శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (22:21 IST)

మోడీ చేస్తున్న అన్యాయాన్ని నిలదీద్దాం.. రండి... చెన్నై టీడీపీ నేతల పిలుపు

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పుండుపై కారం చల్లినట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అన్యాయాన్ని నిలదీసేందుకు చెన్నై మహానగరంలోని తెలుగు ప్రజలంతా ఐక్యంగా పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ చెన్నై ఫోరం నేతలు సంయుక్తంగా పిలుపునిచ్చారు. ముఖ్యంగా, ఏపీ పట్ల ప్రధాని మోడీ ఏపీ చూపుతున్న వివక్ష, చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్షలను చేస్తున్నారు. దీనికి సంఘీభావం తెలుపుతూ చెన్నైలో కూడా టీడీపీ ఫోరం నేతలు ఒక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈనెల 11వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్థానిక చెప్పాక్కంలోని కలైవాణర్ అరంగంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు చెన్నై టీడీపీ నేత చంద్రశేఖర్ సారథ్యంలో ఫోరం నేతలు వెల్లడించారు. 
 
ఈ సమావేశానికి ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనందబాబు, అమర్నాథ్ రెడ్డి, లోక్‌సభ సభ్యులు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, మురళీ మోహన్, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ, ఎమ్మెల్సీ బీద మస్తాన్ రావులతో పాటు మరికొందరు తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొంటారని వివరించారు. 
 
ఇదే అంశంపై వారు గురువారం సాయంత్రం చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ, ధర్మపోరాట దీక్షకు మద్దతుగా, ప్రధాని మోడీ చేస్తున్న అన్యాయాన్ని నలుదిక్కలా చాటిచెప్పాలన్న ఉద్దేశ్యంతోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా, ఈ సంఘీభావ సమావేశం పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అందువల్ల చెన్నైలోని అన్ని పార్టీల నేతలు, సంఘాల నాయకులు భారీ సంఖ్యలో తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. 
 
అనంతరం కోర్ కమిటీ కన్వీనర్ బ్రహ్మానందం మాట్లాడుతూ, ఈ నెల 11వ తేదీన జరిగే సమావేశానికి నగరంలోని తెలుగువారంతా పాల్గొనాలని కోరారు. విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని మోడీ చేస్తున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఈ పోరాటం చేస్తున్నామని తెలిపారు. కేంద్రం చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడేందుకు ఇదే మంచి తరుణమన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి, కట్టుబట్టలతో బయటకు పంపారనీ, ఇపుడు విభజన చట్టం మేరకు న్యాయం చేయమంటే అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
 
అలాగే, ఆస్కా మాజీ అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నేత ఎం.ఆదిశేషయ్య మాట్లాడుతూ, రాష్ట్రం, చెన్నై నగరంలోని పార్టీలకు, తెలుగు సంఘాలకు అతీతంగా ఈ సంఘీభావ సమావేశం నిర్వహిస్తున్నామని ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ కడపలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని ఏపీ మంత్రివర్గం ఓ తీర్మానం చేయడం అభినందనీయమన్నారు. 
 
అదేవిధంగా టీడీపీ ఫోరం ప్రతినిధులైత బి.రామారావు, మహేంద్ర, రామాంజనేయులు మాట్లాడుతూ, విభజన సమయంలో ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించగా, కాదు.. కాదు.. 15 యేళ్ళు ఇవ్వాలంటూ బీజేపీ నేతలు రాజ్యసభలో గొంతుచించుకుని డిమాండ్ చేశారనీ గుర్తుచేశారు. ఇపుడు ప్రత్యేక హోదా దేవుడెరుగ.. రాజధాని అమరావతి నిర్మాణం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులను కూడా ఇవ్వడం లేదని వారు వాపోయారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం, ఏపీ ప్రజల పట్ల మోడీ సర్కారు చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఈ సంఘీభావ సమావేశం నిర్వహిస్తున్నామనీ, ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వారంతా పిలుపునిచ్చారు.