మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి

గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,590 కేసులు.. వ్యాక్సిన్‌పై జాగ్రత్తలు

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,590 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. మహమ్మారి నుంచి మరో 15,975 మంది కోలుకున్నారని, తాజాగా 191 మంది వైరస్‌ ప్రభావంతో మృతి చెందారని చెప్పింది.
 
తాజాగా నమోదైన 15,590 కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,05,27,683కు పెరిగిందని చెప్పింది. ఇప్పటివరకు 1,01,62,738 మంది కోలుకున్నారని తెలిపింది. మొత్తం మరణాల సంఖ్య 1,51,918కు పెరిగిందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 2,13,027 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది.
 
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని జనవరి 16నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం నిబంధనావళిని జారీ చేసింది. 18 సంవత్సరాల వయసు దాటిన వారికి మాత్రమే టీకా వేయాలని, గర్భిణీ స్త్రీలకు కూడా టీకా వేయవద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
 
శనివారం నుంచి దేశవ్యాప్తంగా 3,006 స్థలాల్లో మూడు లక్షలమంది ఆరోగ్య సిబ్బందికి కోవిడ్-19 వైరస్ నిరోధక టీకాలను వేయనున్నారు. ఈ సందర్భంగానే కేంద్రం ఎవరికి వ్యాక్సిన్ వేయకూడదు, ఎవరికి వేయవచ్చు అంటూ రాష్టాల ప్రభుత్వాలకు నిర్దిష్టంగా ఆదేశాలు పంపింది. ఆ ప్రకారమే 18 ఏళ్ల లోపు వారికి, గర్భిణులకు టీకాలు వేయవద్దని కేంద్రం ఆదేశించింది.