మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (14:20 IST)

హామిల్టన్ ట్వంటీ20 : భారత్ ముంగిట 213 లక్ష్యం

హామిల్టన్ వేదికగా ఆదివారం జరుగుతున్న ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్ ముంగిట 213 పరుగుల విజయలక్ష్యాన్ని ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు ముంచింది. ఈ మ్యాచ్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్లు చెలరేగి ఆడారు.

ముఖ్యంగా, సీఫెర్ట్, మన్రో, గ్రాండ్‌హోం వంటి ఆటగాళ్లు చెలరేగిపోవడంతో 20 ఓవర్లలో న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఓపెనర్లు సీఫెర్ట్, మన్రో 7.4 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. మన్రో కేవలం 40 బంతుల్లోనే 5 సిక్స్‌లు, 5 ఫోర్లతో 72 పరుగులు చేశాడు. మరోవైపు సీఫెర్ట్ కూడా కేవలం 25 బంతుల్లో 3 సిక్స్‌లు, 3 ఫోర్లతో 43 పరుగులు చేశాడు. 
 
అత్యంత ప్రమాదకారిగా కనిపిస్తున్న అతన్ని ధోనీ ఓ మెరుపు స్టంపింగ్‌తో ఔట్ చేశాడు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ తప్ప మిగతా బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కృనాల్ పాండ్యా అయితే 4 ఓవర్లలో ఏకంగా 54 పరుగులు ఇచ్చాడు. హార్దిక్ 4 ఓవర్లలో 44 పరుగులు, భువనేశ్వర్ 37 పరుగులు, ఖలీల్ అహ్మద్ 47 పరుగులు ఇచ్చారు. 
 
కుల్దీప్ మాత్రమే 4 ఓవర్లలో కేవలం 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. గ్రాండ్‌హోమ్ 30, విలియమ్సన్ 27 పరుగులు చేశారు. కివీస్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్ గెలవాలని అనుకుంటున్న టీమిండియాకు ఈ భారీ స్కోరు చేజ్ చేయడం పెద్ద సవాలే.