ఆర్బీఐ నుంచి గుడ్ న్యూస్ .. బంగారంపై రుణాలు.. 90 శాతం పెంపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్యులను ఊరట నిచ్చే శుభవార్త చెప్పింది. ఇప్పటికే కరోనా కష్టకాలంలో అన్నిరకాల రుణాలపై మారటోరియం గడువు పెంచిన ఆర్బీఐ.. తాజాగా బంగారు ఆభరణాలపై తీసుకునే రుణం విలువను పెంచింది. ఇప్పటివరకు ఆర్బీఐ సూచనలు మేరకు మొత్తం బంగారం విలువలో 75 శాతం విలువ మించకుండా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణం మంజూరు చేస్తాయి.
కానీ ఇప్పుడు అలా కాదు.. బంగారం విలువలో ఇప్పుడు 90 శాతం వరకు రుణం లభిస్తుంది. ఇప్పటివరకు బంగారం మొత్తం విలువలో 75 శాతం మాత్రమే అందుబాటులో ఉంది. ఫలితంగా బంగారు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న బ్యాంక్ లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ, మొదట మీ బంగారం నాణ్యతను తనిఖీ చేస్తుంది.
రుణ మొత్తాన్ని బంగారం నాణ్యత ప్రకారం నిర్ణయిస్తారు. బ్యాంకులు సాధారణంగా బంగారం విలువలో 75 శాతం వరకు రుణాలు ఇస్తాయి. కానీ ఆర్బీఐ తాజా సూచనలతో బంగారం రుణం విలువ 90 శాతం పెంచింది. సాధారణంగా, 18 నుండి 24 క్యారెట్ల బంగారం మంచి మొత్తాన్ని ఇస్తుంది.
తాజా మార్గదర్శకాల ప్రకారం గతంలో 5 లక్షల రూపాయల విలువైన బంగారంపై 3.75 లక్షల రూపాయల రుణం లభిస్తే ఇప్పుడు అదే విలువ కలిగిన బంగారం తనఖాపై 4.5 లక్షల రూపాయల వరకూ రుణం పొందవచ్చు. కరోనా సంక్షోభంలో ఈ నిర్ణయం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.