గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 జనవరి 2021 (15:10 IST)

#RedTheFilm రామ్ పోతినేని "రెడ్" మూవీ ఎలా వుంది (రివ్యూ)

చిత్రం : రెడ్ 
నటీనటులు : రామ్‌ పోతినేని, మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్‌, సంపత్‌ రాజ్‌, వెన‍్నల కిషోర్‌ తదితరులు
నిర్మాణ సంస్థ :  శ్రీ స్రవంతి మూవీస్
సంగీతం :  మణిశర్మ
నిర్మాత :  ‘స్రవంతి’ రవికిశోర్
దర్శకత్వం : తిరుమల కిశోర్
 
సినీ నేపథ్య కుటుంబం నుంచి వెండితెరకు హీరోగా పరచయమైన నటుడు రామ్ పోతినేని. కెరీర్‌ ఆరంభంలోనే కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్నప్పటికీ ఆ తర్వాత వరుస పరాజయాలను చవిచూశాడు. ఇలాంటి పరిస్థితుల్లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. 
 
ఇక ఇప్పుడు అదే జోష్‌ను కంటిన్యూ చేయాలని తనకు గతంలో ‘నేను శైలజ', ‘ఉన్నది ఒకటే జిందగీ' వంటి హిట్లు ఇచ్చిన కిశోర్ తిరుమలతో ‘రెడ్' అనే సినిమా చేశాడు. తమిళ్ మూవీ రిమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పైగా, ద్విపాత్రిభినయం చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు​ సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. దీంతో ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా గురువారం 'రెడ్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో రామ్‌ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా? కిశోర్ తిరుమల, రామ్‌ కాంబో హ్యాట్రిక్‌ విజయం సాధించిందా లేదా తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
 
చిత్ర కథ : 
సిద్దార్థ్(రామ్‌) ఒక ఇంజనీర్‌. తాను పని చేసే ఆఫీస్‌లోనే మహిమా(మాళవికా శర్మ)అనే యువతిని చూడగానే మనసుపారేసుకుంటాడు. తన ప్రేమను ఆమెతో వ్యక్తం చేయడానికి నానా ఇబ్బందులు పడుతాడు. చివరకు ఎలాగోలా తన ప్రేమ విషయాన్ని ఆమెతో చెప్పేస్తాడు. ఆమె కూడా సిద్దార్థ్‌ను ఇష్టపడుతుంది. కొద్ది రోజుల్లో పెళ్లికూడా చేసుకోవాలనుకుంటారు. కట్‌ చేస్తే.. ఆదిత్య(రామ్‌) ఓ తెలివైన దొంగ. చిన్న చిన్న దొంగతనాలు చేసి వచ్చిన డబ్బుతో.. జల్సాలు చేస్తుంటాడు. పేకాటలో లక్షలకు లక్షలు పొగొట్టుకుంటాడు. 
 
ఇలా ఓసారి తన స్నేహితుడు వేమ(సత్య) దాచుకున్న డబ్బులు తీసుకొని వెళ్లి పేకాటలో పొగుట్టుకుంటాడు. దాని వల్ల వేమ ఓ ప్రమాదంలో ఇరుక్కుంటాడు. తన స్నేహితుడిని కాపాడటం కోసం ఆదిత్య 9 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఓ రౌడీకి ఇస్తాడు. ఇదిలావుంటే.. ఆకాశ్‌ అనే ఓ యువకుడు దారుణ హత్యకు గురవుతాడు. ఈ హత్య కేసులో సిద్దార్థ, ఆదిత్య ఇద్దరిని పోలీసులు అరెస్టు చేస్తారు.
 
ఈ కేసు సీఐ నాగేంద్ర కుమార్‌(సంపత్‌ రాజ్‌), ఎస్సై యామిని(నివేదా పేతురాజ్) ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణ చేపడతారు. ఇక ఈ కేసులో సిద్దార్థ్‌ను ఇరికించడానికి సీఐ నాగేంద్ర కుట్ర చేస్తాడు. అసలు ఈ హత్యకు సిద్దార్థ్‌, ఆదిత్యలకు సంబంధం ఏంటి? ఇద్దరిలో ఆకాశ్‌ని ఎవరు హత్య చేశారు? సీఐ నాగేంద్రకు, సిద్దార్థ్‌కు మధ్య ఉన్న గొడవేంటి? సిద్దార్థ్‌, ఆదిత్యల మధ్య సంబంధం ఏంటి? పోలీసులు ఈ కేసును చేధించారా లేదా? అనేదే మిగిలిన కథ. 
 
చిత్ర విశ్లేషణ...
ఈ చిత్రంలో రామ్ రెండు విభిన్నపాత్రల్లో కనిపిస్తాడు. పైగా, ఒకదానికొకటి పొంతనవుండదు. స్టైల్‌, యాక్షన్‌‌తో మాస్‌ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు. సిద్దార్థ్‌ పాత్రలో క్లాస్‌గా కనిపించి మెప్పించిన రామ్‌.. ఆదిత్య పాత్రలో ఊర మాస్‌గా అలరించాడు. తన నటనతో మరోసారి ఎనర్జిటిక్ స్టార్ అని నిరూపించుకున్నాడు. ఎస్.ఐ పాత్రలో నివేదా పేతురాజ్ కనిపించింది. మాళవిక శర్మ ‌- రామ్ రొమాన్స్ బాగా పండింది. లిప్ లాక్‌లతో హీటెక్కించారు. ఇక అమాయకపు యువతి పాత్రలో అమృతా అయ్యర్‌ అద్భుతంగా నటించాడు. సంపత్‌ రాజ్‌, వెన‍్నల కిషోర్‌, సత్య తమ పరిధిమేర నటించారు.
 
‘నేను శైలజ', ‘ఉన్నది ఒకటే జిందగీ' వంటి సూపర్‌ హిట్ల తర్వాత తిరుమల కిశోర్, రామ్‌ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్‌ చిత్రం "రెడ్"‌. ‘ఇస్మార్ట్ శంకర్'లాంటి సూపర్‌ హిట్‌ తర్వాతా రామ్‌ నుంచి వస్తున్న తొలి చిత్రం ఇదే కావడంతో ‘రెడ్‌’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను కొంతమేర దర్శకుడు అందుకున్నాడు. తమిళ్ మూవీ తడమ్‌కు ఇది రీమేకే అయినా.. తెలుగు ఆడియన్స్‌కు నచ్చేలా కథలో మార్పులు చేసి మెప్పించాడు. 
 
ఫస్టాఫ్‌లోనే ఇద్దరు రామ్‌లను తెరపై పరిచయం చేసిన దర్శకుడు... ఆ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ ఏంటో సినిమా చివరి వరకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక ఇంటర్వేల్‌ ముందు ఓ ట్విస్ట్‌ ఇచ్చి.. సెకండాఫ్‌పై క్యూరియాసిటీని క్రియేట్‌ చేశాడు. ప్లాష్‌బ్యాక్‌ ట్విస్ట్‌లు కూడా ఆడియన్స్‌కి కథపై ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తాయి.
 
కథలో ట్విస్ట్‌లు ఉన్నప్పటికీ.. సినిమా స్లోగా రన్‌ అవుతున్న భావన సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. సినిమాలోని డైలాగ్స్‌ బాగుండటంతో పాటు ఆలోచించే విధంగా చేస్తాయి. చిత్రంలోని డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం సంగీతం. 
 
మణిశర్మ తన పాటలతో పాటు.. బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశాడు. మణిశర్మ తనదైన బిబీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పాటలు కూడా చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. ఈ చిత్రం ఓహో అనేలావుందని చెప్పలేం కానీ.. చూడొచ్చు. 
 
ఈ చిత్రానికి రామ్ నటనతో పాటు... కథ ముందుకుసాగే కొద్దీ వచ్చే ట్విస్టులు, మణిశర్మ సంగీతం ప్లస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు. అయితే, కథ స్లోగా సాగడం మైనస్ పాయింట్‌గా పేర్కొనవచ్చు.