సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మార్చి 2020 (13:05 IST)

మహారాష్ట్రలో కరోనా కల్లోలం.. 'సెంచరీ' దాటిన కేసులు

మహారాష్ట్రలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. తాజా లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో కరోనా కేసులు 101కు చేరాయి. సోమవారం 64గా ఉన్న ఈ కేసుల సంఖ్య మంగళవారం మధ్యాహ్నానికి 101కు చేరింది. ఒక్క ముంబైలోనే 17 కేసులు నమోదయ్యాయి. దేశంలోని అన్ని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ.. కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. 
 
ముఖ్యంగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీంతో మహారాష్ట్ర వాసులు భయంతో వణికిపోతున్నారు. తాజాగా ఆ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 101కి చేరాయి. దీంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 
 
మరోవైపు ఈశాన్య భారతంలో కూడా తొలి కరోనా కేసు నమోదైంది. మణిపూర్ లో 23 ఏళ్ల మహిళకు కరోనా సోకింది. ఇటీవలే  ఆమె లండన్ లో పర్యటించి వచ్చింది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 8 గంటలకు ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనా వైరస్ ప్రభావం గురించి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతానని ఆయన ట్వీట్ చేశారు. 
 
మన దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనుండటం ఇది రెండో సారి. గత గురువారం మోడీ ప్రసంగిస్తూ కరోనా నేపథ్యంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలో వివరించారు. కరోనా విస్తరణను కట్టడి చేయడానికి జనతా కర్ఫ్యూని విధిస్తున్నట్టు ప్రకటించారు. 
 
మంగళవారం కూడా ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ కొనసాగించనున్నట్టు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 22వ తేదీన మోడీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూను అమలు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్‌డౌన్ పాటిస్తున్నారు.