బ్రిస్బేన్ ట్వంటీ-20.. నాలుగే నాలుగు పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం
భారత్ -ఆస్ట్రేలియాల మధ్య బ్రిస్బేన్‌లో జరిగిన తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత్ నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్లు పోరాడినా.. ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. తద్వారా మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా 17 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు సాధించింది.
ఈ నేపథ్యంలో డక్ వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం టీమిండియా విజయలక్ష్యాన్ని 174 పరుగులుగా నిర్ణయించారు. దీంతో 17 ఓవర్లలో 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ బ్యాట్స్‌మెన్లు గెలుపు దిశగా స్కోర్ బోర్డును పరిగెత్తింపజేశారు. కానీ కంగారూల బౌలింగ్‌కు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు ఒత్తిడికి గురి కావడంతో.. చివరి బంతుల్లో పరుగులు రాబట్టలేకపోయారు. ఫలితంగా 17 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేయగలిగారు.
భారత బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ శిఖర్ ధావన్ 76 పరుగులతో జట్టుకు మంచి స్కోర్ సాధించిపెట్టాడు. మిగిలిన ఆటగాళ్లలో శర్మ (7), రాహుల్ (13), కోహ్లీ (4), ఆర్ఆర్ పాంట్ (20), కార్తీక్ (30) రాణించినా.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు కుమార్ (1), కులదీప్ (4) ఒత్తిడిని జయించి ఆడలేకపోయారు. ఫలితంగా ఆసీస్ నాలుగు పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. ఆసీస్ బౌలర్లలో బెహ్రెన్‌డ్రూఫ్, స్టాన్‌లేక్, టైలు తలా ఒక్కో వికెట్‌ను తన ఖాతాలో వేసుకోగా, జంపా, స్టోనిస్ చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో షార్ట్ 7, పించ్ 27, లిన్ 37, మ్యాక్స్ వెల్ 46 పరుగులు చేశారు. స్టోయినిస్ 33, మెక్ డర్మాట్ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా, బుమ్రా, కేకే అహ్మద్‌లు చెరో వికెట్ పడగొట్టారు.