శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2020 (08:01 IST)

శీతాకాలంలో కరోనాకు రెక్కలొస్తాయ్.. జాగ్రత్త..!

అవును.. శీతాకాలంలో కరోనాకు రెక్కలొస్తాయ్.. జాగ్రత్త.. అంటూ హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. శీతాకాలంలో కరోనా వైరస్‌ మరింత ఉద్ధృతంగా విజృంభించే ముప్పు వుందని వారు హెచ్చరిస్తున్నారు. చైనాలోని వుహాన్‌ కేంద్రంగా ప్రబలిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను కష్టాల్లోకి నెట్టింది. ఇంకా అన్ని రుతువులను తట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.
 
అయితే మిగతా శ్వాసకోశ వైరస్‌లతో పోల్చితే, చలికాలంలో కరోనా వైరస్‌ మరింతగా వ్యాపించే ప్రమాదముందని ఢిల్లీలోని ఫోర్టిస్‌ ఆసుపత్రి శ్వాసకోశ నిపుణురాలు డా.రిచా సరీన్‌ చెప్పారు. చలి, పొడి వాతావరణంలో వైరస్‌ జీవితకాలం ఎక్కువగా ఉంటుంది. గాలిలో తేమ తగ్గినా కరోనా వ్యాప్తి ముప్పు పెరుగుతుందని సరీన్ తెలిపారు. 
 
చలికాలంలో సూర్యరశ్మి సరిగా అందక ప్రజల్లో విటమిన్‌-డి స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గుతుందని తద్వారా కోవిడ్ విజృంభణ తప్పదని హెచ్చరించారు. కానీ మాస్కు ధరించడం వంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా కొవిడ్‌ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని రిచా సూచించారు.
 
ఇదిలా ఉంటే.. రోనా, దాని ప్రభావం పై జరుగుతున్న పరిశోధనల్లో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కరోనా శ్వాస వ్యవస్థపై మాత్రమే కాదు.. గుండె, కిడ్నీ, లివర్‌ వంటి అవయవాలపైనా ప్రభావం చూపుతోందని అధ్యయనాలు చెప్తున్నాయి. కరోనా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా కబళించింది. మానవ శరీరంలోని ఏ భాగాన్నీ కరోనా వదలటం లేదు. ఊపిరితిత్తులు, గుండే, కిడ్నీ, రక్తం, మెదడు, కండరాలు ఇలా అణువణువునూ వైరస్‌ కబళిస్తోంది.
 
ఈ మధ్యకాలంలో చాలామందికి కరోనా లక్షణాలు లేకుండానే పాజిటివ్‌ వస్తుంది. లక్షణాలు లేవు కదా అని రిలాక్స్‌ అవుతున్న వాళ్లు ఆ తరువాత డేంజర్‌లో పడుతున్నారు. ఉన్నట్టుండి చెస్ట్ పెయిన్ రావటం, పక్షవాతం రావటం, కిడ్నీ సమస్యలు రావటం పెరిగిపోతున్నాయి. ఇలాంటి కేసులను పరిశీలిస్తే కరోనా ప్రభావం ఒక్కొక్కరిపై ఒక్కో రకంగా ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.