శుక్రవారం, 22 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి

ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు

team india
ఇంగ్లండ్ గడ్డపై భారత అమ్మాయిలు అదరగొట్టారు. ఇంగ్లండ్ మట్టిపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. రెండో వన్డేలో అద్భుత విజయం సాధించి మరో మ్యాచ్‌ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్నారు. తద్వారా 23 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ గడ్డపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్రను లిఖించారు. 
 
ఈ చారిత్రాత్మక విజయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రేణుకా సింగ్ కీలక పాత్రల పోషించారు. మొదట హర్మన్‌ప్రీత్ కౌర్ ఇంగ్లిష్ బౌలర్లను చిత్తు చేసి అజేయంగా 143 పరుగులు చేయగా.. ఆపై రేణుక స్వింగ్‌ ధాటికి ఇంగ్లిష్‌ జట్టు 245 పరుగులకే కుప్పకూలింది. దీంతో రెండో వన్డేలో 88 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్లకు 333 పరుగులు చేసింది. అయితే భారతజట్టుకు ప్రారంభంలో సరైన ఆరంభం దక్కలేదు. అయితే స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ జట్టును గట్టెక్కించే బాధ్యతలను తీసుకున్నారు. అయితే 99 పరుగుల వద్ద మంధాన కూడా పెవిలియన్‌కు చేరుకుంది. దీంతో కెప్టెన్‌ హర్మన్‌పై మొత్తం భారం పడింది. 
 
అందుకు తగ్గట్టుగానే హర్లీన్ డియోల్‌ (58)తో కలిసి జట్టు స్కోరును 200 పరుగులు దాటించింది. 212 పరుగుల వద్ద హర్లీన్ ఔటైనా పూజా వస్త్రాకర్‌, దీప్తి శర్మ సహకారంతో జట్టు స్కోరును 333 పరుగులకు చేర్చింది. హర్మన్‌ప్రీత్ మొత్తం 111 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో 143 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచింది.