కేంద్రం హెచ్ఆర్డీ మంత్రికి కరోనా పాజిటివ్ - 38 మంది ఖైదీలకు కూడా...
కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. పేదల నుంచి వీవీఐపీల వరకు ప్రతి ఒక్కరినీ కాటేస్తోంది. తాజాగా కేంద్ర విద్యాశాఖామంత్రి రమేష్ పోఖ్రియాల్ ఈ వైరస్ బారినపడ్డారు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ రోజు చేయించుకున్న కరోనా నిర్ధారణ పరీక్షల్లో నాకు పాజిటివ్‌గా తేలింది. మా వైద్యులు సూచించినట్లుగా నేను చికిత్స తీసుకుంటూ, మెడిసిన్ వాడుతున్నాను.
ఇటీవలి కాలంలో తనను కలిసిన అధికారులు, మిత్రులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. అందరూ కరోనా పరీక్షలు చేయించుకోండి. కొద్ది రోజులపాటు హోమ్ క్వారెంటైన్‌లో ఉండండి అని పోఖ్రియాల్ సూచించారు.
కాగా, దేశంలో కరోనా మహమ్మారి బారినపడుతున్న రాజకీయ ప్రముఖుల జాబితా అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెల్సిందే. సోమవారం భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు కరోనా పాజిటివ్ రాగా, మంగళవారం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి కరోనా వైరస్ సోకింది.
ఇదిలావుంటే, మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉన్నది. గత రెండు వారాలుగా రోజూ 50 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. బయటి జనాలనేగాక ఇప్పుడు జైల్లో ఖైదీలను కూడా కరోనా గడగడలాడిస్తున్నది.
ముంబైలోని బైకులా జైల్లో బుధవారం 38 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. షీనా బోరా హత్యకేసులో దోషిగా తేలిన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జి కూడా ప్రస్తుతం ఆ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నది. కరోనా పాజిటివ్ వచ్చిన 38 మంది ఖైదీల్లో ఇంద్రాణి కూడా ఉన్నారు.