు నమోదు అయ్యాయి..  సంస్థ నుండి మోసపోయిన బాధితులు ఇంకా మా వద్దకు వస్తున్నారు. 
 
గతంలో ఇలాంటి మోసానికి పాల్పడిన క్యూనెట్‌ కేసులో 65 మందిని అరెస్టు చేసాము. ఈ కేసులో అరెస్టులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. తొలుత నోటీసులు ఇచ్చాము. కొందరు స్పందించారు. ఇంకా కొందరికి మరోసారి నోటీసులు ఇచ్చాము’’ అని సజ్జనార్‌ వివరించారు. కాగా... ఇలాంటి సంస్థల స్కీమ్‌లలో మోసపోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసారు.