సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

పసిడి పరిశ్రమ ప్రగతే లక్ష్యంగా సమగ్ర పాలసీ....

బంగారంపై ఏకీకృత సమగ్ర పాలసీ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నూతన విధానం త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆర్థిక శాఖ పేర్కొన్నది. బంగారం పరిశ్రమ అభివృద్ధి, ఆభరణాల ఎగుమతుల్లో వృద్ధి లక్ష్యంగా నూతన విధానం రూపొందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి పసిడి రంగ పరిశ్రమ అభివ్రుద్ధికి కేంద్ర ప్రభుత్వం స్థాయిలో పాలసీ లేనే లేదు. 
 
ఈ మేరకు బంగారం పాలసీపై సమగ్ర నివేదికను నీతి ఆయోగ్​ సమర్పించినట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి సురీందర్​ పాల్​ సింగ్ తెలిపారు​. దానిని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తప్పకుండా బంగారంపై నూతన విధానం ఉంటుందని అన్నారు. 

బంగారం దిగుమతులపై ప్రస్తుతం 12.5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాలను 4 శాతానికి తగ్గించాలని దేశీయ బంగారం పరిశ్రమ డిమాండ్​ చేస్తోంది. అత్యంత విలువైన బంగారం దిగుమతి, వినియోగంలో అతిపెద్ద మార్కెట్​గా ఉన్న భారత్​లో ఇంతవరకు బంగారం పాలసీ లేదు. మోదీ 1.0 ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ... సమగ్ర బంగారం విధానాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించారు.
 
తొలిసారి పుత్తడిపై సమగ్ర పాలసీ అంశం ఈ ఏడాది ఫిబ్రవరిలో చర్చకు వచ్చింది. అంతా అనుకున్నట్లు సవ్యంగా సాగితే జాతీయ స్థాయిలో ఆర్థిక, వివిధ రంగాల పరిశ్రమలకు మాదిరిగానే ‘పుత్తడి ఎక్చ్సేంజ్’ కొలువు దీరనున్నది. ఇందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా సమగ్ర పసిడి విధానాన్ని తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆర్థికశాఖ వర్గాలు తెలిపారు. ఈ విషయమై డిమాండ్ వినిపిస్తున్నా ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదన్న విమర్శ ఉంది.