చిరు వ్యాపారి పాన్ కార్డు దుర్వినియోగం.. రూ.141 కోట్ల ఐటీ నోటీసులు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్ ప్రాంతానికి చెందిన ఓ చిరు వ్యాపారి పాన్ కార్డు దుర్వినియోగమైంది. దీంతో ఆ కిరాణా వ్యాపారికి రూ.141 కోట్లకు పైగా అమ్మకాలకు సంబంధించి ఐటీ శాఖ నోటీసులు జారీచేసింది. తన పాన్ కార్డును ఎవరో దుర్వినియోగం చేసి ఈ భారీ మోసానికి పాల్పడ్డారని బాధితుడు వాపోతున్నాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఏ యేడాది జూలై 10వ తేదీన ఐటీ శాఖ నుంచి నోటీసు వచ్చింది. అందులో నేను రూ.141 కోట్లకు పైగా అమ్మకాలు జరిపినట్టు పేర్కొన్నారు. ఈ నోటీసు చూసి కళ్ళు బైర్లు కమ్మాయి అని అన్నారు. తనకు 2022లోనే తొలిసారి నోటీసు వచ్చిందని, అపుడే ఐటీ శాఖ అధికారులను కలిసి ఆ కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరించినట్టు ఆయన చెప్పారు.
గుర్తు తెలియని వ్యక్తుల తన పాన్ కార్డును మోసపూరితంగా ఉపయోగించి ఈ కంపెనీలను సృష్టించారని ఆయన ఆరోపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.