శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 మే 2020 (12:37 IST)

దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 52 శాతం ఆ ఐదు జిల్లాల్లోనివే...

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 6,767 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదేసమయంలో 147 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మృతుల సంఖ్య 3,867కి చేరింది. ఇక కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,31,868కి చేరింది. 73,560 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. 
 
ఆ ఐదు జిల్లాల నుంచే... 
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు మొత్తం కేసులు 1.31 లక్షలు నమోదు కాగా, రికవరీల సంఖ్య 50 వేలను దాటింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల మేరకు గత వారంలో కేసుల సంఖ్య 30 శాతం (సోమవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకూ) పెరిగింది. 
 
దేశంలో తొలి కరోనా కేసు జనవరి 30వ తేదీన నమోదుకాగా, 74 శాతం కేసులు మే నెలలోనే రావడం గమనార్హం. ఇక ఇదే వేగంతో కేసులు పెరిగితే, మరో నాలుగు రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షన్నరను దాటుతుందని అంచనా. కొత్త కేసులు నమోదయ్యే విషయంలోనూ, మరణాల విషయంలోనూ చాలా ఇతర దేశాలతో పోలిస్తే, మన దేశంలో శరవేగంగా కదులుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. 
 
కేసులు రెట్టింపయ్యేందుకు పడుతున్న సమయం కూడా 15 రోజులకు తగ్గింది. మహారాష్ట్రలో అత్యధికంగా 30 వేలకు పైగా కేసులుండగా, రెండో స్థానంలో నిలిచిన తమిళనాడులో 7,500కు పైగా కేసులున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో 6,500కు పైగా కేసులతో గుజరాత్, 6,200కు పైగా కేసులతో న్యూఢిల్లీ ఉన్నాయి. కేసుల సంఖ్యలో టాప్-5లో ఉన్న రాష్ట్రాల్లో 77 శాతం కేసులున్నాయి. ఇక టాప్-10 రాష్ట్రాల్లో 91 శాతం కేసులున్నాయి.
 
అయితే, గడచిన రెండు రోజుల్లో ముంబై, చెన్నై, థానే, అహ్మదాబాద్, పుణె జిల్లాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా వచ్చాయి. ఈ రెండు రోజుల్లో వచ్చిన దాదాపు 11 వేల కేసుల్లో 55 శాతం ఈ ఐదు జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. వీటితో పాటు కోల్‌కతా, హౌరా, బారాబంకి జిల్లాల్లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోంది. 
 
దేశంలోని 600 జిల్లాల్లో కరోనా కేసులు ఉండగా, ముంబైలో 27,251 కేసులున్నాయి. ఆపై అహ్మదాబాద్ లో 9,724, చెన్నైలో 9,361, థానేలో 5,590, పుణెలో 4,834 కేసులుండగా, దేశం మొత్తంలో నమోదైన కేసుల్లో ఇది 52 శాతానికి సమానం కావడం గమనార్హం.