శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 డిశెంబరు 2020 (11:47 IST)

ఇకపై రైళ్ళలో రాత్రి జర్నీ గగనమే.... రైల్వే శాఖ చీకటి ఒప్పందం!?

దేశంలో త్వరలో ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కనున్నాయి. పలు మార్గాల్లో రైళ్లను నడిపేందుకు అనేక బడా కన్సార్టియంలు అమితాసక్తిని చూపుతున్నాయి. ఇలాంటి బడా సంస్థలతో రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఈ చీకటి ఒప్పందాల కారణంగా ప్రభుత్వ రైళ్ళలో ఇక రాత్రి ప్రయాణం గగనంకానుంది. దీనికి బలమైన కారణం లేకపోలేదు. 
 
ప్రైవేటు రైళ్ళను నడిపేందుకు ముందుకు వచ్చిన కన్సార్టియంతో రైల్వే శాఖ కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఈ చీకటి ఒప్పందం ఒకటి. ఈ సంస్థలు తమ ఆసక్తి వ్యక్తీకరణలో రాత్రి సమయాల్లోని డిమాండ్‌ సమయాలను తమకు కేటాయించాల్సిందిగా కోరాయి. దీంతో ప్రయాణికులకు అనుకూలమైన రైలు సమయాలను రైల్వే శాఖ మార్చివేసింది. వీటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించనుంది. 
 
అంటే, రాత్రి జర్నీ చేసి, ఉదయం గమ్యాస్థానానికి చేరుకునే సౌలభ్యం ఇక కనిపించదు. ప్రభుత్వం నడిపే రైళ్ళన్నీ ఎక్కువగా పగటిపూటే నడుస్తాయి. ఇలా సమయాలను మార్చడం వల్ల ప్రయాణికుడు రాత్రి జర్నీ చేసి ఉదయం విధులకు హాజరయ్యే అవకాశాన్ని కోల్పోతాడు. ఒక విధిగా రాత్రిపూట జర్నీ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్ రైళ్ళలో అధిక చార్జీలు చెల్లించి ప్రయాణం చేయాల్సివుంటుంది. 
 
నిజానికి రైల్లో ప్రయాణించే వారు తమ ప్రయాణ సమయాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు. ఎక్కువగా రాత్రి సమయాల్లోనే రైళ్లలో రాకపోకలు సాగిస్తారు. రాత్రి ప్రయాణంలో నిద్రపోయి పగలు గమ్యస్థానం చేరుకోవాలనే అనుకుంటారు. ఇందుకు అనుగుణంగానే విజయవాడ డివిజన్‌ పరిధిలో రాత్రి సమయంలోనే ఎక్కువగా రైళ్లు నడుస్తుంటాయి. 
 
చాలా రైళ్లు రాత్రి 8 నుంచి 11 గంటల వరకు ఉంటాయి. నడిజామున లేదా వేకువజామున తిరిగే రైళ్లకు డిమాండ్‌ స్వల్పంగానే ఉంటుంది. విజయవాడ నుంచి సికింద్రాబాద్‌, విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, గౌహతి, అహ్మదాబాద్‌ వంటి అనేక దూరప్రాంత రూట్లకు రాత్రి సమయాల్లోనే ఎక్కువ రైళ్లు నడుపుతారు. అయితే, రైల్వేశాఖ ఉన్నట్టుండి ఈ రైళ్ల సమయాలను మార్చేసింది. 
 
ఇలా ఒకటా రెండా.. విజయవాడ డివిజన్‌ మీదుగా రాకపోకలు సాగిస్తున్న మొత్తం 30కి పైగా రైళ్ల సమయాలను సవరించారు. ఇందులో మొత్తం 18 డైలీ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. స్థానికంగా ఎక్కువ డిమాండ్‌ ఉండే విశాఖపట్నం - హైదరాబాద్‌, తిరుపతి - లింగంపల్లి, కాకినాడ - లింగంపల్లి, గుంటూరు - సికింద్రాబాద్‌, నర్సాపూర్‌ - లింగంపల్లి వంటి లోకల్‌ రైళ్లూ ఉన్నాయి.