సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (16:56 IST)

చెన్నై రైలు ప్రయాణీకులకు శుభవార్త... అరక్కోణం మీదుగా చెంగల్పట్టుకు?

చెన్నైలో లోకల్ ట్రైన్‌లను సరికొత్త మార్గంలో నడిపేందుకు దక్షిణ రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. చెన్నై సబ్-అర్బన్ రైళ్లలో దాదాపు 65,000 మంది ప్రయాణీకులు రోజూ ప్రయాణిస్తున్నారు. వివిధ రూట్లలో ప్రయాణీకులు రైళ్లను మారి ప్రయాణించాల్సి ఉండడంతో రైల్వే వారు దీనికి ఒక ప్రత్యామ్నాయాన్ని వెతికారు. 
 
తిరువళ్లూరు నుండి చెంగల్‌పట్టుకు వెళ్లాలంటే ప్రస్తుతం చెన్నై సెంట్రల్‌కి వెళ్లి, అక్కడి నుండి రైలు మారి ప్రయాణించడం వల్ల దాదాపు 126 కిలోమీటర్‌లు ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు కొన్ని రైళ్లను సరికొత్త మార్గంలో నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
 
ఇందులో భాగంగా తిరువళ్లూరు నుండి చెంగల్‌పట్టుకు వెళ్లేందుకు అరక్కోణం మీదుగా తక్కోలం, కాంచీపురం కలుపుతూ చెంగల్‌పట్టుకు రైలును నడిపేందుకు రైల్వే వారు సిద్ధమయ్యారు. దీని వలన ప్రయాణ దూరం 96 కిలోమీటర్లు వరకు ఉంటుంది. అనగా 30 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. 
 
ప్రస్తుతం తిరుమాల్‌పూర్ వరకు నడుపుతున్న రైళ్లను అరక్కోణం వరకు పెంచే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో కాంచీపురం, చెంగల్‌పట్టుకు ప్రయాణించే ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.