మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 జూన్ 2021 (09:23 IST)

కోవిడ్ బాధితుల్లో సైటోమోగాల వైరస్.. ఒకరి మృతి

కరోనా వైరస్ బారినపడిన బాధితుల్లో అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇపుడు మరో అనారగ్య సమస్య వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు కొవిడ్ బాధితుల్లో సైటోమెగాలో వైరస్ (సీఎంవీ) సంబంధిత మలద్వార రక్తస్రావం కనిపించినట్టు వైద్యులు తెలిపారు. వీరిలో ఒకరు చనిపోయినట్టు చెప్పారు. 
 
ఈ బాధితుల్లో రోగ నిరోధక శక్తి బాగానే ఉన్నప్పటికీ ఈ సమస్య వెలుగు చూడడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. కరోనా బారినపడిన 20-30 రోజుల తర్వాత వీరిలో ఈ లక్షణాలు కనిపించినట్టు వివరించారు. 
 
నిజానికి ఇప్పటివరకు రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న రోగుల్లో మాత్రమే అంటే.. కేన్సర్, ఎయిడ్స్ రోగులతోపాటు అవయవ మార్పిడి చేయించుకున్న వారిలో మాత్రమే ఈ సమస్య కనిపించగా, తాజాగా రోగ నిరోధక శక్తి సాధారణంగా ఉన్నప్పటికీ ఈ ఐదుగురిలో సీఎంవీ ఇన్ఫెక్షన్‌ కనిపించినట్టు వైద్యులు తెలిపారు.
 
సీఎంవీ సమస్య కనిపించిన బాధితుల్లో కడుపు నొప్పి, మలవిసర్జన సమయంలో రక్తం పడడం వంటి లక్షణాలు కనిపించినట్టు ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ అరోరా తెలిపారు. కొవిడ్ చికిత్స కోసం ఉపయోగించే స్టెరాయిడ్ల కారణంగా రోగనిరోధక శక్తి తగ్గుతోందని, ఫలితంగా ఇలాంటి రుగ్మతలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు.