1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (13:19 IST)

జేఎంఎం చీఫ్‌ శిబుసోరేన్ ఆరోగ్యం విషమం - హర్యానా మంత్రికి పాజిటివ్

జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి శిబుసోరెన్ ఆరోగ్యం విష‌మించింది. దీంతో ఆయనను గురుగ్రామ్‌లోని మెదాంత ఆసుపత్రికి తరలించారు. కరోనా వైరస్‌తో బాధపడుతున్న శిబు సోరెన్ ప్రస్తుతం రాంచీలోని మెదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
అయితే, ఈయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుకావ‌డంతో సోమవారం రాంచీలోని మెదాంత ఆసుపత్రిలో చేరారు. అతనికి డయాబెటిస్‌తో సహా ఇతర వ్యాధులు కూడా ఉన్నాయి. దీంతో రాంచీలోని వైద్యులు ముందుజాగ్రత్త చ‌ర్య‌గా ఆయనను గురుగ్రామ్‌లోని మెదాంత‌ ఆసుపత్రికి త‌ర‌లించారు. 
 
శిబు సోరెన్‌తోపాటు అతని భార్య రూపి సోరెన్ కూడా కరోనా పాజిటివ్‌గా తేలారు. శిబు సోరెన్ త్వరగా కోలుకోవాలని పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పూజ‌లు చేస్తున్నారు. 
 
హర్యానా మంత్రికి పాజిటివ్
మరోవైపు, హర్యానా కేబినెట్ మంత్రి మూల్ చంద్ శర్మకు కరోనా పాజిటివ్ అని మంగళవారం తేలింది. హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు కరోనా సోకిన రెండో రోజే అతని కేబినెట్ మంత్రి మూల్ చంద్ శర్మకు కరోనా సోకింది. 
 
తనకు కరోనా సోకిందని హర్యానా రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మూల్ చంద్ శర్మ మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి మూల్ చంద్ కోరారు.
 
సోమవారం జరిపిన పరీక్షల్లో హర్యానా అసెంబ్లీ స్పీకరు జియాన్ చంద్ గుప్తా, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా కరోనా సోకింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కలిసి సమావేశంలో పాల్గొనడం వల్ల హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌కు కరోనా వచ్చింది.