సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (13:50 IST)

దేశంలో పట్టాలపైకి తొలి ఇంజిన్ రహిత ఎక్స్‌ప్రెస్ రైలు

దేశంలో తొలి ఇంజిన్ రహిత ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కింది. వందే భారత్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. ఈ రైలు ఢిల్లీ నుంచి వారణాసి ప్రాంతాల మధ్య నడుపుతున్నారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ తరహా రైలును ప్రవేశపెట్టడం దేశంలోనే తొలిసారి. ఈ రైలు సేవలను ప్రధాని మోడీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత ఆయను రైలు బోగీలను పరిశీలించారు. 
 
నిజానికి ఢిల్లీ - వారణాసి ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 12 గంటలు కాగా, ఈ రైలు పుణ్యమాని కేవలం 8 గంటల్లో చేరుకోవచ్చు. అంటే 4 గంటల సమయం తగ్గనుంది. మొత్తం 16 కోచ్‌లు ఉండే ఈ రైలులో 1100 మంది ప్రయాణించవచ్చు. దేశంలోనే తొలి ఇంజిన్‌ రహిత రైలుగా గుర్తింపు పొందిన ఈ రైలు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. 
 
కాగా, ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంతో నడిచే రైళ్ళ జాబితాలో శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. ఇపుడు ట్రైన్ 18 లేదా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వచ్చి చేరింది. ఈ రైలు దేశంలోనే అత్యంత వేగవంతంగా నడిచే రైలుగా గుర్తింపుపొందింది. ఇది గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయనుంది. గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో పట్టాలపై దూసుకెళుతుంది. ఈనెల 15వ తేదీ నుంచి పట్టాలపైకి రానున్న ఈ రైలు ప్రత్యేకతలను పరిశీలిస్తే, 
 
ఈ రైలును తొలుత ఢిల్లీ - వారణాసి ప్రాంతాల మధ్య నడుపుతున్నారు. 752 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8 గంటల్లో చేరుకుంటుంది. ఉదయం 6 గంటలకు ఢిల్లీ స్టేషన్‌లో బయలుదేరే ఈ రైలు మధ్యాహ్నం 2 గంటలకు వారణాసికి చేరుకుంటుంది. అలాగే, తిరుగు ప్రయాణంలో వారణాసిలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి ఢిల్లీకి 11 గంటలకు వచ్చి చేరుతుంది. 
 
ఈ రైలు కేవలం రెండు స్టేషన్‌లలోనే ఆగుతుంది. ఒకటి కాన్పూర్, రెండోది ప్రయాగ్ రాజ్ (అలహాబాద్). ఈ రైలులో ఛైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లు మాత్రమే ఉన్నాయి. గతంలో ఢిల్లీ - వారణాసిల మధ్య ఛైర్‌కార్‌లో ప్రయాణ చార్జీని రూ.1850గానూ, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ ప్రయాణ టిక్కెట్ ధర రూ.3520గా ఉండేవి. కానీ ఇపుడు గణనీయంగా తగ్గించారు. 
 
కొత్తగా నిర్ణయించిన ప్రయాణ చార్జీల మేరకు న్యూఢిల్లీ నుంచి వారణాసికి ఛైర్‌కార్‌లో రూ.1760, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో రూ.3310గా నిర్ణయించారు. అలాగే, వారణాసి నుంచి ఢిల్లీకి ఛైర్‌కార్‌ చార్జీని రూ.1700గానూ, ఎగ్జిక్యూటివ్ క్లాస్ చార్జీని రూ.3260గా నిర్ణయించారు. 
అదేవిధంగా ఢిల్లీ - కాన్పూర్‌ మధ్య ప్రయాణ చార్జీ రూ.1090 (ఛైర్‌కార్), రూ.2105 (ఎగ్జిక్యూటివ్ క్లాస్)గా నిర్ణయించారు. 
ఢిల్లీ - ప్రయాగ్ రాజ్‌ల మధ్య ప్రయాణ చార్జీ రూ.1395 (ఛైర్‌కార్), రూ.2750 (ఎగ్జిక్యూటివ్ క్లాస్)గా నిర్ణయించారు. 
కాన్పూర్ - ప్రయాగ్‌రాజ్‌ల మధ్య ప్రయాణ చార్జీని రూ.595 (ఛైర్‌కార్), రూ.1170 (ఎగ్జిక్యూటివ్ క్లాస్), కాన్పూర్ - వారణాసి ప్రయాణ చార్జీని రూ.1020 (ఛైర్‌కార్), రూ.1815 (ఎగ్జిక్యూటివ్ క్లాస్)గా ఖరారు చేశారు. 
 
భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన ట్రైన్ 18 ప్రయాణికులకు ఫైవ్ స్టార్ హోటల్ భోజనం పంపిణీ చేయాలని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) నిర్ణయించింది. ఢిల్లీ నుంచి వారణాసి వరకు నడపనున్న ఈ రైలులో ప్రయాణించే వారికి అలహాబాద్ నగరంలోని ఉన్నతస్థాయి రెస్టారెంట్ నుంచి అల్పాహారం, కాన్పూర్ నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్ నుంచి భోజనం తెప్పించి వడ్డించనున్నారు. 
 
అలాగే, ఈ రైలులో వైఫై, లెడ్ స్క్రీన్స్ (ఇన్ఫోటైన్‌మెంట్), జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్, మాడ్యులర్ టాయిలెట్స్, బయో వాక్యూమ్ ఫ్లషెష్, దివ్యాంగులకు ఫ్రెండీ టాయిలెట్స్, ఇంటర్‌కనెక్టర్ రొటేషనల్ సీట్లు (ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో మాత్రమే) బోగీకి బోగీకి మధ్య ఆటోమేటిక్ డోర్లు, మినీ పాంట్రీ వంటి అత్యాధునిక సౌకర్యాలను ఇందులో కల్పించారు. 
 
తొలుత ఈ ట్రైన్ పేరు ట్రైన్ 18గా పిలుస్తూ వచ్చారు. చెన్నైలోని రైల్వే కోచ్ తయారీ ఫ్యాక్టరీలో ఈ రైలును పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 18 నెలల కాలంలో పూర్తిచేశారు. అందుకే ఈ రైలుకు ట్రైన్ 18గా పేరు వచ్చింది. ఆ తర్వాత దేశ ప్రజల నుంచి సలహాల మేరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా పేరు మార్చారు. ఈ రైలును ఈనెల 15వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు.