కరోనా బారిన క్రికెటర్ భువీ కుటుంబం- ఐసోలేషన్‌లోకి భువి జంట
క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ కుటుంబం కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. భువనేశ్వర్ కుమార్ తండ్రి కిరణ్ పాల్ సింగ్, మే 21న క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న భువనేశ్వర్ కుమార్, అతని భార్య నుపూర్‌లో కరోనా లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా వైద్య పరీక్షల ఫలితాలు తెలియరాలేదు.
అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో ఎవరికైనా కరోనా వచ్చి వుండవచ్చునని భువి జంట భావిస్తోంది. భారత జట్టు తరుపున 21 టెస్టులు ఆడిన భువనేశ్వర్ కుమార్, 63 వికెట్లు పడగొట్టాడు. 2014 ఇంగ్లాండ్ టూర్‌లో మూడు హాఫ్ సెంచరీలతో పాటు రెండుసార్లు ఐదేసీ వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు భువనేశ్వర్ కుమార్.