గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 నవంబరు 2020 (16:04 IST)

ఎస్బీఐ మెగా జాబ్ రిక్రూట్మెంట్... ప్రొబెషనరీ ఆఫీసర్ల కోసం ప్రకటన

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థగా ఉన్న భారతీయ రిజర్వు బ్యాంకు (ఎస్బీఐ) మెగా రిక్రూట్మెంట్ చేపట్టనుంది. ఏకంగా రెండు వేల ప్రొబెషనరీ పోస్టుల భర్తీని చేపట్టనుంది. ఇందుకోసం ఓ ఉద్యోగ ప్రకటనను జారీచేసింది. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పరిస్థితులు నెమ్మదిస్తున్నాయి. దీంతో బ్యాంకు కార్యకలాపాలు కూడా ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 
 
ఏకంగా, 2 వేల ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ఎస్బీఐ తన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఇందులో జనరల్ కేటగిరీలో 810, ఓబీసీలకు 540, ఎస్సీలకు 300, ఎస్టీలకు 150, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) కేటగిరీలో 200 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
 
ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసివుండాలి. 21 నుంచి 30 ఏళ్ల లోపు వారై ఉండాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అందుకు చివరి తేదీ డిసెంబరు 4. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
 
ప్రిలిమ్స్ పరీక్షలు డిసెంబరు 31 నుంచి 2021 జనవరి 5 వరకు జరుగుతాయి. జనవరి మూడో వారంలో ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత జనవరి 29న మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. 
 
ఫిబ్రవరి చివరి వారంలో మెయిన్స్ ఫలితాలు వస్తాయి. అదే నెలలో కానీ, మార్చి నెలలో కానీ ఇంటర్వ్యూలు చేపడతారు. పూర్తి వివరాలకు ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in లో చూడొచ్చు. ఈ ఉద్యోగాల కోసం ఎంపికయ్యే వారికి ప్రాథమికంగా 27620 రూపాయలను చెల్లిస్తారు. వీటితోపాటు డీఏ, సీసీఏ, హెచ్‌ఆర్ఏ, ఇతరాత్రా అలవెన్సులు కూడా ఉంటాయి.