శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 22 నవంబరు 2018 (16:14 IST)

100 కేజీల ఉల్లిపాయల బస్తా 100 రూపాయలు

దేశంలో ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఫలితంగా ఒక కేజీ ఉల్లిపాయలు కేవలం ఒక్క రూపాయికే విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఉత్తర కర్ణాటకలోని అనేక మార్కెట్లలో ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. 
 
నిజానికి వారం రోజుల క్రితం మార్కెట్‌లో ఉల్లికి మంచి గిట్టుబాటు ధర ఉండేది. వంద కేజీల ఉల్లి బస్తా రూ.500 వరకు పలికేది. ఆ తర్వాత ఈ ధర గణనీయంగా పడిపోయింది. చివరకు 100 కేజీల బ్యాగును కేవలం రూ.100కే విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ యేడాది కర్ణాటకలోని మిగతా ప్రాంతాల్లో ఉల్లి బాగా పండింది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల నుంచి, మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో ఉల్లి, స్థానిక మార్కెట్‌కు వచ్చింది. స్థానికంగా పండించిన ఉల్లిధర పడిపోవడానికి ఇదే ముఖ్యమైన కారణమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
 
ఉల్లిపాయలు ఎక్కువగా ఉత్తర కర్ణాటకలో పండిస్తుంటారు. ఈ ఉల్లిని తమిళనాడుకు ఎక్కువగా ఎగుమతి అవుతుంది. ఈమధ్య గజ తుఫాను రావడంతో ఉల్లి ఎగుమతికి బ్రేక్ పడింది. ఉల్లి లోడుతో ఉన్న ట్రక్కులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. ఇప్పటికీ ఉల్లి ట్రక్కులు చెన్నై చేరుకోలేదు. ఉల్లి ధర పడిపోవడానికి ఇది మరో కారణంగా చెబుతున్నారు.