బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 22 డిశెంబరు 2021 (17:40 IST)

కాలుష్య నివారణ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలదే రానున్న కాలం: హేమ చంద్రా రెడ్డి

భారత దేశంలో ఇ-మొబిలిటీ వాహన వృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని మాసివ్ మొబిలిటీ సహ వ్యవస్థాపకుడు శైలేష్ విక్రమ్ సింగ్ అన్నారు. ద్విచక్ర వాహనాల నుండి మొదలైన ఇ మొబిలిటీ భవిష్యత్తులో భారీ వాహన శ్రేణికి కూడా అన్వయించ బడుతుందన్నారు. ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ రాష్ట్ర శాఖ, మాలక్ష్మి గ్రూపు సంయిక్త ఆధ్వర్యంలో విజయవాడ మధు మాలక్ష్మి ఛాంబర్స్‌లో బుధవారం నిర్వహించిన యార్లగడ్డ శ్రీరాములు పద్దెనిమిదవ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో ‘‘ఇ-మొబిలిటీ - భారతీయ, ప్రపంచ దృక్పథం’’ అనే అంశంపై హైబ్రీడ్ విధానంలో విక్రమ్ సింగ్ ప్రసంగించారు. 
 
ఈ సందర్భంగా శైలేష్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ నాలుగు చక్రాల వాహనాల నుండి గ్లోబల్ ఎలక్ట్రిఫికేషన్ ప్రారంభమైందన్నారు. అందుబాటులో ఉన్న ఇంధన వ్యయంతో పోల్చితే ఇ మొబిలిటీ అతి తక్కువ ఖర్చుతో గరిష్ట ప్రయోజనాన్ని అందిస్తుందన్నారు. తక్కువ బరువు, కనిష్ట వేగంతో కూడిన వాణిజ్య వాహనాల నుండి భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రారంభమైందని వివరించారు.
 
ఇ మొబిలిటీ విధానంలో వాహనానికి నిర్ధేశించిన పెట్టుబడిని అతి తక్కువ కాలంలో పూర్తిస్థాయిలో వెనక్కి రాబట్టుకోవచ్చని శైలేష్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నాలుగు చక్రాల ప్యాసింజర్ వాహనాలు ఆటో రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయని అదే క్రమంలో ఎలక్ట్రిక్ మొబిలిటీలోని అన్ని ఆవిష్కరణలకు ఇదే విభాగం నాయకత్వం వహిస్తుందని వివరించారు. అయితే భారతదేశ వాహనరంగంలో ద్విచక్ర వాహన విభాగం ఆధిపత్యం చెలాయిస్తోందని, ఆటోమొబైల్ రంగ వార్షిక అమ్మకాలలో ఎనభై శాతం వాటా దానిదే ఉందన్నారు. భారతదేశానికి ఉన్న భిన్నమైన అవసరాల దృష్ట్యా ఇ మొబిలిటీకి ఇక్కడ పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయన్నారు.
 
కార్యక్రమానికి విశిష్ట అతిధిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచార్య కె హేమచంద్రా రెడ్డి మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ వాహనాలదే రానున్న కాలమని, తద్వారా కాలుష్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.


కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే క్రమంలో పలు రాయితీలను కూడా అందిస్తున్నాయన్నారు. ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ రాష్ట్ర కార్యదర్సి డాక్టర్ సి.వి. శ్రీరామ్, మా లక్ష్మి గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు యార్లగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్, ముఖ్యకార్యనిర్వహణ అధికారి మండవ సందీప్, సెడిబస్ సిఇఓ దీప బాలసుబ్రమణ్యన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రారంభ కంపెనీల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ వెబినార్‌కు హాజరు కాగా, చివరగా జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది.