గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (10:51 IST)

ఇటు తెలంగాణ - అటు దేశంలో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

కాస్త ఊరట కలిగించే వార్త. ఇటు తెలంగాణ, అటు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతూ వచ్చిన ఈ కేసులు గడచిన 24 గంటల్లో కాస్త తగ్గుముఖం పట్టాయి. 
 
ముఖ్యంగా, గ‌త నాలుగు రోజులుగా 60 వేల‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతుండ‌గా, సోమవారం మాత్రం 57 వేలు మాత్ర‌మే రికార్డ‌య్యాయి. దేశంలో గ‌త 24 గంట‌ల్లో 57,982 మంది కొత్త‌గా క‌రోనాబారిన‌ప‌డ్డారు. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 26,47,664కు చేరింది. 
 
ఇందులో 6,76,900 మంది చికిత్స పొందుతుండ‌గా, మ‌రో 19,19,843 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న ఉద‌యం నుంచి ఈరోజు ఉద‌యం వ‌ర‌కు కొత్త‌గా 941 మంది మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మృతుల సంఖ్య 50,921కు పెరిగింద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది. 
 
ఇకపోతే, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 894 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ ‌హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 147 నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 92,255 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. 
 
అలాగే, వైరస్‌ ప్రభావంతో ఇవాళ 10 మంది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 703కు చేరింది. ఇవాళ 2,006 మంది వైరస్‌ బారి నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 70,132 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 21,420 మంది మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇంట్లో, ఐసోలేషన్‌ కేంద్రాల్లో 14,404 మంది ఉన్నారు.
 
గడిచిన 24 గంటల వ్యవధిలో 8794 మందికి కొవిడ్ -19 ‌పరీక్షలు చేయగా, ఇప్పటివరకు 7,53,349 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల వ్యవధిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 147, రంగారెడ్డి జిల్లాలో 85, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో 51 కరోనా పాజిటివ్ ‌కేసులు నమోదైనట్లు వివరించింది. 
 
భద్రాద్రి కొత్తగూడెంలో 9, ఖమ్మంలో 44, వరంగల్‌ అర్బన్‌జిల్లాలో 44, వరంగల్ ‌గ్రామీణ జిల్లాలో 9 చొప్పున, ఆదిలాబాద్‌ జిల్లాలో 10, జగిత్యాల జిల్లాలో 31, జనగామా జిల్లాలో 7, జోగుళాంబా గద్వాల జిల్లాలో 21, నల్గొండ జిల్లాల్లో 37, కామారెడ్డి జిల్లాల్లో 7, సిద్దిపేట జిల్లాల్లో 58, సిరిసిల్ల జిల్లాల్లో 2, గద్వాల జిల్లాల్లో 21, పెద్దపల్లి జిల్లాల్లో 62 , సూర్యాపేట జిల్లాల్లో 12, నిజమాబాద్‌ 38, మహబూబాబాద్‌ జిల్లాల్లో 31 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
 
మూడు కోట్లు దాటిన క‌రోనా టెస్టులు 
మరోవైపు, ఆగ‌స్టు 16వ తేదీన 7,31,697 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని, ఆదివారం వరకు దేశ‌వ్యాప్తంగా 3,00,41,400 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక్ రిసెర్చ్ (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా ప‌రీక్ష‌లు మూడు కోట్ల మార్కును దాటాయ‌ని తెలి‌పింది.