శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 మార్చి 2018 (09:01 IST)

నరాలు తెగే ఉత్కంఠ.. బంగ్లాదేశ్‌పై భారత్ థ్రిల్లింగ్ విజయం

నరాలు తెగే ఉత్కంఠ.. ఒకప్పుడు దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ ఆడుతుంటే ఏ స్థాయిలో టెన్షన్ ఉండేదో.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అంతకుమించిన ఉత్కంఠ... టెన్షన్. భారత్ విజయానికి ఆఖరి బంతికి ఐదు పరుగులు సాధించ

నరాలు తెగే ఉత్కంఠ.. ఒకప్పుడు దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ ఆడుతుంటే ఏ స్థాయిలో టెన్షన్ ఉండేదో.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అంతకుమించిన ఉత్కంఠ... టెన్షన్. భారత్ విజయానికి ఆఖరి బంతికి ఐదు పరుగులు సాధించాలి. సిక్సర్ కొడితేనే గెలుపు. ఈ సమయంలో స్టైకింగ్‌లో ఉన్న దినేశ్ కార్తీక్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. బంగ్లాదేశ్ బౌలర్ సౌమ్య సర్కార్ కాసింత నమ్మకంతో బంతిని సంధించాడో లేదో దినేశ్ కొట్టిన షాట్‌కు బంతి ఫీల్డర్ల మీదుగా వెళ్లి బౌండరీ అవతల పడింది. బంగ్లా ఆటగాళ్లకు మాత్రం ఏం జరిగిందో తెలియని స్థితిలోనే ఉండిపోయారు. భారత డ్రెస్సింగ్‌రూమ్‌లో కేరింతలతో స్టేడియం దద్దరిల్లిపోయింది. భారత క్రికెటర్లు గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి దినేశ్‌కు తమదైన స్టైల్లో అభినందనలు తెలిపారు. ఆఖరి బంతికి సిక్సర్ బాదిన దినేశ్ కార్తీక్ టోర్నీకే హీరోగా నిలిచాడు.
 
ఆదివారం రాత్రి కొలంబోలోని ప్రమదాస స్టేడియం వేదికగా భారత్‌, బంగ్లాదేశ్ మధ్య టీ-20 ముక్కోణపు టోర్నీ ఫైనల్ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి సిరీస్‌ను కైవసం చేసుకుంది. శిఖర్ ధావన్ 10, రోహిత్ శర్మ 56, లోకేష్ రాహుల్ 24, దినేష్ కార్తీక్ 29(నాటౌట్) మనీష్ పాండే 28, విజయ్ శంకర్ 17 చొప్పున పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో రుబెల్ హసన్ 2 వికెట్లు పడగొట్టగా.. షకీబుల్ హాసన్, ఇస్లాం, ముస్తాఫిజూర్, సౌమ్య సర్కార్ తలా ఒకెట్ తీసుకున్నారు.
 
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166పరుగులు చేసింది. బంగ్లా బ్యాట్స్‌మెన్లలో రహ్మాన్ 77 పరుగులు, మహ్మదుల్లా 21, హసన్ 19, ఇక్బాల్ 15, దాస్ 11 చొప్పున పరుగులు చేయగా, భారత్ బౌలర్లు చాహల్ 3 వికెట్లు, ఉనాద్కట్ రెండు, సుందర్ ఒకటి చొప్పున వికెట్లు తీశారు. ఫలితంగా 167 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన ఉత్కంఠభరితమైన విజయాన్ని నమోదు చేసుకుంది. దినేష్ కార్తిక్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.